దక్కేది అంతంత.. కొంటారా అంతా
Published Sat, Nov 5 2016 2:03 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM
ఏలూరు (మెట్రో) : ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,550, సాధారణ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,470గా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. అదికూడా నిర్దేశించిన స్థాయిలో తేమ శాతం ఉంటేనే చెల్లిస్తారు. లేదంటే మద్దతు ధరలోనూ కోత తప్పని పరిస్థితి. ఇప్పటికే జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి. ప్రభుత్వం నేటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు మాసూలు చేసిన ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకుంటున్నారు. తీరిగ్గా మేల్కొన్న అధికారులు జిల్లా వ్యాప్తంగా 260 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈనెల 7వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ నెల రెండో వారం నాటికి గాని ఆ కేంద్రాలు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. రైతులకు చెల్లించే మద్దతు ధర అంతంత మాత్రంగానే ఉన్నా.. రైతులందరి నుంచి ధాన్యం కొనే పరిస్థితి ఐకేపీ కేంద్రాల్లో లేకపోవడంతో ధాన్యాన్ని దళారులు తన్నుపోతున్నారు.
తేమ శాతాన్ని బట్టి ధర చెల్లింపు
ధాన్యంలో 17శాతానికి మించి తేమ ఉండకూడదు. అంతకుమించి తేమ ఉంటే రైతులకు చెల్లించే ధర తగ్గిస్తారు. 17 శాతం తేమ ఉండే గ్రేడ్ ఏ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,550, 75 కేజీల బస్తాకు రూ.1,132.50 చెల్లిస్తారు. సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,470, 75 కేజీల బస్తాకు రూ.1,102.50 చెల్లిస్తారు. తేమ శాతం పెరిగితే.. ఆ శాతానికి అనుగుణంగా ధర తగ్గిపోతుంది.
వెబ్‌ల్యాండ్.. ఈ క్రాప్ ఆధారంగా కొనుగోళ్లు
ప్రస్తుత ఖరీఫ్ సీజ¯ŒS నుంచి ధాన్యం కొనుగోళ్లలో నూతన విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఈ క్రాప్, వెబ్‌ల్యాండ్ విధానం ఆధారంగా కొనుగోళ్లు జరుపుతారు. జిల్లా వ్యాప్తంగా 260 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వీటిలో 160 కేంద్రాలు ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) ఆధ్వర్యంలోను, 100 కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీలు) ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి రావచ్చని అంచనా వేస్తున్నారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ధాన్యం కొనుగోళ్లకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. రైతుకు న్యాయం జరిగేలా, దళారులను అడ్డుకునేలా అన్నిశాఖల అధికారుల ఈసారి ధాన్యం కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించి కిందిస్థాయి నుంచి తనిఖీలు జరిపిస్తాం. రైతు నుంచి ధాన్యం మిల్లరుకు చేరిన తరువాత ట్రక్‌షీట్‌ను కూడా పరిశీలించి అసలైన రైతు ధాన్యం మాత్రమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– పి.కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్
మద్దతు ధర బాధ్యత రాష్ట్రానిదే
భారత రాజ్యాంగాన్ని బట్టి చూస్తే వ్యవసాయం రాష్ట్ర జాబితాలోనే ఉంది. మద్దతు ధరలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ కేంద్రం ఇచ్చే బోనస్‌తోనే సరిపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాలం గడిపేస్తోంది. పెట్టుబడికి అదనంగా మద్దతు ధర ప్రకటించి రైతులను రాష్ట్ర ప్రభుత్వమే విధిగా ఆదుకోవాలి. – నాగబోయిన రంగారావు, అధ్యక్షుడు, రాష్ట్ర కౌలు రైతుల సంఘం
Advertisement
Advertisement