వృద్ధుడు సజీవ దహనమవుతున్నా నిస్సహాయ స్థితిలో కుటుంబ సభ్యులు
అగ్ని ప్రమాదంలో మూడు పూరిళ్లు దగ్ధం
ప్రాణాలు కాపాడిన కోడి
బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరిన ఎమ్మెల్యే రాజన్నదొర
సాలూరు,న్యూస్‌లైన్: అందరూ చూస్తుండగానే ఆ వృద్ధుడు కాలి బూడిదయ్యాడు. రక్షించమని దీనంగా వేడుకుంటున్నా అతని కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటూ నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. వెలుగు ఇవ్వవలసిన దీపం ఆ ఇళ్లలో చీకట్లు నింపింది. నిలువనీడ లేకుండా చేసింది. ఉన్నదంతా బూడిదైంది. కట్టుకున్న బట్టలతో వీధిన పడిన వారు తమకు దారేదని గుండెలవిసేలా రోదిస్తున్నారు. పట్టణంలోని రెల్లివీధిలో శుక్రవారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు పూరిళ్లు దగ్ధం కాగా, సొండి తౌడు (70) అనే వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. మృతుని అక్క ఆకుల సన్నమ్మ, బాధితులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రెల్లి వీధి చివరన ఆకుల రాజారావు, ఆకుల సన్నమ్మ, కోట కుమార్‌లకు చెందిన మూడు కుటుంబా ల వారు మూడు పూరిళ్లలో నివాసముం టున్నారు. శుక్రవారం తెల్లవారు జాము న ఉదయం నాలుగు గంటల సమయంలో ఓ పూరింట్లో ఉన్న దీపం బుడ్డీ కారణంగా మంటలు ఎగసిపడి మూడు పూరిళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఒక ఇంటిలో నిద్రిస్తున్న కోట కుమార్, అతని భార్య లక్ష్మి, వారి ఇద్దరి పిల్లలు, మరో ఇంట్లో ఉంటున్న ఆకుల సన్నమ్మ, నిమ్మకాయల పారమ్మ, మూడో గుడిసెలో ఉంటున్న ఆకుల పొట్టమ్మ, ఆమె మనవలు వికాస్, తనుస్, సంతోష్, రాఖేష్ ప్రాణాలతో బయటపడగా సొండి తౌడు (70)అనే వృద్ధుడు బయటకు రాలేక దహనమయ్యాడు.
ప్రాణాలు కాపాడిన కోడి పెట్ట
ఇంట్లో ఓ మూల ఉన్న కోడిపెట్ట మంటలను చూసి బయటకు వచ్చేందుకు బిగ్గరగా అరవడం, నిద్రిస్తున్న వారిపై పడి రాద్ధాంతం చేయడంతో వెంటనే మెలకువలోనికి వచ్చిన వారంతా పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. భార్యను, పిల్లాడిని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి న కోట కుమార్ తన మరో కుమారుడిని ఇంటిలో మరిచిపోయాడు. వెంటనే మళ్లీ ఇంటిలోనికి వెళ్లి ఆ బాబును బయటకు తెచ్చే ప్రయత్నంలో కుమార్ వీపునకు మంట తగిలి కాలిపోయింది.
ఏమయ్యేవారమో...
తన భర్త ఆకుల రాజారావు, అల్లుడు, కుతూరు పని కోసం పక్క ఊరు వెళ్లారని, నలుగురు మనవళ్లతో నిద్రిస్తున్న తనకు మెలకువ రాకపోతే ఏమయ్యేవారమోనని పొట్టమ్మ రోదిస్తూ చెప్పింది.
పెద్ద దిక్కెవరు..?
సజీవ దహనమైన సొండి తౌడు ఇంటి పెరటిలోకి కాకుండా వాకిట్లోకి వస్తే బతికుండేవాడని అక్కలు సన్నమ్మ, పారమ్మలు రోదిస్తూ చెప్పారు. తమ్ముడికి వచ్చే వృద్ధాప్య పింఛన్‌రూ.500, తమకు వస్తున్న పింఛన్‌తో బతుకులు వెళ్లదీస్తున్నామని, ఈ ప్రమాదంలో త మ్ముడు, నివాసముంటున్న ఇల్లు కాలి బూడిదవడంతో తమకు దిక్కెవరని వా రు విలపిస్తున్నారు. వారి రోదనలు స్థాని కులను కంటతడి పెట్టించాయి. నిరు పే దలమైన తాము ఇప్పుడు ఎక్కడ తల దాచుకోవాలనిబాధితులు రోదిస్తున్నారు.
విద్యుత్ దీపాలు లేకే
ఈ వీధి చివరి వరకు విద్యుత్ దీపాలు బిగించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. అందుకే తాము దీపపు బుడ్డీతో సర్దుకుపోతున్నామని, ఇప్పుడదే బుడ్డీ తమ బతుకులను కాల్చేసిందని వారు వాపోయారు.
బాధితులను ఆదుకోవాలి
సొండి తౌడు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే పి.రాజన్నదొర డిమాండ్ చేశారు. ప్రమాదవార్త తెలుసుకున్న ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్లో స్థానిక విలేకరులతో మాట్లాడారు. మృతుని కుటుంబానికి మూడు లక్షలకు పైగా ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, తక్షణం సహాయం కింద రూ.15 వేలు అందజేయాలని, పది రోజలకు సరిపడే విధంగా వెచ్చాలు ఇవ్వాలని కోరారు. వైఎస్సార్ పార్టీ నాయకులు జర్జాపు ఈశ్వర్రావు, జర్జాపు సూరిబాబు, గొర్లె మధు, గరుడపల్లి ప్రశాంత్ కుమార్ ,పిరిడి రామకృష్ణ,వంగపండు అప్పలనాయుడు తో పాటు పలువురు వైఎస్సార్ పార్టీ నాయకులు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను ఓదార్చారు. వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కళ్లెదుటే కాలిపోతున్నా...
Published Sat, Feb 8 2014 2:23 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement