గుండె మండింది.. | Farmers burn Paddy crop | Sakshi
Sakshi News home page

గుండె మండింది..

Published Sat, Nov 9 2013 12:52 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Farmers burn Paddy crop

నిర్మల్/కడెం/జన్నారం, న్యూస్‌లైన్ : జిల్లా రైతులను దోమపోటు ఆందోళనకు గురిచేస్తోంది. పంటలు చేతికొచ్చే సమయంలో చీడపీడలు విజృంభిస్తుండటంతో రైతులు దిగుబడి తగ్గుతుందని దిగాలు చెందుతున్నారు. ఫలితంగా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. పెట్టుబడి కూడా రాదనే బెంగతో రైతులు వరి పైరుకు నిప్పు పెట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 ఆరంభం నుంచీ కష్టాలే..
 ఖరీఫ్ ప్రారంభం కంటే ముందే ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసి జలాశయాలు, చెరువులు, కుంటలు నిండటంతో రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ యేడాది వరి పంటకు ఢోకా లేదని భావించారు. అనంతరం పంటలు మోగిపురుగు, అగ్గితెగుళ్ల బారిన  పడటంతో మనోవేదనకు గురయ్యారు. దీనికి తోడు ఏకధాటిగా కురిసిన వర్షాలకు పంట పొలాల్లో నీరు చేరి కలుపు పెరిగి ఆర్థికంగా నష్టపోయారు. పంట గింజ పాలుపోసుకునే సమయంలో, గట్టి పడే సమయానికి పై-లీన్ తుపాన్ ప్రభావంతో వరి పైరుపై పెను ప్రభావం పడింది. పంట నేలకొరిగి వరి రైతు నష్టపోయాడు. దీనికి తోడు ఇప్పుడేమో దోమపోటు రైతన్న పాలిట శాపంగా మారింది. దోమపోటు భరించలేక జన్నారం, కడెంలలో రైతులు వరి పైరుకు నిప్పు పెడుతున్నారు.
 
 రైతన్నకు పాట్లు...
 జిల్లాలో ఈ ఏడాది 52,886 హెక్టార్లలో వరి సాగైంది. నిర్మల్, ఖానాపూర్, మంచిర్యాల నియోజకవర్గాల్లో అధికంగా సాగైంది. పంట చేతికొస్తున్న ప్రస్తుత తరుణంలో దోమపోటు పంటపై ఆశిస్తోంది. ఇది దిగుబడులపై పెను ప్రభావం చూపుతోంది. నత్రజని వాడకం ఎక్కువగా ఉండడం, వాతావరణ పరిస్థితుల వల్ల దోమపోటు వస్తుంది. మొన్నటి వరకు వర్షాలు ఆ తర్వాత చలి ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతల్లో హెచ్చు, తగ్గుల వల్ల పంటల్లో దోమపోటు పెద్ద మొత్తంలో సోకింది. ప్రధానంగా ఇది వరి అడుగు భాగంలో నీటి మట్టం ఉన్న ప్రాంతంలో ఆశించి కాండం రసం పీలుస్తుంది. దీంతో మొక్క కాండంలో శక్తి సన్నగిల్లి ఎండిపోతుంది. దీంతో దిగుబడిపై పెను ప్రభావం చూపనుంది.
 
 నష్టాల పాలు..
 వరి సాగుకు ఎకరానికి రూ.16వేలను మొదలుకుని రూ.20 వే ల వరకు ఇప్పటికే రైతన్నలు ఖర్చు అయింది. ఇక పంట ధర లు చూస్తే ఏ గ్రేడ్‌కు క్వింటాల్‌కు రూ.1,310 ఉండగా, బీ గ్రేడ్ కు రూ.1,280 ప్రకటించారు. అయితే పంట బాగా పండితే ఎ కరానికి 18 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అ యితే గతంలో సోకిన తెగుళ్లు, ప్రస్తుతం ఆశిస్తున్న దోమపోటుతో దిగుబడి 10క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించ డం లేదు. దీంతో రైతన్నలు నష్టపోయే పరిస్థితి నెలకొంది.
 
 పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు..
 నేను ఎకరంలో వరి సాగు చేశాను. ఇప్పటి వర కు రూ.15వేల వరకు ఖర్చు పెట్టాను. అయితే పంట చేతికొస్తుందనుకున్న సమయంలో దోమపోటు ఆశించింది. దీంతో పంట చాలా మట్టుకు ఎండింది. దీని వల్ల పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం మాలాంటి రైతులను ఆదుకుని నష్టపరిహారం అందించాలి.
 - పెంట భూమన్న, రైతు, న్యూలోలం, దిలావర్‌పూర్ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement