రూ 8 కోట్లతో ఆసుపత్రి నిర్మాణంపనులు ప్రారంభం | Finally Hospital Started | Sakshi
Sakshi News home page

రూ 8 కోట్లతో ఆసుపత్రి నిర్మాణంపనులు ప్రారంభం

Published Mon, Dec 10 2018 11:00 AM | Last Updated on Mon, Dec 10 2018 11:00 AM

Finally Hospital Started - Sakshi

కేంద్ర ప్రభుత్వం దాదాపు మూడేళ్ల క్రితం  కడపలోని ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలకు, శాశ్వత భవన నిర్మాణాల కోసం నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ కింద రూ. 8 కోట్లు కేటాయించింది. అధికారుల సమన్వయ లోపం, స్థలం కేటాయింపులు తదితర సమస్యలు శాపంగా మారాయి, దీనిపై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఎట్టకేలకు హోమియోపతికి పట్టిన గ్రహణం వీడింది. కడప పాత రిమ్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం పక్కన గల స్థలంలో అధునాతన ఆసుపత్రి నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో గుడివాడ, రాజమండ్రి తరువాత కడపలో మాత్రమే ఈ వైద్యశాల ఉండడం గమనార్హం. 

కడప రూరల్‌: కడప నగరంలో 1984లో 45 పడకల ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల ఏర్పాటైంది. మొదట్లో ఈ ఆసుపత్రి రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉండేది. కొన్నేళ్లుగా  పాత రిమ్స్‌లో అసౌకర్యాల మధ్య నడుస్తోంది. ప్రస్తుతం కడప పాత రిమ్స్‌లో కొనసాగుతున్న ఆసుపత్రిలో నాటి నుంచి నేటి వరకు పట్టిన సమస్యల జబ్బు వీడలేదనే చెప్పవచ్చు. ఇక్కడకు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 250 మందికి పైగా వైద్య చికిత్సల కోసం వస్తుంటారు. అయితే ఇన్‌ పేషెంట్లకు అవకాశం ఉన్నా ఎవరూ అడ్మిట్‌ కాకపోవడం గమనార్హం. ఆసుపత్రిలో  45 పడకలను కింద, పై భాగాల్లో ఏర్పాటు చేశారు.ఇక్కడ నెలకొన్న సమస్యల కారణంగా పై భాగంలో ఏర్పాటు చేసిన గది పనికి రాకుండాపోయింది. దీంతో 45 పడకల వైద్యశాల కాస్తా 19 పడకల ఆసుపత్రిగా మారింది. ఇందులో పక్షవాతం, ఆస్తమా, థైరాయిడ్, మధుమేహం, చర్మ సంబంధిత తదితర వ్యాధులకు వైద్యం లభిస్తుంది. ఈ మందుల వాడకం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేనందున చాలా మంది ఈ వైద్యం పట్ల మక్కువ చూపుతున్నారు.

నిధులు కేటాయించినా..
ఈ ఆసుపత్రికి శాశ్వత భవన నిర్మాణం కోసం కడప నగరం జయనగర్‌ కాలనీలోని సర్వే నెంబరు 752–291–01లో 34 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఆ మేరకు మూడేళ్ల  క్రితం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌’ కింద రూ. 8 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ‘ఆరోగ్య మౌలిక వసతుల సంస్థ ఆసుపత్రి     భవన సముదాయాలను నిర్మించాలి. అయితే కేటాయించిన స్థలం చాలా వరకు ఆక్రమణకు గురైంది. ఈ నేపథ్యంలో కడప పాత రిమ్స్‌లోనే వైద్య ఆరోగ్యశాఖ రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయం పక్కన ఉన్న దాదాపు 42 సెంట్ల స్థలంలలో ఆసుపత్రిని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అందుకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ఈ భవన నిర్మాణాల కోసం  ఆరోగ్య మౌలిక వసతుల సంస్థ వారు టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లలో ప్రొద్దుటూరుకు చెందిన ఒక కాంట్రాక్టర్‌ పనులను దక్కించుకున్నారు. ఇప్పుడు ఈ స్థలంలో ఇటీవల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement