
రైతులను అదుపు చేస్తున్న పోలీసులు
సీతానగరం మండలంలో రైతులు తిరగబడ్డారు. తమ ప్రతాపం చూపారు.
విజయనగరం: సీతానగరం మండలంలో రైతులు తిరగబడ్డారు. తమ ప్రతాపం చూపారు. ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తమ బకాయిలు చెల్లించాలని రైతులు ఆందోళనకు దిగారు. వందల సంఖ్యలో రైతులు షుగర్ ఫ్యాక్టరీ లోపలకు చొచ్చుకుపోయారు. లోపల యంత్రాలను, అద్దాలను ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీ ఆవరణలోని చెట్లను కూడా పెకలించివేశారు.
ఫ్యాక్టరీ యాజమాన్యం బకాయిలు చెల్లించకుండా రైతులను బాధలకు గురిచేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సొమ్ముతో వ్యాపారం చేసుకుంటున్నారని వారు మండిపడ్డారు. అప్పులు చేసి చెరకు పండించి ఫ్యాక్టరీకి సరఫరా చేశామని చెప్పారు. ఏడాదిన్నర నుంచి తమకు రావాల్సిన సొమ్మును ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తోందని వారు వాపోయారు. అధికారులు, పాలకులు కూడా తమను పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఫ్యాక్టరీ దాదాపు 32 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించవలసి ఉంది.
ఆవేదనతో రెచ్చిపోతున్న రైతులను అదుపు చేయడం పోలీసుల తరం కావడంలేదు. ఎంత ప్రయత్నించినా రైతులు వినే పరిస్థితి లేదు. రైతులు, పోలీసుల తోపులాటలో ఇరువైపుల పలువురికి గాయాలయ్యాయి. బకాయిల చెల్లింపుపై యాజమాన్యం ఒక ప్రకటన చేస్తే తప్ప తాము రైతులను అదుపు చేయలేమని పోలీసులు చెబుతున్నారు. అవసరమైతే అదనపు పోలీస్ బలగాలను రప్పించే ప్రయత్నంలో జిల్లా యంత్రాంగం ఉంది.
**