
‘థర్మల్’పై పోరాటం ఆగదు
సోంపేట :సోంపేట మండల బీల ప్రాంతంలో నిర్మించదలచిన థర్మల్ విద్యుత్ కేంద్రం అనుమతులు రద్దు చేసే వరకు పోరాటం ఆగదని, దీనికోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిరియా సాయిరాజ్ అన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యమ నేపథ్యంలో పిరియా సాయిరాజ్ పై సోంపేట కోర్టులో ఉన్న కేసు శనివారం న్యాయమూర్తి కొట్టి వేసిన నేపథ్యంలో పట్టణంలోని బస్టాండు వద్ద గల దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులతో కలసి పత్రికా సమావేశం నిర్వహించారు. తొలుత వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 సంవత్సరం నుంచి సుమారు ఆరేళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వాల తీరు మారకపోవడం బాధాకరమన్నారు.
అమాయక ప్రజలపై అప్పటి ప్రభుత్వం పోలీసులతో కేసులు పెట్టించి నేటివరకు కోర్టులు చుట్టూ తిప్పుతోందన్నారు. ఏప్రిల్ 30, 2012న ఎన్‌సీసీ యాజమాన్యం, స్థానిక ప్రజలకు జరిగిన సంఘటన నేపథ్యంలో బారువ పోలీసులు తనతో పాటుగా మొత్తం 114 మందిపై కేసులు పెట్టారన్నారు. ఈ కేసు నేపథ్యంలో 15 రోజుల జీవితాన్ని కూడా అనుభవించాన్నారు. సుమారు 30 సార్లు సోంపేట కోర్టుకు వాయిదాల నిమిత్తం హాజరైనట్టు చెప్పారు. ఈ రోజు ఆ కేసును సోంపేట కోర్టు న్యాయమూర్తి కొట్టి వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయమే నెగ్గిందన్నారు. అప్పటి ప్రభుత్వం థర్మల్ అనుమతులు రద్దు విషయంలో స్పందించలేద న్నారు.
థర్మల్ విద్యుత్ కేంద్రం కాల్పులు జరిగిన మరుసటి రోజు సోంపేట మండలానికి చేరుకున్న టీడీపీ అధినేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే థర్మల్ అనుమతులు రద్దు చేస్తామని హమీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా హామీ నిలబెట్టుకోలేదన్నారు. 1107 జీవో రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి థర్మల్ విద్యుత్ కేంద్రం అనుమతులు రద్దు జీవో విడుదల చేయాలని కోరారు. పీఏసీఎస్ అధ్యక్షుడు ఆర్.విశ్వనాథం, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పాతిన శేషగిరి, సర్పంచ్ యర్ర తారకేశ్వరరావు, గౌరీ కామేశ్వరరావు, చామంతి బుద్దేశ్వరరావు, పద్మావతి తారకేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు తడక జోగారావు, పాతిన రామమూర్తి, సకాల బత్తుల హరీష్‌కుమార్, పార్టీ నాయకులు పొడుగు కామేశ్వరరావు, మడ్డు రాజారావు, బి.శ్రీకృష్ణ, ఆర్.సురేష్, బెందాళం రామారావు, పి.అప్పలస్వామి, దున్న మాధవరావు, ఎస్.పాపారావు, జి.దండాసి, కె.రాజారావు తదితరులు పాల్గొన్నారు.