రైతులను ఆదుకుంటాం : బొత్స
Published Sun, Oct 27 2013 1:59 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
పూసపాటిరేగ/భోగాపురం, న్యూస్‌లైన్ :తుఫాన్ ప్రభావంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో శనివారం ఆయన పర్యటించారు. పూసపాటిరేగ మండలంలో అత్యధికంగా మొక్కజొన్న పంటను నష్టపోయినట్లు రైతులు ఆయ న ముందు ఏకరువుపెట్టారు. మొలకెత్తిన మొక్కజొన్న కంకులను చూపించా రు. నష్టపోయిన మొక్కజొన్న పంటను పరిశీలించి నివేదికలు పంపించాలని అక్కడే ఉన్న జేసీ శోభకు బొత్స ఆదేశించారు.
నీలం తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందలేదని, ఇప్పడు నష్టపోయిన పంటకైనా పరిహారం ఇస్తారా? అని పలువురు రైతులు బొత్సను ప్రశ్నించారు. దీనిపై జేడీ లీలావతి స్పందిస్తూ జిల్లాకు రూ.4.8 కోట్లు పరిహారం మంజూరవ్వగా.. ఇప్పటి వరకు రూ.3.74 కోట్లు పంపిణీ చేశామని, మిగిలిన మొత్తాన్ని రెండు రోజుల్లో ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పనాయుడు, ఆర్‌డీఓ వెంకటరావు, ప్రత్యేక అధికారి ఆర్.శ్రీలత, ఎంపీడీఓ లక్ష్మి, తహశీల్దార్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
పక్కా ఇళ్ల నిర్మాణానికి నిధుల మంజూరు
మత్స్యకార గ్రామాల్లో పక్కా ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని బొత్స హామీ ఇచ్చారు. భోగాపురం మండలంలోని మత్స్యకార గ్రామాల్లో ఆయన పర్యటించారు. మత్స్యకారులు తీరప్రాంతానికి దూరంగా ఇళ్లను నిర్మించుకునేందుకు ఒక్కో ఇంటికీ రూ.1.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికీ 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. అనంతరం మండలంలో కోతకు గురైన రహదారులను పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మోహనరావు, మత్స్యశాఖ ఏడీ ఫణి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement