మాతృసంస్థకు సరెండర్ చేసిన గంటా
సీఈఓగా అందలమెక్కించిన అయ్యన్న
ఎస్‌ఎస్‌ఏ పీవో వ్యవహారం
మంత్రుల మధ్య ఆగని ఆధిపత్య పోరు
విశాఖపట్నం: ఏ అధికారిపైనైనా ఆరోపణలొస్తే ఏం చేస్తారు? అంతగా ప్రాధాన్యత లేని పోస్టులో వేస్తారు! లేదా బదిలీ చేస్తారు. మన విశాఖ జిల్లాలో అయితే అలా చేయరు. ఒక మంత్రి అతనిపై చర్య తీసుకుంటే మరో మంత్రి ఆ అధికారికి అడ్డగోలుగా కొమ్ముకాస్తారు. అందలమెక్కిస్తారు. ఒకే ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరుకు అద్దం పడుతున్న తాజా వ్యవహారం ఇదీ!
సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి నగేష్ విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుకు ఓఎస్‌డీ కూడా. నగేష్ చాన్నాళ్లుగా జోడు పదవుల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. స్వచ్ఛ విద్యాలయ పథకం కింద సర్వశిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ)లో పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో చాలా వరకు నిర్మాణం పూర్తయినట్టు ఎస్‌ఎస్‌ఏ అధికారులు మంత్రి గంటాకిచ్చిన నివేదికలిచ్చారు. వారం రోజుల క్రితం గంటా ఆనందపురం మండలంలో ఓ స్కూలుకు ఆకస్మిక తనిఖీకెళ్లినప్పుడు అక్కడ మరుగుదొడ్డి నిర్మాణం జరగకపోవడంతో పీవో నగేష్, ఈఈ భానుప్రసాద్‌లను వారి మాతృసంస్థలకు సరెండర్ చేశారు. దీంతో నగేష్ తన మాతృసంస్థ సహకారశాఖకు వెళ్లిపోతారని అంతా అనుకున్నారు. కానీ మూడ్రోజులు తిరక్కుండానే శ్రీకాకుళం జిల్లా సీఈవోగా నియమితులయ్యారు. దీంతో అంతా ముక్కున వేలేసుకున్నారు.
అయ్యన్నకు సన్నిహితంగా..
ఎప్పట్నుంచో మంత్రులు అయ్యన్న, గంటా వీలు చిక్కినప్పుడల్లా ఎవరు సత్తా వారు చాటుకుంటున్నారు. సాక్షాత్తూ మంత్రి గంటా తన ఓఎస్‌డీని సరెండర్ చేస్తే ఆయనకు అయ్యన్నపాత్రుడు శ్రీకాకుళం సీఈవో పోస్టు ఇప్పించినట్టు తెలుస్తోంది. గంటా తొలుత ఏరికోరి తెచ్చుకున్న నగేష్ కొన్నాళ్లుగా అయ్యన్నతో సన్నిహితంగా మెలుగుతుండడం కూడా ఈ పరిస్థితికి కారణమంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరుగుదొడ్ల అవకతవకలపై గంటా స్పందించి సరెండర్ చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో నగేష్ వెనువెంటనే మంత్రి అయ్యన్నను ఆశ్రయించడం, ఆయన ఎస్‌ఎస్‌ఏ పీవోకంటే కీలకమైన శ్రీకాకుళం జెడ్పీ సీఈవోగా ఉత్తర్వులు వచ్చేలా కృషి చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారంలో తనకు సన్నిహితుడు ఆ జిల్లా మంత్రి కె.అచ్చెన్నాయుడు కూడా సహకరించడంతో అయ్యన్న పంతం నెగ్గించుకోవడానికి వీలు చిక్కిందంటున్నారు. మరోవైపు ఎస్‌ఎస్‌ఏ పీవోతో పాటు సరెండర్ చేసిన ఈఈ ఇప్పటికీ అదే విధుల్లో కొనసాగుతుండడం విశేషం. ఈయన కొనసాగడానికి గుంటూరు జిల్లా మంత్రి సహకరించినట్టు తెలుస్తోంది.
గంటాకు వద్దు.. అయ్యన్నకు ముద్దు
Published Sat, Aug 22 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM
Advertisement
Advertisement