పరిగి, న్యూస్‌లైన్ : కూరగాయలు సాగుచేసే రైతులను ప్రోత్సహిస్తామని చెబుతున్న ప్రభుత్వం మాటలు వట్టివేనని తేలుతోంది. ఒక్కసారి పంట నష్టపోయిన రైతులు.. మళ్లీ సాగుకు సమాయత్తమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. వాతావరణ పరిస్థితుల కారణంగా నష్టపోతున్న కూరగాయల రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
నష్టం వివరాలను రాసుకుని వెళ్తున్నారే తప్ప.. పైసా పరిహారం చెల్లించడం లేదు. వరితోపాటు ఇతర పంటల కు ఆరు నెలలు అటూఇటుగా పరిహారం అందజేస్తున్న అధికారులు కూరగాయల రైతుల విషయం లో వివక్ష చూపుతున్నారు. 2009లో పంటలు నష్టపోయిన రైతుల వివరాలను పంపామని, పరిహారం విడుదలైందని అధికారులు చెబుతున్నా అది ఇంతవరకు రైతులకు చేరలేదు. గత నాలుగేళ్లుగా అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా కూరగాయలు, పండ్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు.
2010, 2011, 2012,13 సంవత్సరాల్లోనూ జిల్లాలో రైతులు భారీగా నష్టపోయారు. వీరంతా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. గత వేసవి సీజన్‌లో కురిసిన వడగళ్ల వానకు జిల్లాలో మూడు వేల పైచిలుకు ఎకరాల్లో కూరగాయల పంటలు నష్టపోయినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. కానీ పరిహారం ఊసు మాత్రం ఇంతవరకు లేదు.
ఇదేనా ప్రోత్సాహం..
జిల్లాను కూరగాయల జోన్‌గా మారుస్తామని, కూరగాయల సాగును ప్రోత్సహిస్తామని, నిల్వ కోసం శీతల గిడ్డంగులు నిర్మిస్తామని, మార్కెట్ సౌకర్యం కూడా కల్పిస్తామని అధికారులు నాలుగైదు ఏళ్లగా ఊదరగొడుతున్నారు. కానీ చేసింది మాత్రం ఏమీ లేదు. పరిహారం అందిస్తేచాలని, సౌకర్యాలు తర్వాత అని రైతులు అంటున్నారు.
2009లో నాలుగు వేల ఎకరాల్లో పంటలు నష్టపోగా వాటికి సంబంధించి జిల్లాకు రూ.నాలుగు కోట్ల పరిహారం మంజూరైనట్టు అధికారులు చెబుతున్నారని, అది ఇంతవరకు తమ ఖాతాల్లో పడలేదని రైతులు చెబుతున్నారు. 2010, 2011 సంవత్సరాల్లో మూడు వేల ఎకరాల చొప్పున, 2012,13లలో అదే స్థాయిలో రైతులు నష్టపోయారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
పండ్ల తోటల నష్టం.. నివేదికలే లేవు
జిల్లాలో పండ్ల తోటల నష్టం వివరాలను సేకరించడంలో అధికారులు విఫలమయ్యారు. తెగుళ్లు సోకి నష్టం వాటిల్లితే దానికి పరిహారం ఇవ్వడం వీలుకాదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా రకాల పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రస్తుతం జిల్లాలో 8 వేలకుపైగా ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తుండగా అందులో ఆరు వేల పైచిలుకు ఎకరాలు పరిగి నియోజకవర్గంలోనే ఉన్నాయి. రెండేళ్లుగా పండ్ల తోటలకు తెగుళ్లు సోకి సుమారు నాలుగు వేల ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నాయని, జిల్లా వ్యాప్తంగా రైతు లు కోట్లాది రూపాయలు నష్టపోయారని తెలుస్తోంది.
ఎన్నాళ్లకిస్తారో పరిహారం!
Published Wed, Jan 29 2014 10:54 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement