కష్టాల్లో రైతన్న | farmers in trouble | Sakshi
Sakshi News home page

కష్టాల్లో రైతన్న

Published Thu, Jan 15 2015 1:50 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

farmers in trouble

అనంతపురం అగ్రికల్చర్: సంక్రాంతి పండుగ అంటే గ్రామ సీమలు కళకళలాడాలి. పల్లెసీమల్లో రైతు లోగిళ్లు పంట సిరులతో నిండిపోవాలి. ఇంటిల్లిపాదీ సంతోషంగా పండుగను జరుపుకోవాలి. జనవరి వచ్చిందంటే గ్రామాల్లో సంక్రాంతి శోభ వెల్లివిరియాలి. గతంలో ఇటువంటి పరిస్థితి చూశాం. పల్లెవాసులు అనుభవించారు. కానీ ఇపుడు పరిస్థితి మారిపోయింది. ఇలాంటి వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. భోగి మంటల వెచ్చదనం కరువైంది. గొబ్బెమ్మలు పెట్టడానికి నవధాన్యాలు లేవు.. గంగిరెద్దుల చప్పుడు వినిపించడం లేదు.

హరిదాసు కీర్తనలు వినిపించే పరిస్థితి అంతకన్నా లేదు. వెరసి సంక్రాంతి సోయగాలు భూతద్ధంలో వెతికినా అగుపించే పరిస్థితి కనిపించడం లేదు. వర్షాలు లేక పంట పొలాలు ఎండిపోయాయి. రూ.వందల కోట్లు పెట్టుబడులు మట్టిలో కలిసిపోయాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పల్లెవాసులు భయం గుప్పిట్లో కొట్టుమిట్టాడుతున్నారు. వెరసి వ్యవసాయ రంగంలో ఆత్మహత్యల ఆక్రందనలు వినవస్తున్నాయి. కరువు రక్కసి ‘అనంత’ను కబలించేస్తోంది.

అండగా ఉండి మనోధైర్యం కల్పించాల్సిన ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం పూర్తిగా కరువైంది. రూ.4,944 కోట్ల పంట, బంగారు రుణాలు మాఫీ కాలేదు, 3,700 కోట్ల ఖరీఫ్, రబీ కింద పంట రుణాలు ఇవ్వలేదు. రూ.675 కోట్ల మేర ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. రూ.227 కోట్లు ఇన్సూరెన్స్ జమ కాలేదు. ప్రభుత్వం అవలంభించిన విధానాల వల్ల ‘అనంత’ లాంటి జిల్లాలో వ్యవసాయం పెను సంక్షోభంలో కూరుకుపోయింది. రైతులు రూ.వేల కోట్లు నష్టపోయారు.  
 
అక్షరాలా రూ.3 వేల కోట్లు నష్టం
గత ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు, వాటి నుంచి వచ్చిన దిగుబడులు, జరిగిన నష్టం లెక్కలోకి తీసుకుంటే జిల్లా రైతులకు అక్షరాలా రూ.3 వేల కోట్లు నష్టం వాటిల్లింది. జిల్లా యంత్రాంగం తయారు చేసిన ఓ నివేదిక ప్రకారం ఈ గణాం కాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ లో వేరుశనగ 5.06 లక్షల హెక్టార్లలో వేయగా... సక్రమంగా వర్షాలు వచ్చివుంటే హెక్టారుకు 10 క్వింటాళ్లు చొప్పున 6.95 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడులు రావాల్సివుండగా పండింది మాత్రం కేవలం 1.19 లక్షల మెట్రిక్ టన్నులే.

తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. హెక్టారుకు సగటున 235 కిలోలు దిగుబడులు వచ్చాయి. అంటే 5.75 లక్షల మెట్రిక్ టన్నులు వేరుశనగ చేతికిరాకుండా పోయింది. దీని వల్ల కేవలం వేరుశనగ ద్వారా రూ.2,200 కోట్ల వరకు నష్టం జరిగింది. ఇలా వరి, జొన్న, మొక్కజొన్న, కంది, ఉలవ, పొద్దుతిరుగుడు, పత్తి, ఆముదం, సజ్జ, కొర్ర, రాగి, పెసర, అలసంద... ఇలా అన్ని పంటల  దిగుబడులు అంతంత మాత్రంగానే రావడంతో నష్టం తీవ్రత భారీ స్థాయిలో ఉంది. పత్తి మినహా తక్కిన అన్ని పంటలు దెబ్బ తీసినట్లు పేర్కొన్నారు.

మొత్తమ్మీద ఈ ఖరీఫ్‌లో 8.63 లక్షల హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం కాగా అననుకూల వర్షాల వల్ల చివరకు 6.95 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. 12.12 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు రావాల్సివుండగా కేవలం 2.65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు వచ్చాయి. 20 శాతం పంట కూడా దక్కించుకోలేని దీన స్థితిలో ‘అనంత’ అన్నదాత కొట్టుమిట్టాడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఈ పరిస్థితుల్లో సంక్రాంతిని ఎలా సంబరంగా చేసుకుంటారో పాలకులే చెప్పాల్సి ఉంది. చంద్రన్న కానుక అంటూ రూ.220 విలువ చేసే సరుకులు ఇచ్చి పండుగ చేసుకోండంటూ చెప్పడం పట్ల రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement