అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు మరోసారి కన్నెర్ర చేశారు. మంగళవారం పెనుమాక రైతులతో సీఆర్‌డీఏ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. అధికారుల తీరుకు నిరసనగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కుర్చీలు విసిరేసి... అధికారులతో వాగ్వాదానికి దిగారు. పెనుమాక భూసేకరణ, రైతులు ఇచ్చిన అభ్యంతరాలపై అధికారులు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే రైతుల అభ్యంతరాలను సీఆర్‌డీఏ అధికారులు నమోదు చేయలేదు. దీంతో వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డితోపాటు రైతులు అధికారుల తీరును తప్పుబట్టారు. అభ్యంతరాలు నమోదు చేయాలని పట్టుబట్టినప్పటికీ, అధికారులు మాత్రం ససేమిరా అనడంతో రైతులు ఆగ్రహించారు. టెంట్లు పడేసి.. కుర్చీలు విసిరేశారు. దీంతో సమావేశం కాస్తా ఉద్రిక్తంగా మారింది.