సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్య | Farmer suicide at sub collector office | Sakshi
Sakshi News home page

సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్య

Published Sun, Feb 2 2014 1:25 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

Farmer suicide at sub collector office

 జగిత్యాల, న్యూస్‌లైన్: కరీంనగర్ జిల్లా జగిత్యాల సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పెగడపల్లి మండలం నామాపూర్‌కు చెందిన గాండ్ల సుధాకర్(49) తన తండ్రి పేరున ఉన్న 1.36 ఎకరాల భూమి, తన వదిన పాపమ్మ పేరిట మారిందని, ఆ భూమిని తిరిగి తన తండ్రి పేరున మార్చాలని 1992లో రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. కానీ, అధికారులు స్పందించలేదు. 2007 నుంచి భూమి మార్పిడి కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.

2010లో తన సోదరి మణెమ్మతో జగిత్యాల సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కేసు వేయించాడు. ఈ కేసు విషయమై శనివారం సబ్‌కలెక్టర్ ఎదుట పాపమ్మ హాజరు కావాల్సి ఉండగా, ఆమె సదరు భూమి తనదేనంటూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కేసును సబ్ కలెక్టర్ శ్రీకేశ్ లట్కర్ వాయిదా వేశారు. ఇక భూమి తనకు దక్కే పరిస్థితి లేదని మనస్తాపం చెందిన సుధాకర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో క్రిమిసంహారక మందు తాగి లోపలికి వెళ్లే క్రమంలో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ చనిపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement