
రైతన్న కన్నెర్ర
► జాతీయ, రాష్ట్ర రహదారులపై రాస్తారోకో
► నాలుగు గంటలసేపు ఆందోళన
► కనీవినీ ఎరుగని రీతిలో మిర్చి ధర పతనం
► రూ.1500–2000 మధ్యే క్వింటా మిర్చి
► వ్యాపారులు, అధికారులు కుమ్మక్కయ్యారని రైతుల ఆగ్రహం
దారుణంగా దిగజారిన ధరలతో కడుపు మండిన రైతన్న కన్నెర్ర చేశాడు. కనీవినీ ఎరుగని రీతిలో క్వింటా మిర్చి కేవలం రూ.1500–2000 మధ్యే ధర పలుకుతుండటంపై మండిపడ్డాడు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై ధరలు పతనం చేశారని రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. స్వేదం చిందించి రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండిస్తే ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించకుండా దగా చేస్తోందని ఆందోళన చెందారు.
ప్రస్తుతం ఉన్న మిర్చి ధరతో కోత కూలి ఖర్చు కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడితే తీరా పంట అమ్ముకునే సమయానికి ధర లేకుండా చేస్తే తమ బతుకులు ఏం కావాలని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.1500 రాయితీ పథకం ద్వారా వ్యాపారులు మిర్చి కొనుగోలు చేయడం లేదన్నారు. కేవలం కమీషన్ వ్యాపారుల కుట్ర కారణంగానే ధరలు దిగజారాయని ధ్వజమెత్తారు.
సాక్షి, అమరావతి బ్యూరో : సరుకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని కమీషన్ ఏజెంట్లు, నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్న యార్డు పాలక వర్గం, ధరలు పతనమైనా పట్టించుకోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పోరుబాట పట్టారు. తీవ్ర ఆగ్రహంతో చిలకలూరిపేట జాతీయ రహదారి, నరసరావుపేట మార్గంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రైతుల ఆందోళన కొనసాగింది. నాటు రకం మిర్చిని వ్యాపారులు కొనుగోలు చేయడం లేదని తెలిపారు.
పది రోజులుగా మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన చెందారు. తేజ (హైబ్రిడ్) రకాలు సైతం కేవలం క్వింటాలు రూ.2500–3000కు అడుగుతున్నారని వాపోయారు. సాధారణ రకాలు క్వింటా రూ.1500కు మించి అడగడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ప్రకటించాక ధరలు మరింత పతనమయ్యాయని చెప్పారు. మార్కెట్ యార్డులో కొనుగోళ్లు మందగించాయన్నారు.
యార్డు బయటే నిల్వలు...
రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన వందలాది లారీల సరుకును మార్కెట్ బయటనే అధికారులు దించివేశారు. ఆ సరుకును కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పినా వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జేసీ–2 ముంగా వెంకటేశ్వరరావు మార్కెట్ యార్డుకు చేరుకొని తాను మార్కెట్ యార్డులోనే ఉంటానని, మార్కెట్ యార్డు కార్యాలయంలోకి రావాలని రైతులను కోరారు. శాంతించిన రైతులు కార్యాలయానికి చేరుకొని, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పలువురు రైతులు మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావును నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వ పథకంపై విధివిధానాలు ఏవీ?
కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ప్రకటించినప్పటికీ దీనికి సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. అదే సమయంలో అసలు ఈ స్కీమ్‌ను ఎలా అమలు చేస్తారో స్పష్టత లేక రైతులు ఇబ్బంది పడ్డారు. దీనికి రాష్ట్రం ప్రభుత్వం ఇచ్చే బోనస్ క్వింటాకు రూ.1500 ఇస్తారా.. లేదా హ్యాండ్లింగ్ చార్జీలు రూ.1250 కలిపి ఇస్తారా అని రైతులు ప్రశ్నించారు.
మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికార వర్గాల సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం ప్రకారం మిర్చికి క్వింటాలు రూ.5 వేలు మాత్రమే రైతుకు వర్తిస్తుందని తెలిపారు. హ్యాండ్లింగ్ చార్జీలు రైతులకు రావని, అది కేవలం మార్క్‌ఫెడ్ అధికారులకు కొనుగోలు నిర్వహణ వ్యయంగా వెళుతుందని పేర్కొన్నారు.
ఉదయం ఓ ధర.. సాయంత్రం మరో ధర..
గుంటూరు మిర్చి యార్డులో వ్యాపారులు, మార్కెటింగ్ అధికారులు కుమ్మక్కు కావడం వల్ల ధరలు పతనమవుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. బిడ్డింగ్ తర్వాత మచ్చు తీసుకొనేందుకు వ్యాపారులు ఎప్పుడు వస్తారోనని తిండీతిప్పలు లేకుండా ఇక్కడే నిరీక్షించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
ఉదయం శాంపిల్స్ తీశాక వ్యాపారులు ఓ ధరకు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. సాయంత్రం సరుకు తరలించే సమయానికి అదే వ్యాపారి ఉదయం ధరకు కొనడం వీలుకాదని, ధర తగ్గించి అడుగుతుండటంతో అమ్ముకోవాలో, ఉంచుకోవాలో తెలియడం లేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మేమెలా బతకాలి?
నేను వారం రోజుల ముందు 273 రకం మిర్చిని తీసుకొచ్చాను. మొన్నటి వరకు క్వింటాలు రూ.4500 ఉన్న మిర్చి ప్రస్తుతం రూ.2 వేలు కూడా అడగటం లేదు. నాటు కాయలు అంటే కొనబోమంటున్నారు. రాయితీ పత్రాలు లేకుండా కొనుగోలు చేస్తామంటున్నారు. రైతులు ఎలా బతకాలి. – శ్రీనివాసులరెడ్డి, పెద్ద అరవీడు, ప్రకాశం జిల్లా.
వారం రోజులుగా పడిగాపులు
వారం రోజులుగా గుంటూరు మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నా. వ్యాపారులు సరుకు కొనటం లేదు. తేజ రకం కాయలు మూడు రోజుల కిందట రూ.5 వేలకు అడిగారు. సరుకు మిర్చి యార్డు బయటే ఉంది. మచ్చు తీసేందుకు వ్యాపారులు ఎప్పుడు వస్తారోనని టిఫిన్ కూడా చేయకుండా ఎదురు చూశా. తీరా వ్యాపారులు మచ్చు తీశాక క్వింటా రూ.3 వేలకు అడుగుతున్నారు. – షేక్ జాన్, పెదకూరపాడు