నెల్లూరు: ధాన్యం ఆరబెడుతున్న రైతులు
ధాన్యానికి మద్దతు ధర ఇస్తామని, ఇందు కోసం జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులకు నష్టం వాటిల్లకుండా చూస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి, జిల్లా అధికారులు చేసిన ప్రకటనలు నీటి మూటలుగా మారాయి. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళితే నాణ్యతపై వివిధ సాకులు చెబుతూ అధికారులు ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయడంలేదు.
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో వరి కోతలు 90 శాతం పూర్తయ్యాయి. ఇప్పటి దాకా మౌనంగా ఉన్న పాలకులు ఇటీవల నుంచి మద్దతు ధర.. అంటూ ప్రకటనలు గుప్పించడం మొదలు పెట్టారు. కొనుగోలు కేంద్రాలు కూడా 169 కాకుండా 43 కేంద్రాలలోనే బీపీటీ ధాన్యాన్ని కొనే విధంగా నిబంధన పెట్టారు. రైతులకు మాత్రం ఇవేమి ఉపయోగంలోకి రావడం లేదు. రోడ్డుమీద ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. వాతావరణం రోజుకో మాదిరిగా ఉండటంతో వర్షం పడుతుందేమోనని ఆందోళనతోనే కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాత్రం ఇవేమీ తనకు పట్టనట్లు సైకిల్‌యాత్రలు చేసుకుంటూ పోతుండటంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి
జిల్లాలో సాగు మొత్తం రెండు లక్షల హెక్టార్లలో ధాన్యం పండించారు. వీటిలో దాదాపుగా ఒక లక్ష హెక్టార్లలో బీపీటీ పండించారు. దీని ద్వారా తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, వీటిలో దాదాపుగా ఏడు లక్షల మెట్రిక్ టన్నుల బీపీటీ ధాన్యాన్ని ఇప్పటికే విక్రయించారని వ్యవసాయ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ ఏడాది జనవరి చివరి నుంచి జిల్లాలో కోతలు మొదలు అవుతుంటాయి. కానీ మన పాలకులు మాత్రం 90 శాతం రైతులు నష్టాలతో విక్రయాలు జరిపిన తరువాత మద్దతు ధర అంటూ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు. అది కూడా రైతుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా జిల్లాలో 169 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు, కానీ బీపీటీకి మాత్రం 43 కేంద్రాల్లోనే కొనుగోలు చేసే విధంగా నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది.
అమాత్య మద్దతు ఎక్కడ
బీపీటీ ధాన్యం పుట్టి రూ.15,500 అమ్ముకోవచ్చని పాలకులు ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చారు. కాని క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇప్పటికే దాదాపుగా 90 శాతం ధాన్యం విక్రయాలు చేయడంతో పాటు మిగిలిన రైతులు కూడా మద్దతు ధరకు ఇవ్వలేని పరిస్థితి ఉంది. పుట్టి రూ.11 వేల నుంచి రూ.13 వేల మధ్యనే రైతులు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
నేరుగా వస్తేనే...
ధాన్యం కొనుగోలులో మిల్లర్‌లు కొత్త మెలిక పెట్టారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లర్ల వద్దకు పోతే ఇప్పుడు కాదని, కొంత సమయం పడుతుందని చెప్పుకొస్తున్నారు. కానీ నేరుగా రైతులు మిల్లుకు తేవడమో, లేదా మిల్లర్లు ఏర్పాటు చేసిన దళారులకు విక్రయించడమో చేస్తే మిల్లర్‌లు చెప్పిన రేటుకు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులు ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో సుదూర ప్రాంతాలకు వెళ్లి విక్రయించుకోలేక...దళారులకు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మంత్రి సోమిరెడ్డి ఉన్నా మిల్లర్లకు అనుకూలంగా మాట్లాడం, సంబంధిత అధికారులు ఉన్నా పట్టినట్లు వ్యహరిస్తుండడంతో చివరికి రైతులు తీవ్ర ఇబ్బందుల మధ్యే ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
కొనుగోలు చేసింది మూడు వేల టన్నులేనా!
జిల్లాలో సుమారుగా లక్ష హెక్టార్లలో బీపీటీ వరిధాన్యాన్ని సాగు చేశారు. తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల బీపీటీ ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. సుమారుగా ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దళారులు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇంకా రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా జిల్లాలో పరిస్థితి ఉంటే.. పాలకులు మాత్రం మొదట 169 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం, బీపీటీకి 43 కేంద్రాలే అని నిబంధన విధించారు. ఇప్పటికి కేవలం మూడు వేల టన్నులు మాత్రమే అధికారులు కొనుగోలు చేయడం చూ స్తుంటే పాలకులు తీరు ఏ విధంగా ఉం దో అర్థమవుతోంది. కొనుగోలు కేం ద్రాల్లో వారం నుంచి 10 రోజుల దాకా కొనుగోలుకు సమయం పడుతుందని చెప్పడంతో ఇబ్బందులు పడుతూ దళారులకు తక్కువ ధరకు విక్రయిం చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫొటోలోని రైతు పేరు కొరపాటి మురళినాయుడు.. నెల్లూరు రూరల్ మండలం. ఇప్పటికే సుమారుగా 10 పుట్లకు పైగా ధాన్యాన్ని విక్రయించాడు. పుట్టి రూ.11 వేల నుంచి రూ.12 వేల మధ్యనే విక్రయించాడు. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు, మద్దతు ధర లేక పోవడం తదితర కారణాలతో ధాన్యాన్ని విక్రయించేందుకు దళారులని ఆశ్రయించాల్సి వచ్చిందని వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment