పర్చూరు, న్యూస్‌లైన్:
రైతుల పేరుతో దొంగ పత్రాలు సృష్టించి రుణాలు తీసుకున్న శీతల గిడ్డంగి యాజమాన్యం, బ్రోకర్ల మోసానికి తాము బలయ్యామని బాధిత రైతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొల్లులోని రామతులశమ్మ కోల్డ్ స్టోరేజీలో యాజమాన్యం, బ్రోకర్లు కలిసి రైతుల పేరుతో రుణాలు తీసుకొని బ్యాంకును మోసగించిన కేసులో ఈనెల 11వ తేదీన 27 మంది రైతులకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రైతులు ఒంగోలు సబ్‌జైలులోనే ఉన్నారు. రిమాండ్ గడువు ముగియడంతో మంగళవారం వీరిని బందోబస్తు మధ్య పర్చూరు కోర్టుకు తీసుకొచ్చారు. వీరి రాకకోసం నిరీక్షిస్తున్న కుటుంబ సభ్యులు పోలీసు వాహనాలు కోర్టు వద్దకు రాగానే ఉద్వేగానికి లోనయ్యారు. బేడీలతో ఉన్న రైతులను చూసి బోరున విలపించారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ వారితో కలిసి మాట్లాడుకునేందుకు
పోలీసులు అవకాశమిస్తారని కుటుంబ సభ్యులు ఆశించారు. కానీ కోర్టులో రిమాండ్ పొడిగించిన తర్వాత రైతులను నేరుగా వాహనం ఎక్కించి ఒంగోలు తరలించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తమవారిని చూసుకోవాలని ఎగబడ్డారు. వారి కోసం తెచ్చిన తినుబండారాలను సైతం ఇవ్వనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో మరింత ఆవేదన చెందారు. శీతల గిడ్డంగి యాజమాన్యం, బ్రోకర్లు కలిసి మాయమాటలు చెప్పి సంతకాలు చేయించుకొని రుణాలు తీసుకున్నారని, తీరా బ్యాంకుకు సొమ్ము చెల్లించకుండా మోసం చేశారని వాపోయారు. వారి మాటలు నమ్మి సంతకం పెట్టిన పాపానికి కేసుల్లో ఇరుక్కొని నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మోసానికి పాల్పడిన శీతల గిడ్డంగుల యాజమాన్యాన్ని, సరుకు సరిచూసుకోకుండా రుణాలిచ్చిన బ్యాంకు సిబ్బందిని అరెస్టు చేయాలని బాధిత రైతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే...
ఇంకొల్లులోని రామతులశమ్మ కోల్డ్ స్టోరేజీకి పాలేరు వెంకటేశ్వర్లు, చెంచులక్ష్మిలు యజమానులు. అయితే వీరికి కొంత నగదు అవసరం కావడంతో బ్రోకర్‌గా ఉన్న కోటపాటి శ్రీనివాసరావును సంప్రదించారు. రైతులతో ఉన్న పరిచయాలతో సదరు బ్రోకర్ పర్మిట్లపై వారి చేత సంతకాలు చేయించి బ్యాంకుల్లో రుణాలు తీసుకొని యజమానులకు అందజేసేవాడు. కోల్డ్ స్టోరేజీ యజమానులు, బ్రోకరు బ్యాంకర్లతో కుమ్మక్కయ్యారని తెలుసుకోలేకపోయిన రైతులు శనగలు ఉన్నాయి..సరుకుపై రుణం తీసుకోవడమే కదా అని భావించి రుణ పత్రాలపై సంతకాలు చేశారు. యాజమాన్యం ప్రమేయాన్ని అలుసుగా తీసుకున్న బ్రోకర్ శ్రీనివాసరావు సొంతంగా రైతుల సంతకాలతో రుణాలు తీసుకోవడం ప్రారంభించాడు. ఇలా * 10 లక్షలతో ప్రారంభించి ఈ మొత్తాన్ని * 2.30 కోట్లకు పెంచాడు. రుణ పత్రాలపై రైతుల సంతకాలు మాత్రమే ఉండటంతో బకాయిలు చెల్లించలేదని సదరు బ్యాంకు అధికారులు 27 మంది రైతులపై కేసు నమోదు చేశారు. దీంతో గతనెల 11వ తేదీన స్థానిక కోర్టులో న్యాయమూర్తి కేఎస్ రామకృష్ణారావు రిమాండ్ విధించారు. రైతులు రిమాండ్ గడువు పూర్తవడంతో విచారణ నిమిత్తం మంగళవారం కోర్టుకు వచ్చారు. వారికి జడ్జి మరో 14 రోజులు రిమాండ్ పొడిగించారు.
బాధిత కుటుంబ సభ్యుల ధర్నా
కోల్డ్ స్టోరేజీ వ్యవహారంలో బాధిత రైతుల కుటుంబ సభ్యులు మంగళవారం పర్చూరులో నిరసన చేపట్టారు. రిమాండ్ లో ఉన్న రైతులను కోర్టుకు తెచ్చిన క్రమం లో ఆగ్రహానికి గురైన బాధిత రైతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రైతులతో రుణపత్రాలపై సంతకాలు తీసుకుని రుణాలు తీసుకున్న శీతల గిడ్డంగి యాజమాన్యాన్ని, అందుకు సహకరించిన బ్యాంకర్లను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ కోర్టు బయట చీరాల ఆర్‌అండ్‌బీ రహదారిపై కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. అనంతరం బొమ్మల సెంటర్‌లో మహిళలు రహదారిపై బైఠాయించారు. కుటుంబ సభ్యులు మానవహారం ఏర్పాటు చేశారు. పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
సీబీఐ విచారణ చేపట్టాలి.. పీ సీతమ్మ, బాధితుని కుమార్తె
మా తండ్రి పసుపులేటి ఆంజనేయులుకోల్డ్ స్టోరేజీ బయట బడ్డీ బంకు నిర్వహిస్తున్నాడు. రుణపత్రాలపై సంతకాలు చేయకుంటే బడ్డీబంకు తీయిస్తామని చెప్పడంతో ఉన్నసరుకుపై రుణం తీసుకోవడమేగా అని వాళ్లు పెట్టమన్నచోట సంతకాలు చేశాడు. ఇలా మాతండ్రి పేరుతో * 7.9 లక్షల రుణం తీసుకున్నారు. ఈ కేసులో నిజాలు నిగ్గుతేలాలంటే సీబీఐ చేత విచారణ చేయించాలి. మా తండ్రి కౌలు తీసుకొని సాగుచేసిన భూమిలో వచ్చిన * 1లక్ష విలువైన శనగలు గిడ్డంగిలోనే పెట్టాం. ప్రస్తుతం వాటికి కూడా యాజమాన్యం సమాధానం చెప్పడం లేదు.
ఆపరేటర్‌గా ఉన్న పాపానికి బలయ్యాం... జరుగుల రేణుక, బాధితుని భార్య
నాభర్త జరుగుల హనుమంతరావు ఇదే కోల్డ్ స్టోరేజిలో ఆపరేటర్‌గా ఉన్నారు. యాజమాన్యం చెప్పిన చోట సంతకాలు పెట్టకుంటే ఉద్యోగం పోతుందని పెట్టమన్నచోటల్లా సంతకాలు చేశాడు. తీరా ఆయన పేరున *9 లక్షలు అప్పు తీసుకున్నట్లు బ్యాంక్ అధికారులు తేల్చారు. మాకు పొలం లేదు..వ్యవసాయం లేదు.. పనిచేసుకుని బతికే మాకు అంతస్థోమత ఎక్కడిది. అన్యంపున్యం ఎరుగని మా ఆయన్ని జైలుపాలు చేశారు.
జైలుపాలైన రైతుల కుటుంబ సభ్యుల ఆవేదన
Published Wed, Dec 25 2013 5:03 AM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
Advertisement
Advertisement