రైతు రుణమాఫీ అంతా బూటకం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
నెల్లూరు: సీఎం చంద్రబాబు చేస్తున్న రైతు రుణమాఫీ అంతా బూటకం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన బాబు ఈ విధంగా మోసం చేయడం దురదృష్టకరమన్నారు.
ప్రస్తుతం అధికార పార్టీ తీరు చూస్తుంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల వడపోతే లక్ష్యంగా పనిచేస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబు చేస్తున్న వడపోతలతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. కౌలు రైతుల రుణాలు మాఫీ విషయంలోనూ అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. అధికార దాహంతో చంద్రబాబు చేసిన మోసం వల్ల రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు ఆల్లాడిపోతున్నారన్నారు. రుణమాఫీపై కల్లబొల్లి మాటలు చెబు తూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ప్రజలను మోసం చేసిన బాబు ఏమాత్రం బాగుపడరని శాపనార్థాలు పెట్టారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే విధం గా చేసిన బాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు.