మోటర్ బయటకు లాగుతుండగా విద్యుత్ తీగలు తగిలి కౌలు రైతు మృతి చెందాడు.
వేంపల్లె (వైఎస్సార్ జిల్లా) : మోటర్ బయటకు లాగుతుండగా విద్యుత్ తీగలు తగిలి కౌలు రైతు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం బక్కన్నగారిపల్లి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బక్కన్నగారిపల్లి గ్రామానికి చెందిన బువ్వల రాజా(45) కౌలు రైతుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం పొలం దగ్గర మోటర్ లాగుతుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు.
గమనించిన గ్రామస్తులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు సమాచారం.