
మృతుడు బెల్లాన గోపాల్
సాలూరు రూరల్: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాల్లో చీకటి నింపింది. కన్నతండ్రే కొడుకుపట్ల కాలయముడైన ఘటన మండలంలోని కూర్మరాజుపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఘటనపై గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన బెల్లాన గోపాల్ (28) జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి ఇంట్లో, వీధిలో వారితో గొడవలు పడేవాడు. ఆదివారం రాత్రి యథావిధిగానే గోపాల్ తాగి కూర్మరాజుపేటలో తన ఇంటికి వచ్చి తల్లి దండ్రులైన సింహాచలం, పోలమ్మలతో గొడవకు దిగాడు. ఈ గొడవలో తండ్రి ఆవేశం తో కర్రతో గోపాల్ తలపై గట్టిగా కొట్టాడు.
దీంతో గోపాల్ అక్కడికక్కడే పడిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది చేరుకుని గోపాల్‌ను పరీక్షించి చనిపోయినట్టు నిర్ధారించారు. క్షణికావేశంలో జరిగిన ఘటనలో కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మందలిద్దామన్న కోపంలో తీసుకున్న నిర్ణయం కుమారిడికి చావును తెచ్చిందంటూ విలపిస్తున్నారు. మృతిని భార్య జయ మరి పల్లి గ్రామంలోని పుట్టింటిలో ఉంది. వీరికి బాబు, పాప ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతుడి భార్య జయకు సమాచారం అందించారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment