ముంపు భయం ! | farmers problems for delta in drianage | Sakshi
Sakshi News home page

ముంపు భయం !

Published Tue, Jul 22 2014 2:45 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ముంపు భయం ! - Sakshi

ముంపు భయం !

 డ్రెయిన్లలో పేరుకుపోయిన తూటికాడ, గుర్రపుడెక్క
 వీటి ప్రక్షాళనలో ఏటా జాప్యం...అన్నదాతలకు శాపం
 భారీ వర్షాల సమయంలో నీట మునుగుతున్న పొలాలు
 తొలగింపునకు  రూ.1.5 కోట్ల నిధులు మంజూరు
 తెనాలి టౌన్ : డెల్టాలోని డ్రైనేజీ డివిజన్ పరిధిలోని కాలువలు గుర్రపుడెక్క, తూటికాడతో నిండివున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా వీటిని తొలగించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా రేపల్లె డివిజన్‌లోని తెనాలి, పొన్నూరు సబ్ డివిజన్‌లోని మురుగు నీటి పారుదల కాలువల్లో తూటికాడ, గుర్రపు డెక్క పేరుకుపోయి ఉన్నాయి. నీటి ప్రవాహానికి ప్రధాన ఆటంకంగా మారిన వీటి తొలగింపునకు టెండర్లు ఆహ్వానించారు. అంతేకాక నిధులు రూ. 1.50 కోట్లు మంజూరయ్యాయి. రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు విలువ చేసే పనులకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ నెలాఖరు లోపు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, కాంట్రాక్టర్ నుంచి అగ్రిమెంట్ స్వీకరించిన అనంతరం పనులు ప్రారంభించాల్సి ఉంది.
 
మురుగు నీటి పారుదల కాలువల్లో తూటికాడ, గుర్రపు డెక్క తొలగింపు, కెమికల్స్ స్ప్రే చేసి వాటిని నిర్మూలించేందుకు రేపల్లె డివిజన్‌కు రూ.70 లక్షలు, తెనాలి సబ్ డివిజన్‌కు రూ.50 లక్షలు, పొన్నూరు సబ్ డివిజన్‌కు రూ.30 లక్షలు మంజూరయ్యాయి.
ఈ నిధులతో మేజర్, మీడియం, మైనర్ కాలువల్లో పనులు చేపట్టాల్సి ఉంది.
తెనాలి సబ్ డివిజన్‌లో మేజర్  డ్రెయిన్స్ పరిధిలో తుంగభద్ర డ్రెయిన్, రేపల్లె మెయిన్ డ్రెయిన్, భట్టిప్రోలు మెయిన్ డ్రెయిన్, గుంటూరు నల్ల డ్రెయిన్‌లు ఉన్నాయి.
మీడియం డ్రెయిన్స్ పరిధిలో గుండేరు డ్రెయిన్, రావికంపాడు డ్రెయిన్, దంతలూరు డ్రెయిన్, వల్లభాపురం క్యాచ్ డ్రెయిన్, నంబూరు డ్రెయిన్, గుంటూరు-2 గారగుంట డ్రెయిన్, నంబూరు ఎక్స్‌టెన్షన్ డ్రెయిన్, చిలువూరు నుంచి కొలకలూరు వరకు ఉన్న డ్రెయిన్‌లు ఉన్నాయి.
మైనర్ డ్రెయిన్స్ సుమారు 100కు పైగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా నంబూరు డ్రెయిన్, హనుమాన్‌పాలెం డ్రెయిన్, కొలకలూరు-1 డ్రెయిన్, కాజ-నంబూరు డ్రెయిన్‌లలో పనులు చేయాలి.
సాగునీటి కాలువల్లో పనులకు, డ్రైనేజీ కాలువల్లో పనులకు సంబంధం లేదని చెపుతున్న అధికారులు, ఈ పనులకు కాలవ్యవధిని ఐదు నెలలుగా నిర్ణయించారు. టెండర్ల దాఖలుకు ఈనెల 31గా గడువు నిర్ణయించారు.
దీంతో టెండర్ల ఖరారు, కాంట్రాక్టర్ అగ్రిమెంట్ పొందడానికి ఆగస్టు 2వ వారం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. పనులు ఆలస్యం కావడంతో బిల్లుల చెల్లింపు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని  పనుల నిర్వహణకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదని తెలిసింది.
 
ఏటా తప్పని మునక..
తెనాలి రూరల్ మండలంలోని హాఫ్‌పేట వద్ద గుంటూరు నల్ల డ్రెయిన్‌లో తూటికాడ, గుర్రపు డెక్క  పేరుకుపోయి ఉన్నాయి. ఈ డ్రెయిన్ పరిధిలోని పొలాలు ఏటా ముంపునకు గురి కావాల్సి వస్తోంది. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన హెలెన్ తుఫాన్ వల్ల వరి పొలాలు నీట మునిగాయి.
డివిజన్‌లోని దుగ్గిరాల, తెనాలి, కొల్లూరు, కొల్లిపర, వేమూరు మండలాల పరిధిలో సుమారు 50వేల ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది.
దుగ్గిరాల మండలంలోని డ్రెయిన్ పరిధిలో చిలువూరు, తుమ్మపూడి, మంచికల పూడి, కంఠంరాజు కొండూరు, పెనుమూలి, దుగ్గిరాలలో వందల ఎకరాల్లో పంట నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది.
 వివరణ:
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఒకసారి, నవంబర్, డిసెంబర్ నెలల్లో మరోసారి రెండు విడతలుగా ఈ పనులు చేస్తారని డ్రైనేజీ విభాగం డీఈ బి.పద్మ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement