సాక్షి, అమరావతి: రాజకీయ స్థిరత్వం.. పారదర్శక విధానాలు.. అపార సహజ సంపద.. భారీగా భూమి, నీరు, నైపుణ్యమున్న మానవ వనరుల లభ్యత, మెరుగైన రోడ్డు, రైలు మార్గాలు.., 974 కి.మీ. పొడవైన సుదీర్ఘ తీర ప్రాంతం.. ఆగ్నేయ ఆసియా దేశాల మార్కెట్లతో సత్సంబంధాలు కలిగి ఉండటం పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ‘గమ్యస్థానం’గా మారిందని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే రూ.20 వేల కోట్ల పెట్టుబడితో 39 మెగా, భారీ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించడాన్ని గుర్తు చేస్తున్నారు.
ఈ పరిశ్రమల వల్ల ప్రత్యక్షంగా 33 వేల మందికి ఉపాధి లభిస్తోంది. రూ.1,840 కోట్ల పెట్టుబడితో 6,572 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈలు) ఉత్పత్తి ప్రారంభించడంతో 49,001 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుండటాన్ని పారిశ్రామికవేత్తలు ప్రస్తావిస్తున్నారు. రూ.13 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిన 1,736 సంస్థలకు ఏపీఐఐసీ (ఆంధ్రపదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) భూములు కేటాయించడాన్ని గుర్తు చేస్తున్నారు. రూ.30 వేల కోట్ల పెట్టుబడితో ఆదిత్య బిర్లా గ్రూప్.. సీఆర్‌ఆర్‌సీ, జేఎస్‌డబ్ల్యూ, పానాసోనిక్ లాంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా భాసిల్లుతోందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇదీ వాస్తవ చిత్రం. రాష్ట్రంలోకి పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తుతుంటే రాష్ట్రం నుంచి వెనక్కి మళ్లుతున్నాయంటూ ఎల్లో మీడియా అవాస్తవ కథనాలను అచ్చోసి ప్రజలపై రుద్దాలని చూడటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
నూతన విధానంతో వేగంగా అనుమతులు
వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శక విధానాలకు పెద్దపీట వేస్తోంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, భూ కేటాయింపులతోపాటు అనుమతులను వేగంగా, పారదర్శకంగా జారీ చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించేలా నూతన పారిశ్రామిక విధానంతో ప్రభుత్వం పనిచేస్తోంది.
నిపుణులైన మానవ వనరుల కోసం వర్సిటీలు
రాష్ట్రంలోకి పెట్టుబడుల ప్రవాహం నేపథ్యంలో నిపుణులైన మానవ వనరులపై ప్రభుత్వం దృష్టి సారించింది. తిరుపతిలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీ, విశాఖపట్నంలో హైఎండ్ స్కిల్ డెవలప్‌మెంట్ వర్శిటీని ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇచ్చే చర్యలు చేపట్టింది. 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్నది ప్రభుత్వ లక్ష్యం. యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మంగళగిరికి సమీపంలోని నవులూరులో రూ.200 కోట్లతో ఎంఎస్‌ఎంఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
- 2019 మే 30 నుంచి ఇప్పటివరకూ సింగిల్ డెస్క్ (ఏక గవాక్ష) విధానంలో రూ.38,922 కోట్ల పెట్టుబడితో 1,13,900 మందికి ఉపాధి కల్పించేలా 2,589 పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.
- సుమారు రూ.10,944 కోట్ల పెట్టుబడితో 43,300 మందికి ఉపాధి కల్పించే ఏటీసీ టైర్స్, పీఎస్‌ఏ వాల్సిన్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, వింగ్‌టెక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాంటి సంస్థలు 20 పరిశ్రమల ఏర్పాటుకు అందచేసిన ప్రతిపాదనలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఎస్‌ఐపీబీ(స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు) పరిశీలనలో ఉన్నాయి.
- లక్నోలో ఇటీవల డిఫెన్స్ ఎక్స్‌పో సందర్భంగా ఏపీలో సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు.
- చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా తదితర దేశాల పారిశ్రామికవేత్తలతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించింది.
వెల్లువలా పెట్టుబడుల ప్రవాహం
రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉంది. భూముల కేటాయింపు దగ్గర నుంచి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా, పారదర్శకంగా జారీ చేస్తున్నాం. దీనివల్లే తొమ్మిది నెలల్లో 39 భారీ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. రూ.38,922 కోట్లతో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు అందచేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాం. ఎస్‌ఐపీబీ ఆమోదముద్ర వేస్తే రూ.10,944 కోట్లతో 20 భారీ పరిశ్రమల పనులు ప్రారంభమవుతాయి. పెట్టుబడుల ప్రవాహం రాష్ట్రంలోకి వెల్లువలా వస్తోందనడానికి ఇదే తార్కాణం. రూ. 7,916 కోట్లతో ఏర్పాటైన 8 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తి స్థాయిలో ఉన్నాయి. రూ.8,663 కోట్ల పెట్టుబడితో స్థాపించిన 8 పరిశ్రమలు యంత్రాల అమరిక స్థాయిలో ఉన్నాయి. ఇవి అతి త్వరలో ఉత్పత్తిని ప్రారంభిస్తాయి. వీటివల్ల 19,011 మందికి ఉపాధి లభిస్తుంది. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నాయి.
– రజత్ భార్గవ్, పరిశ్రమల శాఖ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment