తిరుపతి విమ్స్‌లో కొన ఊపిరితో చికిత్స పొందుతున్న రామునాయక్ , ఆదుకోవాలంటూ విలపిస్తున్న భార్య కువిలాబాయి
ఎరువుల దుకాణంలో చిరుద్యోగి. వస్తున్న అరకొర వేతనంతోనే భార్యా పిల్లలతో కలిసి గౌరవప్రదమైన జీవనం. అన్యోన్యంగా సాగుతున్న ఆ కుటుంబాన్ని విధి వక్రీకరించింది. రెండు కిడ్నీలు చెడిపోయి భర్త మృత్యువుతో పోరాడుతుంటే భార్య తల్లడిల్లిపోయింది. అప్పులు చేసి చికిత్సకు ఖర్చు పెట్టింది. తక్కువ పడితే తన వద్ద ఉన్న నగలు.. చివరకు తాళిబొట్టును సైతం తాకట్టుపెట్టి వైద్యం చేయించింది. ఫలితం దక్కలేదు. నానాటికీ మృత్యువుకు చేరువవుతున్న తన భర్తను కాపాడాలంటూ కనిపించిన వారిని కాళ్లావేళ్లా ప్రాధేయపడుతూ భిక్షాటన చేపట్టింది. మంత్రి కాలవ శ్రీనివాసులు ఇలాకా, జిల్లా పరిషత్ చైర్మెన్ పూల నాగరాజు సొంత మండలంలో ఓ గిరిజన కుటుంబం పడుతున్న వేదన ఇది.
అనంతపురం : గుమ్మఘట్ట మండలం మారెంపల్లి తండాకు చెందిన ఎస్. రామునాయక్‌కు నాలుగేళ్ల క్రితం పామిడి మండలం రామగిరి తండాకు చెందిన కువిలా బాయితో వివాహమైంది. ప్రస్తుతం వీరికి హేమంత్‌నాయక్ (3), సాత్విక్ నాయక్ (2) అనే పిల్లలు ఉన్నారు. బీకాం పూర్తి చేసిన రాము నాయక్ ఉద్యోగం రాకపోవడంతో కూలీపనులకు వెళ్లేవాడు. ఏడాది క్రితం కళ్యాణదుర్గంలోని ఓ ఎరువుల దుకాణంలో చిరుద్యోగిగా చేరి నెలకు రూ. 10 వేల వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. కుటుంబ పోషణ భారమైనా భార్యను ఏనాడూ కూలి పనులకు పంపకుండా ఉన్న సంపాదనతోనే గౌరవప్రదంగా జీవిస్తూ వచ్చాడు.
రెండేళ్ల క్రితం బయటపడ్డ వ్యాధి
రెండేళ్ల క్రితం రామునాయక్ అస్వస్థతకు గురవుతూ వచ్చాడు. పలు ప్రాంతాల్లో చికిత్సలు చేయించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు బళ్లారిలో చికిత్స చేయించుకునేందుకు వెళ్లినప్పుడు అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి రెండు కిడ్నీలూ చెడిపోయినట్లు తేల్చి చెప్పారు. చికిత్సల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశారు. డబ్బు తక్కువ పడితే తన నగానట్రాతో పాటు చివరకు తాళిబొట్టును సైతం కువిలాబాయి తాకట్టుపెట్టి రూ. 4 లక్షల వరకు సమకూర్చుకుని బళ్లారి, అనంతపురం, హైదరాబాద్ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఫలితం దక్కలేదు.
చావుబతుకుల మధ్య ఊగిసలాట
రామునాయక్ చికిత్స కోసం రూ. లక్షలు ఖర్చు అవుతూ వచ్చాయి గానీ ఆరోగ్యం ఏ మాత్రం మెరుగు పడలేదు. చివరకు తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. పది నెలలుగా అక్కడే చికిత్స పొందుతున్నాడు. రెండు రోజులకొకసారి డయాలసిస్ చేసి రక్త మార్పిడి చేస్తే తప్ప అతనిలో చలనం ఉండడం లేదు. చివరకు కిడ్నీ దాతలతో పాటు శస్త్రచికిత్సకు రూ. 10లక్షలు అవసరమవుతాయని, లేకుంటే అతని ప్రాణాలు దక్కవంటూ అక్కడి వైద్యులు తేల్చి చెప్పారు. విషయం విన్న నిరుపేద గృహిణి తల్లడిల్లిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment