పేరు గొప్ప.. | Fatherland, public issues, ration cards | Sakshi
Sakshi News home page

పేరు గొప్ప..

Published Tue, Nov 11 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

పేరు గొప్ప..

పేరు గొప్ప..

కర్నూలు(జిల్లా పరిషత్) :
 ప్రజల చెంతకే పరిపాలన అంటూ ప్రారంభించిన ‘జన్మభూమి-మా ఊరు’ తూతూమంత్రంగా కొనసాగింది. అధికారులకు డీజిల్ ఖర్చులు, శ్రమ తప్ప ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని తేలిపోయింది. మరోవైపు ఇది తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలా సాగిపోయింది. గత నెల 4వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆళ్లగడ్డ ఉప ఎన్నిక, హుదూద్ తుపాను కారణాల వల్ల మధ్యలో రెండుసార్లు వాయిదా పడింది.

దీంతో మూడోసారి అధికారులు హడావుడిగా కార్యక్రమాన్ని ముగించేందుకు షెడ్యూల్ రూపొందించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమం జిల్లాలో మంగళవారంతో ముగియనుంది. జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జరుగుతున్న తీరును ‘సాక్షి నెట్‌వర్క్’ జిల్లాలో పలు ప్రాంతాల్లో సోమవారం పరిశీలించింది.

 నిర్వహించాల్సిందిలా...!
 వాస్తవానికి జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలనే విషయంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను సూచించింది. వీటి ప్రకారం మా తెలుగుతల్లి గీతం, జన్మభూమి పాట, సీఎం సందేశంతో ప్రారంభించాలి. ఆ తర్వాత మనుషులతో పాటు పశువులకూ వైద్యశిబిరాలను నిర్వహించాలి.
 
     {పభుత్వం ప్రకటించిన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లపై ఉదయం చర్చించాలి. తర్వాత పింఛన్‌ల పంపిణీ ప్రక్రియ నిర్వహించాలి.

     {Vూపులుగా ఏర్పడి పొలాలను సందర్శించాలి. గ్రామ సూక్ష్మ ప్రణాళిక కోసం వివరాలు సేకరించాలి.
     మధ్యాహ్నం తర్వాత వివిధ అధికారుల టీంలు... గ్రామంలో పర్యటించి సమస్యలు, అవసరాల పై విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాలి. ఏడాదిలో సాధించబోయే ప్రగతి, ఐదేళ్లలో సాధించే పనులను ఇందులో పొందుపరచాలి.

 అంతేకాకుండా... రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా చెప్పుకుంటున్న పేదరికంపై గెలుపు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు చేపట్టాలి.

 జరిగిందే మిటంటే..
 అయితే, ‘సాక్షి’ పరిశీలించిన ఏ ప్రాంతంలోనూ జన్మభూమి - మా ఊరు కార్యక్రమం ఈ విధంగా జరగడం లేదు. కేవలం వచ్చిన ప్రజల నుంచి అర్జీలను తీసుకోవడమే కనిపించింది. అధికారుల బృందాలు గ్రామాల్లో పర్యటించడమే లేదు. ఎటువంటి పర్యటనలు లేకుండా కేవలం నివేదికలను పేపర్లో తయారు చేస్తున్నారు.
 
 అన్నీ ప్రశ్నలే...!
 జన్మభూమి కార్యక్రమం మొత్తం ఎక్కడా స్పష్టత లేకుండా గందరగోళంగా కొనసాగుతోంది. జన్మభూమి మొత్తంలో తొలగించిన తమ పింఛన్లు, రేషన్‌కార్డులను తిరిగి పునరుద్ధరించమని ప్రజలు పెద్ద ఎత్తున కోరడం ‘సాక్షి’ పరిశీలనలో కనిపించింది. అయితే, ఏ ఒక్క సమస్యకూ అధికారుల నుంచి కానీ అటు ప్రభుత్వం నుంచి కానీ స్పందన కనిపించ లేదు.

వాస్తవానికి తొలగించిన పింఛన్లు, రేషన్‌కార్డులను అక్కడికక్కడే పరిశీలించి పునరుద్ధరించే అవకాశం ఉంది. అయితే, ఎక్కడా ఈ పని జరగలేదు. ప్రభుత్వం నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. పైగా వచ్చిన ఫిర్యాదులను రికార్డు చేస్తున్న సందర్భాలూ లేవు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు కనీసం రసీదు కూడా ఇవ్వలేదు.

మరికొన్ని చోట్ల పైస్థాయి అధికారులు వస్తారనుకుంటే మినహా మండలస్థాయి అధికారులు పాల్గొనడం లేదు. తమ కిందిస్థాయి అధికారులను కార్యక్రమానికి పంపించి మొత్తం కార్యక్రమాన్ని మమ అనిపించారు. మరికొన్ని ప్రాంతాల్లో రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలని ప్రజలు నిలదీశారు.

 ఒక్క హామీ లభించలేదు...
 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం విఫలమైంది. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు అధికారులు పనిచేయడం లేదు. జన్మభూమిలో సభలో ప్రజలు ఇచ్చిన అర్జీలకు అధికారులు రసీదు ఇవ్వాలన్న నిబంధన ఉన్నా ఎక్కడా పాటించలేదు. కొన్ని చోట్ల నోడల్ అధికారులు డుమ్మా కొట్టడం, మరికొన్ని గ్రామాలకు అధికారులు రాకపోవడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లో నిర్ణీత సమయానికి ఎక్కడా కార్యక్రమం ప్రారంభం కాలేదు.

కార్తీక సోమవారం కావడంతో మహిళలు శైవ క్షేత్రాలకు వెళ్లడంతో మహిళల కొరత తీవ్రంగా ఏర్పడింది. మరికొన్ని చోట్ల వర్షం, కార్తీక మాసం దెబ్బతో సమావేశాలు వెలవెలబోయాయి. మొక్కుబడిగా కొనసాగుతున్న జన్మభూమిలో అర్జీలు ఇచ్చి నిరాశతో వెనుదిరిగివెళ్లారు. ఏళ్లు కావస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ప్రజలు వాపోయారు. సమస్యలు ఏమున్నా మొదటఅర్జీలు ఇవ్వాలని అంటున్న అధికారులు చూస్తాం చేస్తామనడం తప్ప పరిష్కారం చేసిందిలేదని ఆయా గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.

ఇప్పుడు అర్జీలు ఇవ్వండి పరిశీలిస్తామని అధికారులు అనడంతో ప్రజలు నిట్టూరుస్తున్నారు. కనీసం హామీ కూడా అధికారుల నుంచి లభించకపోవడంతో కొన్నిచోట్ల శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. సామాజిక పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాల కోసం ఒక్క కర్నూలు నగరంలోనే సోమవారం వరకు 32 వేల దరఖాస్తులు ప్రజల నుంచి రావడం గమనార్హం.

 వెలవెలబోయిన సభ!
 కర్నూలు నగరంలో 4వ వార్డులోని బాపూజీనగర్‌లో ప్రజలు లేక జన్మభూమి సభ వెలవెలబోయింది. ముందుగానే పొదుపు మహిళలను తెచ్చి కూర్చోబెట్టాలని అధికారులు ఆదేశించినా, అనేక మంది మహిళలు ఇళ్లల్లో పనులు వదిలేసి రావడానికి ఇష్టపడటం లేదు. ఎర్రబురుజులో పింఛన్లు ఇస్తారంటూ తెలుగుదేశం కార్యకర్తలు మహిళలను అధికంగా తరలించారు. ఈ రెండు సభలకూ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి హాజరుకావడంతో అధికారులు, ఉద్యోగులు కార్యక్రమానికి హాజరయ్యారు.

     కర్నూలు నగరంలోని 36వ వార్డులోని వీకర్‌సెక్షన్ కాలనీలో జరిగిన వార్డు సభలో ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. అధికంగా పింఛన్లు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు కేవలం దరఖాస్తులు మాత్రం స్వీకరించి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో వారిపై వృద్దులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా నగర పాలక సంస్థలో విలీనమైన మామిదాలపాడులో ఏర్పాటు చేసిన గ్రామ సభలో అధికంగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి.
 
 సభకు రాకపోతే రుణం కట్!
 రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు హడావుడిగా జన్మభూమి కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్న అధికారులు ఆయా సభలకు జనాన్ని ఎలా రప్పించాలో తెలియక తికమక పడుతున్నారు. చివరికి ఆ బాధ్యతను పొదుపు సంఘాల మహిళలకు అప్పగించారు. ఆయా సమాఖ్యల లీడర్లు వారి గ్రూపులోని సభ్యులను తప్పనిసరిగా కార్యక్రమానికి తీసుకురావాలని ఆదేశించారు.

లేనిపక్షంలో రుణాలు ఇప్పించమని బెదిరించాలని చెబుతున్నారు. దీంతో జిల్లాలోని అన్నిచోట్లా జన్మభూమి సభల్లో పొదుపు మహిళలే దర్శనమిచ్చారు. సభకు రాని సభ్యులను గ్రూపులోంచి తీసేస్తామని, రుణాలు రానీయకుండా చేస్తామని లీడర్లు బెదిరిస్తున్నారు. సోమవారం పలు చోట్ల కార్యక్రమానికి హాజరుకాని సభ్యులపై గ్రూపుల లీడర్లు ఇదే విధంగా జులుం ప్రదర్శించారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం వార్డు సభలను విజయవంతం చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేయడం కనిపించింది. సభల్లో అన్నీ తామై వేదికలపైనే కూర్చుని అధికారాన్ని చెలాయించే దృశ్యాల దర్శనమిచ్చాయి. సభకు వస్తే పింఛన్లు ఇప్పిస్తామంటూ నమ్మబలికి వృద్దులు, వితంతువులు, వికలాంగులను రప్పించారు. వారిచేత అధికారులకు అర్జీలు సైతం వందల సంఖ్యలో ఇప్పించడమూ కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement