బ‘కాసు’రులు.. | Financial Scams And frauds In West Godavari | Sakshi
Sakshi News home page

బ‘కాసు’రులు..

Published Wed, Aug 7 2019 8:59 AM | Last Updated on Wed, Aug 7 2019 9:00 AM

Financial Scams And frauds In West Godavari - Sakshi

ఎవరైనా.. ఆపదలో ఉన్నామని గొంతు చించుకుని గోలపెట్టినా చిల్లిగవ్వ బయటకు తీయని నైజం.. ఎక్కడ మోసపోతామోనని అనుక్షణం అప్రమత్తంగా ఉండే తత్వం.. రూపాయి ఇస్తున్నామంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే గుణం.. ఇదీ ప్రస్తుతం లోకం పోకడ. ఇలాంటి సమాజంలో పిల్లల పెళ్లనో.. పిల్లాడి చదువనో.. ఇంకేదో భవిష్యత్తు అవసరాలనో పొదుపు చేసే బడుగు జీవులు ‘పైకం’ పోకడ తెలీక ఆర్థిక మాయగాళ్ల ఉచ్చులోపడి మోసపోతున్నారు. అక్రమార్కుల హంగూ ఆర్భాటం, అధిక వడ్డీల ఎరకు చిక్కుతున్నారు. నమ్మించి జనాల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించి బోర్డులు తిప్పేసే మోసగాళ్ల ఉదంతాలు జిల్లాలో తరచూ వెలుగు చూస్తున్నాయి. అయినా ప్రజల్లో మార్పు రానంతకాలం కుచ్చుటోపీ పెట్టే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటాయి.  

సాక్షి, ఏలూరు(తూర్పుగోదావరి):  బ్యాంకుల్లో పొదుపు చేస్తే తక్కువ వడ్డీ వస్తుందని, బయటైతే వందకు రూ.2  వడ్డీ వస్తుంది కదా అని పేదలు, బడుగు జీవులు బడాబాబుల హంగూఆర్భాటం చూసి ప్రైవేటు కంపెనీల్లో  కోట్లాది రూపాయలు డిపాజిట్లు చేసేస్తున్నారు. ఆ తర్వాత ఆ సంస్థలు చేతులెత్తేస్తే లబోదిబోమంటూ గగ్గోలు పెడుతున్నారు. చిన్న మొత్తాల్లో డిపాజిట్‌లు చేసే అనేకమంది బడుగుజీవులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అగ్రిగోల్డ్‌ ఉదంతం కళ్ల ముందే ఉన్నా ఇంకా ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలు, అనధికార చిట్స్‌ వైపు ప్రజలు మొగ్గు చూపుతూనే ఉన్నారు. జిల్లాలో గతంలో ఇటువంటి ఘటనలు ఎన్ని జరిగినా జనంలో అధిక వడ్డీ ఆశలు పోవడంలేదు. ఘటన జరిగినప్పుడు జరిగింది మన ఊరిలో కాదుగా.. మనం డిపాజిట్‌ చేసిన వ్యక్తి చాలా మంచివాడు అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే చిట్‌ఫండ్, ఫైనాన్స్, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులకు ఒక వరంలా మారుతోంది. 

రెండేళ్లలోనే రూ.2కోట్ల 28లక్షలు స్వాహా!
జిల్లాలో ఇటువంటి ఫైనాన్స్‌ కంపెనీలు అనేకం బోర్డు తిప్పేస్తున్నాయి. 2017–18లో 11 సంస్థలు బోర్డు తిప్పేస్తే, 2018–19లో ఇప్పటి వరకూ ఐదు సంస్థలు బోర్డు తిప్పేశాయి. అధికారికంగా రెండు కోట్ల 38 లక్షల రూపాయలు నష్టపోయినట్లు ఫిర్యాదులు అందాయి.  ఇటీవలే నరసాపురంలో  చిట్స్‌ పేరుతో ఒక కుటుంబం రూ.ఐదు కోట్లకు టోపీ పెట్టింది. ఏప్రిల్‌లో తణుకులో ఒక ఫర్నిచర్‌ షోరూమ్‌ స్కీమ్‌ల పేరుతో ప్రజలను మోసగించి బోర్డు తిప్పేసింది. 

పాల‘ఘెల్లు’!
తాజాగా పాలకొల్లు ప్రాంతానికి చెందిన  ఓ ఫైనాన్స్‌ అండ్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ రూ.108 కోట్లకు బోర్డు తిప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పైనాన్సర్‌ వద్ద ఉన్న ఆస్తుల విలువలు లెక్కిస్తే సుమారు రూ.40 కోట్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. చిన్నచిన్న డిపాజిటర్లు మాత్రం ఎవరిని కలుసుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పెద్ద మొత్తంలో డిపాజిట్‌ చేసిన కొందరు బడాబాబులు మాత్రం అతని ఇంటి చుట్టూ తిరిగేస్తున్నారు. తమ సొమ్ములు మాత్రం పూర్తిగా ఇచ్చేయాలంటూ ఒత్తిళ్లు చేస్తున్నట్లు తెలిసింది. ఆ పట్టణంలో ఓ సెటిల్‌మెంట్‌ బ్యాచ్‌ నిర్వాహకునితో కలిసి మరో వ్యాపారి తాము సెటిల్‌ చేస్తామని, అయితే తమ వారికి మాత్రం పూర్తిగా బాకీ చెల్లించేయాలంటూ ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది.

గతంలో డిపాజిట్లు చేసిన చిన్న డిపాజిట్‌దారులు, బడా బాబులు ఇప్పటి వరకూ వడ్డీల రూపంలో ఎంతోకొంత తీసుకున్నారని, తాము మాత్రం ఇటీవలే ఇచ్చామని తమ సొమ్ములు పూర్తిగా వెనక్కి ఇవ్వాలని వారు సదరు నిర్వాహకునిపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రతి నెలా టంఛన్‌గా వడ్డీలు చెల్లించే సదరు సంస్థ నిర్వాహకుడు గత మూడు నెలల నుంచి వడ్డీలు చెల్లించడం లేదని సమాచారం. కానీ ఫైనాన్స్‌ వ్యాపారి మాత్రం అందరికీ సొమ్ములు ఇచ్చేస్తానంటూ చెబుతున్నా డిపాజిట్‌దారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులను ఆశ్రయించేందుకు మరికొందరు సన్నద్ధం అవుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement