సాక్షి, నె ల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి చేపట్టిన గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర శనివారం నాటికి వారంరోజులు పూర్తి చేసుకుంది. ఈ వారంలో ఆయన 110 కిలోమీటర్లు నడిచారు. శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సూచన మేరకు ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు. పాదయాత్రకు సంకల్పించిన గౌతమ్‌రెడ్డి ఈ నెల 22న ఏఎస్‌పేట మండలం హసనాపురం నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు.
తొలిరోజు నుంచి ఈ పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. గ్రామగ్రామాన పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజలు గౌతమ్‌రెడ్డికి ఘనస్వాగతం పలుకుతున్నారు. తొలుత ఏఎస్ పేట మండలంలో 7 గ్రామ పంచాయతీల్లో 18 గ్రామాల పరిధిలో ఈ పాదయాత్ర జరిగింది. అనంతరం ఆత్మకూరు మండలంలో రెండు పంచాయతీల్లో, మర్రిపాడు మండలంలో 6 గ్రామ పంచాయతీల్లో యాత్ర కొనసాగింది. శనివారం నాటికి యాత్ర చిన్నమాచనూరుకు చేరుకుంది. మొత్తం మీద శనివారం నాటికి 30 గ్రామాల పరిధిలో 110 కిలోమీటర్ల యాత్రను గౌతమ్‌రెడ్డి పూర్తిచేశారు. యాత్ర సందర్భంగా ప్రజలు ఆయా గ్రామాల్లో రోడ్లు, తాగునీటి సమస్య, విద్యాలయాల్లో గదుల కొరత తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకొస్తున్నారు.
ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గౌతమ్‌రెడ్డి దృష్టి సారించారు. నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. చాలాచోట్ల పంటలకు నీరు అందని విషయాన్ని రైతులు ఆయనకు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పొగాకు రైతుల అవసరాలను తెలుసుకుంటున్నారు. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో రైతాంగంతో పాటు అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వపరంగా అందిన సహాయాన్ని,సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి వివరిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని, పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గౌతమ్‌రెడ్డి యాత్రలో ప్రజలకు వివరిస్తున్నారు. జనంతో మమేకమవుతూ సాగుతున్న గౌతమ్ యాత్రకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మంత్రి ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన గౌతమ్‌రెడ్డిపై వెల్లువెత్తిన ప్రజాదరణ చూసి నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రజాదరణ మరువలేనిది:
మేకపాటి గౌతమ్‌రెడ్డి
ఆత్మకూరు నియోజకవర్గంలో తాను చేపట్టిన పాదయాత్రకు ప్రజాభిమానం వెల్లువెత్తుతోందని, వారి ఆదరణ మరువలేనిదని మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. వారంలో వందరోజుల పాదయాత్రను పూర్తిచేసిన గౌతమ్ శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. వైఎస్ కుటుంబంపై ప్రజాభిమానం చెక్కుచెదరనిదన్నారు.
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తనను నియోజకవర్గ ప్రజలు ప్రేమతో ఆశీర్వదిస్తున్నారన్నారు. సోమశిల నీరు సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు ఇక్కడ కోట్ల నిధులు కుమ్మరిస్తున్నా.. అవి నేతల జేబుల్లోకి వెళ్తున్నాయే తప్పా ప్రజాసమస్యల పరిష్కారానికి వినియోగించిన దాఖలాలు లేవన్నారు. అందుకే ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మూడునెలల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని గౌతమ్‌రెడ్డి చెప్పారు.
జనంతో మమేకం
Published Sun, Dec 29 2013 4:42 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement