దర్శి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా రైతులకు తక్కువ ధరలకు పంపిణీ చేయాల్సిన ఎరువులను ఎక్కువ మొత్తాలకు అమ్ముకుని లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులే సొసైటీ అధ్యక్షులు కావడంతో వారి ఇష్టారాజ్యంగా రైతులను దోచుకుంటున్నారు. తూర్పువెంకటాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా ఇప్పటి వరకు 700 టన్నుల ఎరువులు పంపిణీ చేశారు.
వీటిలో కొద్దో గొప్పో మాత్రమే రైతులకివ్వగా.. మిగతా మొత్తం బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. 50 కిలోల యూరియా బస్తా ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం రూ. 298లకే అమ్మాలి. అయితే తూర్పువెంకటాపురం సొసైటీలో బిల్లు మాత్రం రూ.298లు రాసి రూ.320 తీసుకుంటున్నారు. మరో రూ.4 కూలి ఖర్చుల కింద తీసుకుంటున్నారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే ఇష్టమైతే తీసుకోండి..లేకుంటే వెళ్లిపోండి అని తెగేసి చెబుతున్నారు. లేదంటే సొసైటీలో స్టాక్ లేదని..బ్లాక్ మార్కెట్లో ధరలు పెంచుతున్నారు.
బ్లాక్ మార్కెట్‌లో బస్తాకు రూ.100 నుంచి రూ.150 వరకు అధిక ధరలకు అమ్ముతున్నారు. దీంతో ఎక్కువ ధరలకు కొనుగోలు చేయలేక..సొసైటీలో ఎరువులు సరిగా అందించక రైతులు విలవిల్లాడుతున్నారు. కొందరు రైతులు తిరగబడి ఎరువులు ఎందుకు ఇవ్వరని సొసైటీ అధ్యక్షురాలి భర్త పణిదపు వెంకటరామయ్యను మంగళవారం నిలదీయగా..ఆయన మౌనం వహిం చారు. వెంకట రామయ్య టీడీపీ నాయకుడు కావడంతో అధికారులు కూడా ఆయనకే మద్దతు తెలుపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
అదే సమయానికి అక్కడికి వచ్చిన ఏడీ మాలకొండారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా ఎరువులు నిల్వ చేసుకునేందుకు దర్శిలో ఎక్కువ అద్దె చెల్లించి గోడౌన్ తీసుకోవడంతో పది రూపాయలు ఎక్కువ అమ్ముకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చింద ని, ఇక్కడకు వచ్చాక రూ.22 ఎక్కువ అమ్ముతున్నట్లు రైతులు తెలిపారని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయించాల్సిందిగా సొసైటీ అధ్యక్షురాలి భర్త పణిదపు వెంకట్రామయ్యను ఆదేశించామన్నారు.
ఎరువు..బరువు
Published Thu, Nov 13 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement