ఏలూరు టౌన్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కాల యముడై కాటేశాడు. చిన్నారి బిడ్డను కాళ్ల కింద వేసి తొక్కి కర్కశంగా చంపేశాడు. పేగు బంధాన్ని క్రూరంగా తెంచేసుకున్నాడు. ఏలూరు నగరంలోని కొత్తగూడెం సెంటర్‌కు చెందిన ఒక వ్యక్తి కన్న కూతురినే కొట్టి చంపిన సంఘటన కలకలం రేపింది. భార్యభర్తల మ«ధ్య ఉన్న వివాదం కాస్తా కన్న కూతురి ప్రాణాన్ని బలిగొంది. ఐదేళ్ల చిన్నారి బాలిక విగత జీవురాలిగా కనిపించడంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రేమా ఆపాయ్యతలు పంచాల్సిన తండ్రి కసాయి వాడిలా మారి చిన్నారి పట్ల క్రూరంగా వ్యవహరించడంతో స్థానికులు, బంధువులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిందితుడు పరారవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఏలూరు వన్‌టౌన్ కొత్తగూడెం సెంటరుకు చెందిన కాటిమాల రవితేజ, దుర్గమ్మకు ఆరేల్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె రూపిన (5) , కుమారుడు జశ్వంత్ (2) ఉన్నారు. దుర్గమ్మను రెండో వివాహం చేసుకున్న రవితేజ మొదటి నుంచి ఆమెను వేధింపులకు గురి చేస్తూనే ఉన్నాడు. తాపీ పని చేసుకుంటూ జీవించే రవితేజ మద్యానికి బానిసై కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోడని బంధువులు పేర్కొన్నారు. భార్యభర్తల మధ్య తరుచూ అనుమానంతో వివాదం చోటు చేసుకునేది. ఈ నేపధ్యంలో చిన్నారి రూపిన పట్ల రవితేజ నిర్దయగా వ్యవహరిస్తాడని తల్లి దుర్గమ్మ తెలిపింది. కొద్ది రోజుల క్రితం బాలికను తీవ్రంగా కొట్టడంతో చెయ్యి విరిగిందని పాఠశాలకు సైతం వెళ్లలేని పరిస్థితిలో ఇంటి వద్దనే ఉంటుంది.
కొద్ది రోజులుగా అదే ప్రాంతంలో నివసిస్తున్న తల్లి వద్ద దుర్గమ్మ పిల్లలతో ఉంటుంది. తన భార్య దుర్గమ్మ, పిల్లలను ఇంటికి పంపాలని రవితేజ అత్తకు చెప్పాడు. దీంతో భర్త వద్దకు వెళ్లిన దుర్గమ్మతో రవితేజ శనివారం మధ్యాహ్నం గొడవ పడ్డాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో రవితేజ చిన్నారి బాలిక పొత్తికడుపులో బలంగా తన్ని గాయపరిచాడు. బాలిక అక్కడే కుప్పకూలిపోయింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం సూచించారు. ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా బాలిక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ సంఘటనపై సమాచారం అందుకున్న అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని హత్య సంఘటనకు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. రవితేజ గతంలోనూ భార్యా, పిల్లలను తరుచూ కొడుతూ ఉండటంతో దుర్గమ్మ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చి పంపినా అతడిలో మార్పు రాలేదని పోలీసులు అంటున్నారు. బాలిక ఇంటికి వన్‌టౌన్ సీఐ అడపా నాగమురళి, ఎస్సై రామకోటేశ్వరరావు తన సిబ్బం దితో వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. పరారీలో ఉన్న రవితేజను వెంటనే అరెస్టు చేస్తామని, కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని బాధితురాలు దుర్గమ్మకు చెప్పారు. కాగా, శనివారం రాత్రి నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment