అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
నిరాశ్రయమైన 13 కుటుంబాలు
రూ.6 లక్షల ఆస్తినష్టంచోడవరంలో సంఘటన
ద్రాక్షారామ, న్యూస్‌లైన్ :
షార్ట్‌సర్క్యూట్ కారణంగా రామచంద్రపురం మండలం చోడవరంలో ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం కారణంగా 13 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. చోడవరం నుంచి అరికరేవులుకు వెళ్లే రహదారిలో.. రోడ్డు పక్కనున్న 5 తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. రామచంద్రపురం అగ్నిమాపకాధికారి ఎస్.బాబూరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామ శివారున ఉన్న దళితపేటలోని 5 తాటాకిళ్లలో మంజేటి అర్జునుడు, మంజేటి శ్రీను, కట్టంగ రమణ, మంజేటి సూరిబాబు, మంజేటి చిన్న, మంజేటి ఏసు, మంజేటి భీముడు, మంజేటి రమణ, దొండపాటి రాఘవ, దొండపాటి సత్తిబాబు, దొండపాటి అప్పన్న, దొండపాటి సత్యనారాయణ, దొండపాటి సతీష్ కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటారు. కొందరు కొద్దిపాటి భూమిని కౌలుకు తీసుకుని వరిని పండించారు. ఆ ధాన్యం కూడా ఒకొక్కరు పది బస్తాలు తీసుకుని ఇళ్లల్లో నిల్వ చేసుకున్నారు.
ఇలాఉండగా ఆదివారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఓ తాటాకింట్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఐదు తాటాకిళ్లకు మంటలు వ్యాపించాయి. ప్రాణాపాయాన్ని గమనించిన ఆయా కుటుంబాల వారు వృద్ధులు, మహిళలు, పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. కొందరు యువకులు మంటలను ఆర్పేందుకు విఫలయత్నం చేశారు. సమాచారం అందుకున్న రామచంద్రపురం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేశారు. బంగారం, రేషన్ కార్డులు, బ్యాంకు అకౌంట్లు, పిల్లల స్కూలు పుస్తకాలు, నగదు, టీవీలు, వంట సామగ్రి తదితర వస్తువులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
సర్వస్వం కోల్పోయాం
అందరం నిద్రలో ఉన్న సమయంలోని ప్రమాదం సంభవించడంతో, ఇంట్లో వస్తువులను తెచ్చుకోలేకపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రెప్పపాటులో మంటలు వ్యాపించడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశామన్నారు. తొలకరిలో పండించిన పంటను అందరూ పంచుకుని, ఇంట్లో పెట్టుకున్నామని, అవి కూడా బూడిదయ్యాయని విలపించారు.