చక్కెర చిక్కింది
ఎప్పుడూ లేనంతగా చక్కెర ధర ఘోరంగా పడిపోయింది. ఆరు నెలలుగా ధర క్షీణిస్తూ వస్తున్నా గోవాడ లాంటి పెద్ద ఫ్యాక్టరీలు ముందుగా మేల్కొనకపోవడంతో ఇప్పుడు కోట్లలో నష్టపోయే దుస్థితి దాపురించింది. విదేశీ పంచదార దేశీయ మార్కెట్‌లోకి భారీగా దిగుమతి కావడంతో ఇక్కడ పంచదారకు డిమాండ్ పడిపోయింది. దీంతో చక్కెర ఫ్యాక్టరీల్లో లక్షలాది టన్నుల పంచదార నిల్వలు పేరుకుపోయాయి.
చోడవరం, న్యూస్‌లైన్ :
జిల్లాలోని చోడవరం, ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల సహకార చక్కెర కర్మాగారాల్లో సుమారు ఆరు లక్షల క్వింటాళ్ల పంచదార నిల్వలు గోడౌన్లలో మూలుగుతున్నాయి. ఒక్క గోవాడలోనే మూడున్నర లక్షల క్వింటాళ్లు పైగా నిల్వ ఉన్నాయి. మూడు ఫ్యాక్టరీల్లో గతేడాది నిల్వలే మూడు లక్షల క్వింటాళ్లుండగా ఈ ఏడాది మరో మూడు లక్షల క్వింటాళ్లు పంచదార ఉత్పత్తి అయ్యింది. ఒకేసారి క్వింటాకు రూ.800 వరకు మార్కెట్‌లో పంచదార ధర తగ్గిపోయింది. ఈ ఏడాది జూన్ వరకు క్వింటా రూ.3200 అమ్మగా ఆ తర్వాత క్రమేపీ రూ.2950 నుంచి ప్రస్తుతం రూ. 2600కు దిగజారింది. మార్కెట్‌లో ధర పడిపోయే ప్రభావం కనిపించడంతో ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలు ముందుగానే మేల్కొని ఉన్నంతలో కొంతమేర రూ. 2900 ధరకే అమ్మేశాయి. కానీ గోవాడ మా త్రం ఒక బస్తా కూడా అమ్మలేదు. ఇంకా ధర పెరుగుతుందని వేచి చూడటంతో ఇప్పుడు ఆ ధర మరింత పతనమై ఏకంగా రూ.2600కి క్షీణించింది.
గోవాడలో గత ఏడాది నిల్వ రెండు లక్షల క్వింటాళ్లు, ఈ ఏడాది మరో ల క్షా 60 వేల క్వింటాళ్ల పంచదార గొడౌన్లలో మూలుగుతోంది. ఈ ఫ్యాక్టరీలో ఉన్న గోడౌన్లు సరిపోక అనకాపల్లిలో మరో గోదామును అద్దెకు తీసుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ నిల్వ చేస్తున్నారు. దీనికి అదనంగా రవాణా, గిడ్డంగి అద్దె, ఎగుమతి, దిగుమతి హమాలీ ఛార్జీలు కలిసి బస్తా దగ్గర మరో రూ.50లు ఫ్యాక్టరీపై భారం పడింది. అసలే ఘోరంగా చక్కెర ధర పడిపోయిందన్న బాధలో ఉన్న తరుణంలో ఈ అదనపు చార్జీలు మూలగే న క్కపై తాడిపండు పడ్డట్టయ్యింది. అయితే దీనికి పూర్తి బాధ్యత ఈ ఫ్యాక్టరీ పాలకవర్గం, యాజమాన్యానిదేనన్న వాదన వ్యక్తమవుతోంది. మూడేళ్లకోసారి చక్కెర మార్కెట్ ఒడిదుడుకులుంటాయని తెలి సినా ఓ మోస్తరు ధర ఉన్నప్పు డు అమ్మకుండా వది లేసి, ఇప్పుడు లక్షల టన్నుల నిల్వను గోడౌన్‌లో ఉంచేయడం ఎంతవరకు సమంజసమని రైతు లు ప్రశ్నిస్తున్నా రు.
పాలకవర్గం అనాలోచిత నిర్ణయాల వల్ల ఫ్యాక్టరీ నష్టాల్లో కూరుకుపో యే పరిస్థితి దాపురించనుందని ఆరోపిస్తున్నారు. తగ్గిన ధర ప్రభావం మిగతా ఫ్యాక్టరీలపై కొంత ఉన్నప్పటికీ గోవాడకు మాత్రం రూ.కోట్లలో నష్ట వచ్చే ప్రమాదం ఉంది. అసలే రికవరీ 8.38 మించి రాకపోవడంతో క్వింటా పంచదార తయారీకి సు మారు రూ.3400 వరకు ఖర్చవుతోంది. అంటే మార్కెట్ ధరకంటే అదనంగా రూ. 800లు ఫ్యాక్టరీపై భారం పడుతుంది. దీని ప్రభావం ఒక్క ఫ్యాక్టరీల పైనే కాదు రైతులకిచ్చే మద్దతు ధరపై కూడా పడనుంది.
ఫ్యాక్టరీల్లో పంచదార నిల్వలు
ఫ్యాక్టరీ నిల్వ(క్వింటాళ్లలో)
గోవాడ 3.58 లక్షలు
ఏటికొప్పాక 1.02 లక్షలు
తాండవ 1.07 లక్షలు
ధర పతనం ఇలా
(క్వింటాకు రూ.లలో)
జూన్ 3150
జులై 3000
ఆగస్టు 2950
అక్టోబరు 2900
నవంబరు 2700
జనవరి 2600