రైతులు స్వచ్ఛందంగా భూములివ్వాలి! | Farmers should give the land as voluntary says Chandrababu | Sakshi
Sakshi News home page

రైతులు స్వచ్ఛందంగా భూములివ్వాలి!

Published Sun, Jan 13 2019 3:29 AM | Last Updated on Sun, Jan 13 2019 3:29 AM

Farmers should give the land as voluntary says Chandrababu - Sakshi

శంకుస్థాపన సభలో మాట్లాడుతున్న సీఎం

సాక్షి, విజయవాడ: విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద భూములున్న రైతులు వాటిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆ భూములను అభివృద్ధి చేసి అమరావతికి దీటుగా నిర్మాణాలు చేపడతామని ప్రకటించారు. కృష్ణా నదికి అవతల వైపు మాత్రమే అభివృద్ధి చెందుతోందని.. విజయవాడ వైపు రైతులు కూడా భూములిచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.

కృష్ణా నదిపై అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.1,387 కోట్లతో నిర్మించనున్న ఐకానిక్‌ వంతెనకు, రూ.740.65 కోట్లతో ఏర్పాటు చేయనున్న నీటి శుద్ధి కేంద్రానికి ముఖ్యమంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. అమరావతి వచ్చే వారికి కూచిపూడి నాట్యంతో స్వాగతం పలికేలా ఈ ఐకానిక్‌ బ్రిడ్జిని.. కూచిపూడి నాట్య భంగిమలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. దీనికి కూచిపూడి ఐకానిక్‌ బ్రిడ్జిగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. అలాగే బ్రహ్మాండమైన మసీదు, చర్చిలు కూడా నిర్మిస్తామన్నారు.

ఐకానిక్‌ బ్రిడ్జిని మూడు, నాలుగేళ్లలో నిర్మిస్తామంటే కుదరదని.. 15 నుంచి 18 నెలల్లోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. గతంలో తాను హైటెక్‌ సిటీని 14 నెలల్లో నిర్మించానని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ సెక్రటేరియట్‌ను కూడా తానే అభివృద్ధి చేశానన్నారు. తాను తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి సెక్రటేరియట్‌కు వెళ్లినప్పుడు గోడలపై కిళ్లీలు ఊసి ఉండేవన్నారు. వాటిని శుభ్రం చేయించి సెక్రటేరియట్‌ను అభివృద్ధి చేయించానని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని ఐదు అద్భుత నగరాల్లో అమరావతి ఒకటి అవుతుందన్నారు.

అమరావతి అభివృద్ధికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అయినా ఐదేళ్లలో ఎవ్వరూ చేయలేనంత అభివృద్ధి చేశామని ప్రకటించారు. త్వరలోనే మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. సమావేశంలో మంత్రులు నారాయణ, దేవినేని ఉమా, ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని శ్రీనివాస్‌(నాని) తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement