మృత్యు వీచిక | family died in road accident | Sakshi
Sakshi News home page

మృత్యు వీచిక

Published Fri, Feb 7 2014 4:12 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

family died in road accident

మహబూబ్‌నగర్ వ్యవసాయం,భూత్పూర్,న్యూస్‌లైన్: విధి పగపట్టింది. ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యు ఒడికి చేర్చి తానెంత కఠినమో చెప్పింది. అనుకోని విధంగా అంతా ఈ లోకాన్ని వీడితే కాలుని ఎదిరించి గెలిచిన చిన్నారి స్వాతి ఒక్కర్తే మిగిలి అరవై ఏళ్లు పైబడిన తాత సురేష్‌కు కొత్త భారాన్ని ఎత్తుకోమని చెప్తోంది.
 
 ఇదీ భూత్పూర్ మండలం అమిస్తాపూర్‌కు చెందిన కెంద్యాల శ్రీనివాసులు సహా కుటుంబీకుల విషాన్మరణం. గ్రామాన్నంతటినీ కుదిపేసిన సంఘటన.
 
  శ్రీనివాస్ (32)  బావమర్ది మల్లేష్ అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం చనిపోయాడు. దానికి హాజరయ్యేందుకు   అమ్రాబాద్ మండలం వంకేశ్వరానికి  తన కుటుంబ సభ్యులతో శ్రీనివాసులు సొంత ఆటోలో  బుధవారం వేకువన  4గంటలకు   తల్లి సుశీల (50) భార్య సునీత (28)  కుమార్తె స్వాతి (6), కుమారులు శివకుమార్ (4), సాయికృష్ణ (ఏడాదిన్నర)లతో బయలు దేరాడు. అచ్చంపేట శివారులోకి రాగానే ఎదురుగా వెళ్తున్న సైకిలిస్టును తప్పించబోయి వేగంగా ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌కు చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో   సుశీల, శ్రీనివాస్, సునీతలు దుర్మరణం చెందగా, శివకుమార్, సాయికృష్ణలు చికిత్సకు తరలిస్తుండగా మృతి చెందారు. స్వాతి మాత్రం తీవ్ర గాయాలతో మృత్యువు నుండి తప్పించుకుంది. ఆమెకు కుడికాలు తొడ భాగంలో ఎముక విరిగి పోయింది.
 
 అత్తా  అమ్మేది...ఆకలేస్తోంది...
 ఆ పసిబిడ్డకు తన చుట్టు  ఏం జరగుతోందో తెలీని వయస్సు.  అమ్మా, నాన్న, నాన్నమ్మలతో పాటు తన తోబుట్టువులూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారనీ తెలీదు. తనకు దెబ్బతగిలి కాలు పోగొట్టుకున్నా ఆ తీవ్రతా అంచనావ వేసుకోలేని పసి మనస్సు.  ఏ అదృశ్య శక్తో ఆమెను మృత్యు ఒడినుంచి తప్పించడంతో   గాయాలతో బయట పడింది. చికిత్సలందించి ఆమెను అమిస్తాపూర్‌కు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తెచ్చారు. మరో వైపు ప్రమాదంలో విగతజీవులైనవారి మృత దేహాలనూ ఖననం కోసం ఇంటికి తెచ్చారు.  బంధువులు, మిగిలిన కుటుం బీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మరోవైపు పాప తీరు వారిని కలచివేస్తోంది.   లేవలేని స్థితిలో  ఉన్న ఆమెకు ఇంకా అసలు స్థితి అర్థం కావడంలేదు.  ఇంట్లో ఉన్న మేనత్త నాగమణి ,బాబాయి శ్రీశైలంలను చూస్తూ అమ్మ ఎక్కడుందీ... ఆకలిగా ఉందనడంతో కుటుంబీకులు గొల్లుమన్నారు. స్వాతికి ఏం చెప్పాలో తెలీక గుండెలవిశేలా రోదించారు.  తనకు ఉదయమూ ఏమీ తినిపించకుండా ఊరికి తీసుకెళ్లారని చెప్పడంతో  అసలు విషయాన్ని గుండెల్లోనే పెట్టుకొని  ఆమెకు సమీప బంధువులు తమ ఇంటికి తీసుకెళ్లి అన్నం తినిపించారు.
 
 మలి సంధ్యలో...
 రోడ్డు ప్రమాదంలో తన భార్య,పెద్ద కుమారుడు, కోడలు, వారి ఇద్దరి పిల్లలను చనిపోయి ఒంటరిగా మిగిలిన సురేష్ చిన్నప్పటి నుండే కష్టాలు ఎదుర్కొన్నాడని  గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరిచారు. కాయకష్టం చేసి పెంచి పెద్దచేసిన కొడుకులు చేతికి వచ్చారని  ఆ తండ్రి మురిసిపేయేవాడు.
 
  మనమలు, మనుమరాళ్లతో  హాయిగా గడపవచ్చు అనుకున్నాడు. విధి వేరేలా తీర్పు చెప్పింది. అతన  భార్య సుశీలే ఇంటి వ్యవహారాలను చక్కదిద్దేది. పెద్ద కుమారుడు శ్రీనివాసులు ఇంటిని ఆటో ఆధారంగా పోషించేవాడు.  కోడలు సునీతలు వారి పిల్లలు శివకుమార్, సాయికష్ణలు అందరికీ తలలో నాలుకలా ఉండేవారు. ఇప్పుడు వారిని  రోడ్డు ప్రమాదం ఈ లోకాన్నుంచి దూరం చేసింది.  ఇదేదీ నమ్మలేని  స్థితిలో ఉన్నాడు సురేష్. కాలు విరిగి ప్రాణాలతో బయటపడ్డ మనుమరాలిని  చూసి మౌనంగా రోదిస్తూనే ఉన్నాడు.  ప్రస్తుతం తాను  చిన్న కుమారుడు శ్రీశైలమే మిగిలామని ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదని కన్నీటి పర్యంతమవుతున్నాడు.  
 
 చిన్న కొడుకుపైనే భారం
 ఇంటికి దిక్కయిన పెద్దకుమారుడు చనిపోవడంతో ఆ ఇంటి భారం అంతా చిన్నకుమారుడైన శ్రీశైలంపై పడింది. అతను  కూడా అద్దె ఆటోను నడిపిస్తూ అన్నయ్య కు, తండ్రికి తోడుగా ఉండేవాడు. వారి కున్న  రెండెకరాల భూమిలో సాగునీటి వసతి లేక పోవడంతో జొన్న పంటను మాత్రమే వేస్తుంటారు. ఇలా ఆ కుటుం బం అనుకోని రీతిలో ఆర్థికంగానూ చితికి పోయింది. ఇప్పుడు శ్రీశైలమే అన్నీ చూసుకొని తండ్రికి తోడుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక స్వాతి బాధ్యత కూడా వారికి సవాల్‌గానే మారింది.
 
 అన్నా  ఏడవోయినవ్...
 రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీనివాస్‌కు ఒక చెల్లెలు నాగమ ణి,  తమ్ముడు శ్రీశైలంలు ఉన్నా రు. నాగమణికి సరిగ్గా నాలుగునెలల కిందటే హైదరాబాద్‌కు చెందిన సుమన్‌తో వివాహం అయ్యింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తన అన్న చనిపోయాడనే  విషయం తెలిసిన వెంటనే ఆమె ఆర్తనాదాలు మిన్నంటాయి.
 
 శ్రీనివాస్ చెల్లెలు‘ అన్నా...ఏడవోయినవ్...ఇగ రావా’  అని  గుండెలు బాదుకొని రోదించడం అందర్నీ కదిలించింది.  ‘పండగకు నన్ను తీసుకోచ్చేది ఎవరు మళ్లీ  వస్తానంటూ ఎళ్లిపోయావా’ అంటూ  సోదరునితో జ్ఞాపకాలను తలచుకుంటూ కుమిలిపోయింది.  తల్లి కూడా తన తండ్రిని ఒంటరిని చేసి వెళ్లిపోయిందని వచ్చిన బంధువులను పట్టుకొని ప్రశ్నించడం అందర్నీ కంటతడిపెట్టించింది.   శ్రీశైలం కూడా తల్లిని,అన్నను అన్నపిల్లలను తలుచుకుంటూ రోదించాడు.
 
 గతంలో కూడా
 ఒక కుమారుడు మత్యువాత...
 ఎదుగుతున్న పిల్లలను చూసి ఆనంద పడుతున్న సమయంలో సరిగ్గా 2005 సంవత్సరంలో సురేష్ రెండో  కుమారుడు చంద్రశేఖర్ కొన్ని అనివార్య కారణాలతో అకాల మరణం పొందాడు.దీంతో ఇప్పటి వరకు అతని మరణాన్ని ఆ కుటుంబ సభ్యులు మరిచిపోలేక పోతున్నారు.తాజాగా మొత్తం కుటుంబమే  ఈ లోకానికి అర్థాంతరంగా గుడ్‌బై చెప్పడంతో కోలుకోలేని స్థితి ఏర్పడింది.
 
 విషాద...వేళలు
 ఉదయం 4గంటలు..
 అమ్రాబాద్ మండల పరిధిలోని వంకేశ్వరం గ్రామంలో తన బావమరిది అంత్యక్రియలకు వెళ్లేందుకు శ్రీనివాసులు అమిస్తాపూర్‌లో కుటుంబీకులతో తన ఆటోలో బయలు దేరాడు.
 4:05 గంటలకు భూత్పూర్ దాటి అచ్చంపేటవైపునకు తన ప్రయాణాన్ని సాగించాడు.
 5:15 గంటలకు నాగర్‌కర్నూల్ దాటారు.
 
 6:05 గంటల సమయంలో అచ్చంపేటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న   ఉన్న జేయంజే పాఠశాల సమీపంలో  వాటర్‌ట్యాంకర్ వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. సుశీల,శ్రీనివాస్,సునీతల దుర్మరణం. శివకుమార్,సాయికష్ణలు అనంతరం మృత్యువాత.
 6:10 గంటలకు ప్రమాదంజరిగిన విషయం గమనించిన వాహనచోదకులు, వాకర్స్ గాయాలతో భాదపడుతున్న స్వాతిని స్థానిక అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.
     06:15 గంటలకు ఘటనా స్థలంలో పడిన  శ్రీనువాసులు సెల్‌ఫోన్ ఫోన్‌బుక్ ఆధారంగా  అమిస్తాపూర్ గ్రామానికి చెందిన అరవింద్‌కు సమాచారం అందించారు.కాగా శ్రీనివాసులు తన మిత్రుడు ఆటో డ్రైవర్ పెంటయ్య సెల్‌ఫోన్‌ను వెంట తీసుకెళ్ళాడు.ఆ సెల్ నుండి ఫోన్‌రావడంతో అరవింద్, పెంటయ్యనే మత్యువాత పడ్డడేమోనని అతని ఇంటికి సమాచారం చెప్పడానికి బయలు దేరారు.ఆయన ఇంటి దగ్గరనే ఉండడంతో శ్రీనివాసులు విషయం తెల్సింది.  అదే నంబర్‌కు ఫోన్ చేసి  వివరాలను వారు తెలుసుకున్నారు.దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులే మరణించారని సమాచారం ధ్రువపడింది.
 
 6:20 గంటలకు పెంటయ్య తదితరులు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు.
 6:30  గంటల సమయంలో ఆ నోట ఈ నోట10 నిమిషాల్లోనే ఊరంతా పాకింది.
 7:00 గంటలకు శ్రీనివాస్  నివాసం విషాదంలో మునిగిపోయింది.
 8:00 గంటలకు అతని సభ్యులు, గ్రామస్తులు  డీసీఎంలో బయలు దేరి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
 సాయంత్రం 05:30 గంటలకు విగతజీవులుగా మారిన వారి దేహాలను అమిస్తాపూర్ గ్రామానికి తీసుకువచ్చారు.
 6:10 గంటల సమయంలో శోకతప్త హృదయాలతో ఇంటి నుండి  శవాలను ఖననం చేసేందుకు శ్మశాన వాటికకు తీసుకెళ్లి ఖననపరిచారు.
 
 మిన్నంటిన బంధువుల రోదనలు
 బల్మూర్,న్యూస్‌లైన్: ఆటో ప్రమాదంలో తమ బంధువులు మృతిచెందారన్న విషయాన్ని తెలుసుకున్న భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వాసులు పెద్ద సంఖ్యలో డీసీఎంలో ఇక్కడికి తరలి వచ్చారు. వారు సంఘటనలో విగతజీవులై పడి ఉన్న తమ ఆప్తులను చూసి గుండెలవిశేలా రోదించారు. ఈ సంఘటనతో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తీవ్ర  విషద ఛాయలు అలుముకున్నాయి.అచ్చంపేట ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలను చూసేందుకు బంధువులు, జనం తండోపడంతాలుగా తరలి రావడంతో ఆస్పత్రి ఆవరణంతా కిక్కిరిసి పోయింది.  శ్రీనువాసులు, అతని తల్లి సుశీల, భార్య సునీత, కుమారులు శివకుమార్, ఆనంద్‌ల మృతదేహాలను చూసి అంతా చలించి పోయారు. మృతదేహాలను చూసేందుకు జనం వస్తుండటంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబంస్తు ఏర్పాటు చేశారు.
 
 మృతుల కుటుంబానికి
  ప్రభుత్వ ఆర్థిక సాయం
 బల్మూర్,న్యూస్‌లైన్: మండలంలోని పోలిశెట్టిపల్లి సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అమిస్తాపూర్ గ్రామానికి చెందిన శ్రీనువాసులు, అతని తల్లి,భార్య, కుమారుల మృతదేహాలను అచ్చంపేట ఆస్పత్రిలో నాగర్‌కర్నూల్ ఆర్డీవో కిమ్యానాయక్ పరిశీలించి విచారం వ్యక్తం చేశారు.
 
 ఈ సందర్భంగా కుటుంబసభ్యులను ఓదార్చిన ఆయన  మృతుల కుంటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆర్థిక సహాయంగా(ఎన్‌ఎఫ్‌బీఎస్) రూ.10వేల నగదును అందజేశారు. వారికి ప్రభుత్వం ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించేందుకు  ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఆయన తెలిపారు.ఆయన వెంట తహశీల్దార్ రాంబాయి, ఆర్‌ఐలు మోతీలాల్, సరస్పతి, వీఆర్వోలు వెంకటప్ప, చిన్నయ్యలు ఉన్నారు.
 
 రైతు కూడా...
 -ప్రమాదంలో రైతుకు గాయాలు..
 పోలీశెట్టిపల్లి శివారులో జరిగిన ఈప్రమాదంలో ఇదే గ్రామానికి చెందిన ఓరైతు కూడా గాయాల పాలైయ్యాడు. రైతు కొమ్ము నిరంజన్ తన సైకిల్‌పై తన పొలానికి వెళ్తున్నాడు. అతనికి  ఎదురుగా వచ్చిన వాటర్ ట్యాంకర్ దూసుకు  వస్తుండటంతో  తప్పించుకున్న ఆయన కింద పడి లేచే లోపే అతని వెనుకాలే వస్తున్న అటోను ఢీకొట్టినట్లు భాదితుడు తెలిపాడు.దీంతో  రైతు కాళ్లు, ముఖానికి  గాయాలయ్యాయి.
 
 -సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ: ఆంథోనప్ప
 ప్రమాద విషయాన్ని తెలుసుకున్న  నాగర్‌కర్నూల్ డీఎస్పీ అంథోనప్ప ప్రమాద స్థలాన్నికి చేరుకొని  పరిశీలించారు. అనంతరం ఆయన అచ్చంపేట ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలను పరిశీలించి, కారణాలను తెలుసుకున్నారు.  ఈ సందంర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదంపై మృతుల కుటుంబసభ్యుడు పరమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. అనంతరం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.కాగా గాయాల పాలైన స్వాతిని  తహశీల్దార్ రాంబాయి అంబులెన్స్ ఏర్పాటు చేయించి చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఎస్‌వీఎస్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement