కదం తొక్కిన సీమాంధ్ర రైతులు
సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్రం విడిపోతే మొట్టమొదటగా నష్టపోయేది సీమాంధ్ర రైతన్న. సాగునీరు సక్రమంగా అందక భూములు బీడులుగా మారే ప్రమాదం ఉంది. నీటికోసం యుద్ధాలూ జరగవచ్చని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర రైతు కదం తొక్కారు. పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి అనంతరం పెద్దఎత్తున దీక్షలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో దీక్షకు ముందు వందలాది మంది రైతులు ఎడ్లబండ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పాలకొల్లు, తణుకు, భీమవరం, నరసాపురంలలో వివిధ రకాల పంటలు ప్రదర్శిస్తూ దీక్ష చేపట్టారు.
జంగారెడ్డిగూడెం, గోపాలపురంలలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన రైతుదీక్షలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి పాల్గొన్నారు. కాజులూరులో జరిగిన రైతు దీక్షలో పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. కె. గంగవరంలో జేఏసీతో కలిసి పార్టీ ఆధ్వర్యంలో రైతుగర్జన నిర్వహించారు. రాజానగరం, కోరుకొండల్లో దీక్షలు చేపట్టారు. పిఠాపురం, రౌతులపూడిలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, కాడెడ్లతో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రైతుగర్జన పేరిట రిలే నిరాహార దీక్షలు జరిగాయి. శ్రీకాకుళం మండలంలోని సింగుపురం వద్ద జాతీయ రహదారిపై సమైక్యవాదులు ఎడ్ల బళ్లతో జాతీయ రహదారిని దిగ్బంధించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో జరిగిన దీక్షలో పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, అరుకు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు ఆర్వీఎస్‌కేకే రంగారావు సంఘీభావం తెలిపారు.
చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై నిర్వహించిన ధర్నాలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు ఆర్కే రోజా పాల్గొన్నారు. మదన పల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. సత్యవేడు, పీలేరులలో దీక్షలు జరుగుతున్నాయి. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి దీక్షలు ప్రారంభించారు. గంగాధర నెల్లూరులో పార్టీ జిల్లా కన్వీనర్ కే. నారాయణస్వామి దీక్షలను ప్రారంభించగా, కొత్తపల్లిమిట్టలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ప్యాపిలి, కొలిమిగుండ్ల, ఆలూరు, ఆళ్లగడ్డ, తుగ్గలిలో ఎడ్లబండ్లతో రైతులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఆదోనిలో వైఎస్సార్సీపీ నాయకుడు వై. సాయిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు మూడువేల మంది రైతులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు వందలాది ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కదిరిలో నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌ఎండీ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి.. 205 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు కాకాణి గోవర్ధనరెడ్డి, దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్షలుప్రారంభమయ్యాయి. సైదాపురం, రాపూరు, వెంకటగిరిలో జరిగిన దీక్షల్లో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు పాల్గొన్నారు. నాయుడుపేటలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో రైతు దీక్షల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ పాల్గొనగా, మంగళగిరి, ఉండవల్లి, దుగ్గిరాల మండలాల్లో దీక్షలను పార్టీ గుంటూరు, కృష్ణా జిల్లాల సమన్వయకర్త ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ప్రారంభించారు. ప్రకాశం జిల్లా కనిగిరి, హనుమంతునిపాడు, మార్కాపురంలలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, కందుకూరులో జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ దీక్షలను ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రైతు దీక్షలు జరిగాయి. జగ్గయ్యపేట నియోజకవర్గం మక్కపేట నుంచి వత్సవాయి వరకు ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు.