సాక్షి, అమరావతి: రైతుల్ని వేధించినందుకు పెప్సీ కంపెనీ నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. గుజరాత్ రైతులపై కేసులు ఉపసంహరించుకుంటే సరిపోదని, మరెక్కడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని తీర్మానించాయి. ఈ వ్యవహారమై విజయవాడలో త్వరలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి రైతుల్ని చైతన్య పరచాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇదిలా ఉంటే పెప్సీ కంపెనీ నుంచి తమకు పరిహారం ఇప్పించాలంటూ బంగాళదుంప రైతులు కేసు వేయడంతో ఈ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది.
చదవండి: (కేసులు పెడతావా.. పరిహారం చెల్లించు)
గుజరాత్‌లో ఎఫ్‌సీ–5 రకం బంగాళదుంపను సాగు చేసినందుకు గత రెండేళ్లలో 9 మంది రైతులపై పెప్సీ కంపెనీ ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఒక్కో రైతు నుంచి ఒక కోటీ రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ వ్యాజ్యాన్ని వేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో వెనక్కు తగ్గిన పెప్సీ కంపెనీ రైతులపై పెట్టిన కేసుల్ని వెనక్కు తీసుకుంటామంటూ కొన్ని ఆంక్షలు విధించింది. అయితే బాధిత రైతులకు మద్దతు తెలుపుతున్న రైతు సంఘాల ఐక్య వేదిక పలు రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు, సభలు నిర్వహించతలపెట్టింది. దీనికి అనుగుణంగా త్వరలో ఏపీలోని పలు ప్రాంతాలలో సదస్సులు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment