సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని వైఎస్‌ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభత్వుం విఫలమైందని ఆయన విమర్శించారు. రైతు దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల రైతులకు వైఎస్‌ఆర్ సీపీ తరఫున ఎంవీఎస్ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతు దినోత్సవ శుభాకాంక్షలు చెప్పలేని స్థితిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని ఎంవీఎస్ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.
రైతులకు గిట్టుబాటు ధర ముష్టి వేసినట్లు పెంచుతున్నారని,అధికారంలోకి రాక ముందు చంద్రబాబు సోమనాథ్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పిన మాటల ఎక్కడికి పోయాయన్నారు. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని మోసం చేశారన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు తెచ్చింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని ఎంవీఎస్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలవరానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ...‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ హయంలోనే రైతులు సంతోషంగా ఉన్నారు. రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రమే వైఎస్‌ఆర్ సీపీ లక్ష్యం. వైఎస్‌ఆర్ ఒకటి చెప్పి..పది చేశారని గుర్తు చేశారు. నాయకుడు అంటే అలా ఉండాలన్నారు. రైతుకు ఎంత ఇచ్చిన కూడా తక్కువే అన్నది మహానేత ఆలోచన. అదే స్ఫూర్తితో ఇవాళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ముందుకు సాగుతున్నారు. వైఎస్‌ఆర్ హయాంలో మద్దతు ధరలు పెరిగాయి, ఆహార భద్రత లభించిందిం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెబుతున్నా, ఏవిధంగా రెట్టింపు చేస్తారు. ఉద్యోగులు, ఎమ్మెల్యేల జీతభత్యాలు రెట్టింపు చేసుకున్నారు కానీ, రైతులకు అలాంటి విధానం ఎక్కడైనా వర్తింపజేశారా’ అని ప్రశ్నించారు.
ఇవాళ అతితక్కువ తలసరి ఆదాయం ఉండేది చేనేత కార్మికులు, రైతులదే అని ఎంవీఎస్ నాగిరెడ్డి వివరించారు. ఉత్పత్తి వ్యయం తగ్గించుకోండని రైతులకు సూచిస్తున్నారే, అదే ఉద్యోగస్తుల వద్దకు వచ్చే సరికి మీ కుటుంబ అవసరాలు, ఖర్చులు తగ్గించుకోండి అనడం లేదే అన్నారు. ధాన్యానికి పెంచిన మద్దతు ధర ఏడాదికి రూ.50 పెంచేతి ఏమాత్రం సరిపోతుందని ప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రాల మాదిరిగా ఇక్కడేందుకు మద్దతు ధరలు ప్రకటించడం లేదన్నారు. ఏపీలో వేరుశనగ రూ.3200కు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రైతులను విస్మరించిన ప్రభుత్వాలకు మనుగడ లేదని ఆయన హెచ్చరించారు. మహానేత మాదిరిగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తారని, వైఎస్‌ఆర్ రైతు భరోసా ద్వారా రైతాంగాన్ని ఆదుకుంటామని నాగిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment