ఒంగోలు, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో అకాల వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం పడగా...మరికొన్ని చోట్ల చిరుజల్లులు పడ్డాయి. అద్దంకి సమీపంలోని భవనాశి చెరువులో పడవ బోల్తాపడి రామాంజనేయులు (52) అనే జాలరి మృతి చెందాడు. నాగులుప్పాడు మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. పందలపాడులో మరో మహిళ మృతిచెందింది. ఒంగోలు నగరంలో వర్షం జల్లులకు శివారు కాలనీల వాసులు, అధికారులు బెంబేలెత్తారు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వర్షానికి చలిగాలులు తోడు కావడంతో వృద్ధులు ఇబ్బంది పడ్డారు.
అద్దంకి ప్రాంతంలో మిర్చి, మొక్కజొన్న పంట కళ్లాల్లోనే ఉంది. తాత్కాలికంగా పట్టలు కప్పి పంటను కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. కందుకూరు, కొండపి నియోజకవర్గాల్లో కూడా వర్షం బాగానే కురిసింది. గాలులు పెద్దగా లేకపోవడంతో మామిడి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుత వర్షాలు మామిడి పంటలకు మంచిదేనని రైతులు చెబుతున్నారు. వర్షంతో పాటు గాలులు తోడైతే పూత రాలిపోయే ప్రమాదం ఉందని కొండపి ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంతనూతలపాడు, చీరాల, పర్చూరు, కనిగిరి నియోజకవర్గాల్లో అడపాదడపా జల్లులు తప్ప పెద్ద వర్షం కురిసింది లేదు. మార్కాపురం, యర్రగొండపాలేల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడ తుప్పర్లు కూడా పడలేదు. దర్శి, గిద్దలూరు ప్రాంతాల్లో జల్లులు పడ్డా యి. జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవడంతో పాటు బల మైన వేడి గాలులు వీచే అవకాశం ఉం దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.