తిరుచానూరు : పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులో మరో మాస్టర్ ప్లాను అమలుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఆలయానికి రోజురోజుకూ భక్తుల తాకిడి అధికమవుతోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లానును తప్పనిసరిగా అమలుచేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది. టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ గురువారం తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో విలేకర్లతో మాట్లాడిన మాటలు మాస్టర్ ప్లాను వ్యవహారానికి బలం చేకూరుస్తున్నాయి.
ఇదివరకు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉండేది. ఆదాయం అంతంతమాత్రంగానే ఉండేది. ప్రస్తుతం రోజుకు 20 నుంచి 30వేల మంది భక్తులు సరాసరిగా దర్శించుకుంటున్నారు. భక్తులు సమర్పించే కానుకలు, సేవా టికెట్లు ద్వారా నెలకు దాదాపు కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది.
ఈ నేపథ్యంతో అంచెలంచెలుగా మాస్టర్‌ప్లాను అమలుచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో భక్తుల తాకిడి అధికమయితే బస చేసేందుకు అనువుగా తిరుచానూరు షికారీకాలనీ సమీపంలో ఇప్పటికే శ్రీనివాసం, విష్ణునివాసం తరహాలో వసతి సముదాయం నిర్మాణ పనులు చేపట్టారు.
వైకుంఠం తరహాలో క్యూకాంప్లెక్స్
తిరుమల తరహాలో భక్తుల రద్దీ అధికమైతే అమ్మవారి దర్శనానికి ఇబ్బంది ఎదురుకానుంది. దీనిని అధిగమించడం కోసం తిరుమలలోని వైకుంఠం తరహాలో తిరుచానూరులో క్యూకాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. అందుకు ప్రస్తుతం ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాల స్థలాన్ని స్వాధీనం చేసుకునే యోచనలో ఉన్నా రు. పక్కా భవనం నిర్మించి పాఠశాలను అక్కడికి తరలించి, ఈ ప్రాంతంలో క్యూకాంప్లెక్స్ నిర్మించాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.
తోళప్పగార్డెన్‌లోకి అన్నదానం క్యాంటీన్
ఆలయం సమీపంలోని అమ్మవారి ఆస్థానమండపంలో ప్రస్తుతం అన్నదానం క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు దాదాపు 5వేల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నారు. భవిష్యత్తులో భక్తుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో తోళప్పగార్డెన్‌లో అన్ని హంగులతో అన్నదానం క్యాంటీన్ నిర్మాణానికి ఇదివరకే టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే కొన్ని మార్పులు
భక్తుల సంఖ్య అధికమవడంతో దర్శన వేళలు, క్యూలలో మార్పులు చేపట్టారు. రూ.100 టికెట్ కొనుగోలు చేసిన భక్తులు జనరల్ క్యూలతో సంబంధం లేకుండా అమ్మవారిని దర్శించుకునే వెసలుబాటు కల్పించనున్నారు. కుంకుమార్చన సమయంలో సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా రోజుకు మూడు గంటలు(ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) బ్రేక్ దర్శనం తరహాలో కుంకుమార్చన సేవకు 3గంటలు కేటాయించనున్నారు.
భయాందోళనలో స్థానికులు
మాస్టర్‌ప్లాను అంటేనే స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. మాస్టర్‌ప్లాను అమలైతే అమ్మవారి ఆలయ పరిసరాల్లోని ఇళ్లు, దుకాణాలను తొలగిస్తారని, అంచెలంచెలుగా గ్రామస్తులను తిరుమల తరహాలో వేరే ప్రాంతానికి తరలిస్తారనే భయం నెలకొంది. అమ్మవారినే నమ్ముకుని జీవిస్తున్న తమను గెంటేస్తే ఎలా బతకాలంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్థానికుల్లో భయం, అపోహలను తొలగించేందుకు టీటీడీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
తిరుచానూరులో మాస్టర్ ప్లానుకు రంగం సిద్ధం?
Published Sat, Jun 28 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM
Advertisement
Advertisement