భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలంలో కామ్రేడ్లు కుమ్ములాడుకున్నారు. రణరంగం సృష్టించారు. పరస్పర దూషణలతో రెచ్చిపోయారు. ప్రజల సమస్యలపై నిబద్ధతతో పోరాడతారనే పేరున్న (సీపీఎం, సీపీఐ) కామ్రేడ్లు.. ఇలా తమ లో తాము కీచులాడుకుని, నడి రోడ్డుపై ముష్టి యుద్ధానికి దిగడాన్ని చూసిన భద్రాద్రి వాసులు ముక్కున వేలేసుకున్నారు. ఇరు పార్టీల కార్యక్రమాలకు సంఘీభావం తెలిపేందుకు వేర్వేరుగా వచ్చిన విద్యార్థులు.. ఇక్కడి రణరంగాన్ని చూసి భయంతో పరుగు తీశారు. భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలో ఉంచాలన్న డిమాండుతో ఇక్కడ సీపీఎం ఆధ్వర్యంలో మూడురోజులుగా నిరవధిక నిరాహారదీక్ష సాగుతోంది. దీనికి మద్దతుగా పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్ధులతో మహా మానవహారం ఏర్పాటుకు ఎస్‌ఎఫ్‌ఐ (సీపీఎం అనుబంధ సంఘం) ఏర్పాట్లు చేస్తోంది. అంబేద్కర్ సెంటర్‌లో టీజేఏసీ చేపట్టిన రిలే దీక్షలకు సంఘీభావంగా సీపీఐ నాయకులు కూడా మంగళవారం (దీక్షలలో) కూర్చున్నారు. వీరికి మద్దతుగా డిగ్రీ కళాశాల విద్యార్థులు కొందరు ఏఐఎస్‌ఎఫ్ (సీపీఐ అనుబంధ సంఘం) ఆధ్వర్యంలో వెళుతున్నారు.
కూనవరం రోడ్డులోని పెట్రోల్‌బంక్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, తమ్మళ్ల వెంకటేశ్వర్లు, కల్లూరి వెంకటేశ్వరావు కలిసి అంబేద్కర్ సెంటర్‌లో మానవహారం కార్యక్రమంలో ఉన్న సీపీఎం నాయకులు ఎంబి.నర్సారెడ్డి, బండారు శరత్ వద్దకు వెళ్లి నిలదీశారు. దీంతో వారిమధ్య మొ దలైన వాగ్వాదం.. తోపులాటకు దారి తీసింది. ఒకవైపు దీక్షా శిబిరంలోని సీపీఐ నాయకులు, మరోవైపు మానవహారం కార్యక్రమంలో ఉన్న సీపీఎం నాయకులు కోపోద్రేకంతో ముష్టి యుద్ధానికి దిగారు. ఆ తరువాత, జెండా కర్రలతో కొట్టుకుంటూ.. నడి రోడ్డుపై రణరంగం సృష్టించారు.
అక్కడున్న ఒకరిద్దరు పోలీసులు ఆ ‘యుద్ధాన్ని’ ఆపలేకపోయారు. కామ్రేడ్లు సృష్టించిన రణరంగంతో విద్యార్థులు భయం తో పరుగు తీశారు. పరిస్థితి సద్దుమణిగిని తరువాత పోలీసులు తీరిగ్గా వచ్చారు. ఇరు పార్టీల నాయకులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తమ కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారంటూ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.భద్రాచలాన్ని తెలంగాణలోనే కొనసాగించాలని నెల రోజులుగా భద్రాచలంలో సాగుతున్న పోటాపోటీ దీక్షలు, నిరసన కార్యక్రమాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిని ముందుగానే పసిగట్టి, తగిన బందోబస్తు ఏర్పాటు చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భద్రాద్రిలో కామ్రేడ్స్ డిష్యుం... డిష్యుం..
Published Wed, Dec 4 2013 6:35 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement
Advertisement