రబీజోరు | farmers are busy with their crops | Sakshi
Sakshi News home page

రబీజోరు

Published Thu, Dec 26 2013 12:00 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

farmers are busy with their crops

 వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు
 ఈసారి రెట్టింపు విస్తీర్ణంలో సాగైన జొన్న
 వరి సాగూ పెరిగే అవకాశం
 ఈ సీజన్‌పైఅన్నదాతల ఆశలు
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా:
 రబీసాగు జిల్లాలో వడివడిగా సాగుతోంది. గత సీజన్లో కురిసిన అతి వృష్టితో పంటలు పోయి కుదేలైన రైతాం గం రబీపైనే రైతాంగం గంపెడాశలు పెట్టుకుంది. జిల్లాలో పెద్ద ప్రాజెక్టులేవీ లేకపోవడంతో రైతాంగం మొత్తం భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంది. ఇటీవల జిల్లాలో కురిసినవర్షాలతో భూగర్భజలాలు మెరుగుపడ్డాయి. దీంతో రబీ సాగుపై రైతులకు ధీమా పెరిగింది. ఫలితంగా సాగు పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాలో 42,287 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేసి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈమేరకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేసింది. అయితే ఇప్పటివరకు సాధారణ విస్తీర్ణంలో 65 శాతం పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
 
 జొన్నసాగు జోరు
 జిల్లాలో రబీ సాధారణ విస్తీర్ణం 42,287 హెక్టార్లు. అయితే ఇప్పటికి 25,186 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు కావాల్సి ఉందని వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. అయితే 27,550 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుత సీజన్లో జొన్న పంట అత్యధిక విస్తీర్ణంలో సాగైంది. జిల్లాలో జొన్న పంట సాధారణ విస్తీర్ణం 5,238 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు రెట్టింపు స్థాయిలో 11,852 హెక్టార్లలో సాగైంది. మరోవైపు శనగ, వేరుశనగ పంటల సాగు ఆశాజనకంగా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
 
 ప్రస్తుతం జిల్లాలో వరి రైతులు నారు మడులతో సిద్ధంగా ఉన్నారు. కొన్ని చోట్ల నాట్లు మొదలయ్యాయి. భూగర్భ జలాలు పెరిగిన నేపథ్యంలో వరిపంట కూడా అధిక విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ భావిస్తోంది.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement