తల్లాడ, న్యూస్‌లైన్: సిరిపురం మేజరు కాల్వకు సాగర్ నీటి సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మల్లవరం, నారాయణపురం, తల్లాడ, అన్నారుగూడెం గ్రామాలకు చెందిన రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌పీ సబ్‌డివిజన్ కార్యాలయం వద్ద నాలుగు గంటలపాటు ధర్నా చేశారు. అయినా ఏఈ, డీఈలు రాకపోవడంతో ఆగ్రహించి ఎన్‌ఎస్‌పీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి గంటపాటు ధర్నా చేశారు.
ఎన్‌ఎస్‌సీ ఎస్‌ఈకి తహశీల్దార్ ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆందోళనకారుల వద్దకు వచ్చి సాగర్ జలాలపై మాట్లాడాలని కోరారు. అందుకు ఎస్‌ఈ నిరాకరించారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సాగర్‌నీటిని వారబందీ పద్ధతిలో సక్రమంగా సరఫరా చేయాలని, 150 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిరిపురం మేజరుకు 70 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాస్తారోకో చేస్తున్న రైతుల వద్దకు వైరా సీఐ ఎన్.ఎస్.మోహన్‌రాజా, తల్లాడ ఎస్సై ప్రవీణ్‌కుమార్ వచ్చి వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
కార్యక్రమంలో అఖిలపక్షం నాయుకులు గుంటుపల్లి వెంకటయ్య, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, ఎర్రి నరసింహారావు, బొడ్డు వెంకటేశ్వర్‌రావు, నల్లమోతు మోహన్‌రావు, గోవింద్ శ్రీను, మల్లవరం సర్పంచ్ మేడి సీతారాములు, ఎస్.వి.రాఘవులు, పులి వెంకటనరసయ్య, ఎర్రి కృష్ణారావు, కటికి చినసత్యం, ప్రకాశరావు పాల్గొన్నారు.
సాగర్‌నీటి కోసం రైతుల రాస్తారోకో
Published Thu, Jan 30 2014 2:14 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement