ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా మొదటి ఐదు స్థానాల్లో ప్రకాశం జిల్లా ఒకటిగా నిలిచింది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను కూడా ముందుగా జిల్లాలోనే ప్రకటించి అధికారులంతా ప్రశంసలు అందుకున్నారు. పోలింగ్‌లోనూ, ఫలితాల విడుదల్లోనూ ప్రకాశించిన జిల్లాను చీరాలలో తలెత్తిన వివాదం ఒక్కసారిగా తల్లకిందులు చేసింది. అప్పటివరకు వచ్చిన ప్రశంసలు చీరాల ఘటన మాటున కొట్టుకుపోయినట్లయింది.
అందుకు కారణం.. ఆ నియోజకవర్గంలో ఈవీఎంలను తారుమారు చేశారన్న ఆరోపణలే. వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. అక్కడి స్వతంత్ర అభ్యర్థి గెలుపునకు ఆ అధికారి కృషి చేశారని ఆరోపించారు. అందుకు బలం చేకూర్చే విధంగా చీరాలలోని వీఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కాలేజీలో ఈవీఎంలు వెలుగుచూశాయి. దీంతో వివాదం తారాస్థాయికి చేరింది.
చివరకు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జోక్యం చేసుకుని గుంటూరు జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్, తెనాలి ఆర్డీవో శ్రీనివాసరావు, బాపట్ల తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లును విచారణాధికారులుగా నియమించారు. వీఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కాలేజీలో ఉన్న 71 ఈవీఎంలను చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సమక్షంలో మంగళవారం విచారణాధికారులు తనిఖీ చేయగా అవి రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలుగా తేలింది. దీంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. నియోజకవర్గంలో ఆరు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
చీరాల ఉత్కంఠకు తెర
Published Thu, May 22 2014 2:47 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement