సాక్షి, గుంటూరు: ధాన్యం సిరులు పండించే రైతన్న నేడు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. బీపీటీ రకం సన్నబియ్యానికి పెట్టింది పేరైన జిల్లాలో అన్నదాత అప్పులపాలవుతున్నాడు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా వరి పంట దెబ్బతింది. ప్రధానంగా కృష్ణాపశ్చిమ డెల్టాలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట ఎదుగుతున్న దశలోనే వర్షాలు పడడంతో అధికశాతం పంట నేలవాలి నీటిలో నానింది. దీంతో దిగుబడి తగ్గి పెట్టుబడులు కూడా దక్కవని తెలుస్తోంది. మరోవైపు పత్తి, మిరపతో పాటు డెల్టాలో ఉద్యాన, వాణిజ్య పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 60 శాతం మంది కౌలురైతులు ఉన్నారు. డెల్టాలో వరిసాగు కోసం ఏడాది ముందుగానే కౌలు అడ్వాన్స్‌లు చెల్లించి మరీ సాగు చేసుకుంటున్నారు. ఈ వర్షాలు కౌలురైతులపై పెనుభారాన్ని మోపాయి. అంచనాలకు వచ్చే ప్రభుత్వ అధికారులు పట్టాదారు పుస్తకాల ప్రకారం నష్టాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల కౌలురైతులకు మొండిచేయి చూపుతుండటం గమనార్హం.
జిల్లావ్యాప్తంగా లక్ష ఎకరాల్లో..
జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. పంట కాలువల ఠమొదటిపేజీ తరువాయి
ద్వారా నీటి విడుదల లేకున్నా, సకాలంలో వర్షాలు కురవడంతో చెరువులు, కాలువలు ద్వారా నీరు పెట్టుకుని సాగు చేపట్టారు. భారీగా కురిసిన వర్షాలతో తెనాలి, దుగ్గిరాల, కొల్లూరు, కొల్లిపర, రేపల్లె, వేమూరు తదితర మండలాల్లో వరి దిగుబడి బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా డెల్టాలోని కొమ్మమూరు, నల్లమడ, ఈస్ట్‌శ్యాంప్ కెనాల్స్‌కు అక్కడక్కడ గండ్లు పడి వరద ప్రభావంతో పొలాల్లో నీరు నిలిచింది.ఈ కారణంగా వరి కంకులు తాలుగా మారే ప్రభావం ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి సాగుకు సంబంధించి ఎకరాకు రూ.15వేలు నష్టపోయినట్టు రైతులు చెబుతున్నారు. గురజాల, మాచర్ల, దాచేపల్లి, నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట తదితర మండలాల్లో సుమారు 2.20 లక్షల ఎకరాల్లో పత్తిపంట నీటమునగ్గా, ఎకరాకు రూ. 25వేలు చొప్పున నష్టం వాటిల్లింది. ఉద్యాన, వాణిజ్యపంటలు సాగు చేసిన రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు.
గ్రామాల్లో కూలీల కొరత
వర్షాల కారణంగా నేలవాలిన పైరును పైకిలాగడం, పొలాల్లో నిలిచిన నీటిని డ్రైన్‌లలోకి మళ్లించడానికి రైతులు జేసీబీలు, డీజిల్ ఇంజిన్‌లు వాడుకుంటున్నారు. మరోవైపు పొలం పనులు చేసేందుకు గ్రామాల్లో కూలీల కొరత కూడా తోడైంది. వరి చేలల్లో ఎకరాకు 10 నుంచి 15 బస్తాల దిగుబడి తగ్గుతుందని రైతులు అంచనా వేస్తున్నారు. మొదటి తీత పత్తికూడా అధికశాతం గుల్లగా మారడం తడిసిన రంగుమారడంతో వ్యాపారులు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు.
అన్నదాత అప్పులపాలు !
Published Sat, Nov 2 2013 3:26 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement