అమలాపురం : నీలం తుపాను పరిహారం కోసం రైతులు చేస్తున్న నిరీక్షణ నిరసనగా మారింది. పరిహారం పంపిణీ జాప్యంపై కోనసీమ రైతులు కన్నెర్ర చేశారు. పరిహారం మంజూరై ట్రెజరీలో నిధులు మురిగిపోతున్నా.. రైతులకు పంపిణీ చేయడంలో జిల్లా వ్యవసాయాధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ వందలాది మంది రైతులు సోమవారం స్థానిక ఏడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు.
నీలం తుపాను పరిహారం కోసం నాలుగు రోజుల క్రితం ఏడీఏ కార్యాలయం వద్ద కోనసీమ రైతు పరిరక్షణ సమితి, బీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రైతులతో సమావేశమయ్యేందుకు సోమవారం జేడీఏ విజయ్‌కుమార్ ఇక్కడకు వచ్చారు. ఏఓలు, ఏడీఏలు పరిహారం పంపిణీపై నిర్లక్ష్యం వహించారని, తమకు పరిహారం ఎప్పుడు అందుతుందో స్పష్టమైన హామీ ఇచ్చితీరాలని రైతులు ఏడీఏ భాస్కరరావు, ఏఓలు ధర్మప్రసాద్, ప్రశాంత్‌కుమార్‌తో పాటు సిబ్బందిని కార్యాలయం నుంచి బయటకు పంపించి, తలుపులు మూసివేసి, కార్యాలయం బయట బైఠాయించారు.
అప్పటికే అక్కడకు చేరుకున్న జేడీ విజయ్‌కుమార్‌పై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమీలు, జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు, కోనసీమ అధ్యక్షుడు యాళ్ల వెంకటానందం, రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందం, నాయకులు రంబాల బోసు, తిక్కిరెడ్డి గోపాలకృష్ణతో జేడీ చర్చలు జరిపారు. రైతు ప్రతినిధులు మాట్లాడుతూ 16నెలల క్రితం సంభవించిన నీలం తుపాను పరిహారం ఆరుల నెలల క్రితమే మంజూరైందని, ఇప్పటి వరకు రైతులకు పంపిణీ చేయలేదని రైతులు మండిపడ్డారు. కోనసీమకు రూ.14.57 కోట్ల పరిహారం మంజూరైతే, రూ.7 కోట్లు పంపిణీ చేశారని, మిగిలిన రూ.7.57 కోట్లు పంపిణీ చేయకపోవడంతో 18 వేల మంది రైతులు ఆందోళన చెందుతున్నారని వివరించారు.
దీనిపై గతంలో ఇచ్చిన హామీపై జేడీని నిలదీశారు. అనేక సార్లు ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాల వివరాలిచ్చినా, ఏఓల నిర్లక్ష్యం వల్ల పరిహారం జమ కాలేదన్నారు. జనవరి 31 తర్వాత ఇచ్చిన ఖాతాలకు సంబంధించి, మిస్ మాచింగ్ ఖాతాలకు ఇప్పటికీ పరిహారం పంపిణీ చేయలేదన్నారు. కొన్ని షాపుల్లో అధిక ధరలకు విత్తనాలను విక్రయిస్తూ బిల్లు తక్కువగా ఇస్తున్నారని జేడీకి ఫిర్యాదు చేశారు. విత్తన ప్యాకెట్లపై తప్పుడు ఫోన్ నంబర్లు వేస్తున్నారని, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడంలేదని తిక్కిరెడ్డి గోపాలకృష్ణ పేర్కొన్నారు. కోనసీమలో విత్తనాల అమ్మకాలతో రైతుల నుంచి వ్యాపారులు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అదనంగా వసూలు చేశారని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఒక దశలో జేడీ ‘ఈ సమావేశానికి రాకూడదనుకుంటూనే వచ్చాను’ అనడంతో రైతులు మండిపడ్డారు.
ఆర్థిక శాఖ అనుమతి రాగానే పంపిణీ
కాగా 4, 5 విడతల్లో పంపిణీ చేయాల్సిన పరి హారం రూ.7.57 కోట్ల బిల్లు ట్రెజరీకి పంపించామని, అపాయింట్‌మెంట్ డేట్‌కు ముందుగా పంపడం వల్ల ట్రెజరీలో ఆంక్షలతో మంజూరు కాలేదని జేడీ చెప్పారు. నిధుల విడుదలకు అనుమతి కోసం కమిషనర్‌కు లేఖ రాశామన్నారు. ఆర్థిక శాఖ అనుమతి రాగానే పంపిణీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఆగస్టు 5 వరకు ఏఓలు గ్రామసభలు నిర్వహించి, పరి హారం అందని రైతుల ఖాతాల వివరాలు సేకరిస్తారన్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే పరి హారం పంపిణీలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని జేడీ అంగీకరించారు. ప్రతీ రైతుకు పరిహారమిచ్చేలా రైతు నాయకులతో కలిసి మరోసారి సర్వే చేయాలని ఏఓలకు సూచిం చారు. విత్తన వ్యాపారుల మోసాలపై విచారణ చేయిస్తామని, దాడులు చేసి ఇప్పటికే కొన్ని లెసైన్సులు రద్దు చేశామని చెప్పారు. రైతు నాయకులు వాసంశెట్టి సత్యం, గణేశుల రాం బాబు, అడ్డాల గోపాలకృష్ణ, జున్నూరి కొండయ్యనాయుడు, దామిశెట్టి చంటి తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.
పరిహారం కోసం రైతుల కన్నెర్ర
Published Mon, Jul 21 2014 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM
Advertisement
Advertisement