కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: కడప కలెక్టరేట్ గురువారం రణరంగాన్ని తలపించింది. ఇళ్లస్థలాలివ్వండి మహాప్రభో అంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తున్న ప్రజలపై పోలీసులు విరుచుకుపడ్డారు. మహిళలనే కనీస విచక్షణ కూడా లేకుండా వారిని ఈడ్చుకెళ్లారు. కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేశారు. వివరాల్లోకెళితే.. కడప నగరంలోని అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని కోరుతూ గురువా రం కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో పికెటింగ్ నిర్వహించారు. ఉదయం 10గంటలకు వందలాది మంది ప్రజలు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ప్రధా న ద్వారం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అప్పటికే సీఆర్‌పీఎఫ్‌తోపాటు పెద్ద సంఖ్యలో సాయుధ పోలీసులు మో హరించారు. మధ్యాహ్నం 12గంటల ప్రాం తంలో డీఆర్‌ఓ ఈశ్వరయ్య ఆందోళనకారుల వద్దకు వచ్చారు. సీపీఎం నగర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు సావంత్ సుధాకర్‌రావు, బి.మనోహర్, పాపిరెడ్డి, ఓ.శివశంకర్, మగ్బూల్‌బాషాలతో చర్చించి ఆందోళన విరమించాలని కోరారు.
ఈ సందర్భంగా రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలోని అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలంటూ గత నాలుగేళ్లుగా అన్ని రకాల ఆందోళనలు నిర్వహిం చినప్పటికీ రెవెన్యూ యంత్రాంగంలో చల నం లేదన్నారు. కబ్జాదారులకు అండగా నిలుస్తున్న అధికారులకు పేదలకు జానెడు స్థలం ఇచ్చేందుకు మనసు రాకపోవడం విచారకరమన్నారు. ఇందుకు డీఆర్‌ఓ బదులిస్తూ స్థలాల మంజూరు విషయంపై జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడితే ఆ తర్వాత చర్చించవచ్చన్నారు. ఇందుకు సీపీఎం కార్యకర్తలు ససేమీరా అన్నారు. కలెక్టర్ శశిధర్ తక్షణమే వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదంటూ భీష్మించారు.
సీపీఎం నాయకులపై కేసు నమోదు
కడప అర్బన్, న్యూస్‌లైన్: నగరంలోని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద పికెటింగ్ నిర్వహించిన సందర్భంగా జరిగిన తోపులాటకు సంబంధించి సీపీఎం నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రంగనాయకులు తెలిపారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన తోపులాటలో కలెక్టరేట్ ప్రధాన ద్వారానికి అమర్చిన గేటు విరిగిపోయింది. ఈ నేపథ్యంలో వన్‌టౌన్ ఎస్‌ఐ పిజిఎం ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీపీఎం నాయకులు రవిశంకర్‌రెడ్డి సహా పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కలెక్టర్ కార్యాలయ ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నిం చారు. కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీఐలు నాగేశ్వరరెడ్డి, నాయకుల నారాయణ, శివన్న, ఎస్‌ఐ రంగనాయకులు, సీఆర్‌పీఎఫ్‌తోపాటు ఇతర సా యుధ పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తీవ్ర తోపులాటలో కలెక్టరేట్ ప్రధాన గేటు విరిగిపోయింది. దీంతో ఒక్క ఉదుటున ప్రజలు లోనికి చొచ్చుకెళ్లారు. కా ర్యాలయం పైకి వెళ్లనివ్వకుండా పోలీ సులు అడ్డుకున్నారు. తొక్కిసలాటలో పలువురు మహిళలు సొమ్మసిల్లారు. ఆందోళన విరమించకపోవడంతో సీపీఎం నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. మహిళా పోలీసులు రంగప్రవేశం చేసి పేద మహిళలను విచక్షణా రహితంగా ఈడ్చి పడేశారు. ఇలా రెండు దఫాలుగా అరెస్టుల పర్వం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్ ఆవరణంతా తెగిపడిన చెప్పులు, పగిలిన గాజులు, విరిగిన జెండాకట్టెలు, కనిపించాయి.
నేడు నిరసన ప్రదర్శన
శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న తమపై పోలీసులు ప్రదర్శించిన వైఖరిని నిరసిస్తూ శుక్రవారం నగరంలో ప్రదర్శన నిర్వహించాలని సీపీఎం నాయకులు నిర్ణయించారు. ఉద యం 10గంటలకు జియోన్ కళాశాల ఆవరణం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకుడు దస్తగిరిరెడ్డి తెలిపారు.
ఇళ్ల స్థలం అడిగితే.. ఈడ్చుకెళ్లారు..
Published Fri, Jan 10 2014 2:00 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
Advertisement
Advertisement