నిరుపేద బతుకుల్లో నిప్పులు
పి.గన్నవరం :రెక్కాడితే కానీ డొక్కాడని శ్రమజీవులు వారు. కూలీనాలీ చేసుకుని కట్టుకున్న ఇళ్లు, చెమటోడ్చి సమకూర్చుకున్న సామాన్లు కళ్లెదుటే కాలిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత వారిది. ప్రాణాలు దక్కితే చాలనుకుని కట్టుబట్టలతో పరుగులు తీశారు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. పి.గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామంలో ఉన్న పప్పులవారి పాలెం కాలనీలో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం నాలుగు డాబాలు సహా 14 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఒక తాటాకిల్లు పాక్షికంగా దగ్ధం కాగా, సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. 26 కుటుంబాల వారు నిరాశ్రయులు కాగా, ఓ యువకుడు గాయపడ్డాడు. ఓ పాడి గేదె కూడా తీవ్రంగా గాయపడింది. వివరాలిలా ఉన్నాయి.
పప్పులవారి కాలనీలో సుమారు 100 ఇళ్లు ఉన్నాయి. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో పప్పుల శ్రీనివాసరావుకు చెందిన తాటాకింట్లో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి మంటలు వ్యాపించాయి. సమీపంలో ఉన్న గడ్డిమేట అంటుకోవడం, అదే సమయంలో బలంగా గాలులు వీయడంతో నిప్పురవ్వలు సమీపంలోని తాటాకిళ్లపై ఎగిరిపడడంతో క్షణాల్లో మంటలు చుట్టుముట్టాయి. ఒకవైపు విపరీతమైన మంటలు, మరోవైపు దట్టమైన పొగలు వ్యాపించడంతో బాధితులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రాణాలరచేత పట్టుకుని పిల్లాపాపలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.
ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఉధృతమయ్యాయి. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ సామగ్రి, బంగారు, వెండి వస్తువులు, నగదు, బైక్, సైకిళ్లు బూడిదయ్యాయి. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు కూడా దగ్ధమయ్యాయి. పప్పుల రామారావుకు చెందిన 8 వేల కొబ్బరికాయల రాశి కాలిపోయింది. కొబ్బరికాయలు పేలుతూ ఎగిరిపడ్డాయి. ప్రమాదంలో చిక్కుకున్న పాడిగేదెను రక్షించబోయిన పప్పుల ధర్మారావు అనే యువకుడు గాయపడగా, అతడిని చికిత్స కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పప్పుల శ్రీని వాస్‌కు చెందిన పాడిగేదె తీవ్రంగా కాలిపోయింది.
బాధితుల ఆక్రందన
కష్టార్జితం కళ్లెదుటే కాలి బూడిద కావడంతో బాధితుల ఆక్రందనలకు అంతులేకుండా పోయింది. సర్వం తుడిచిపెట్టుకుపోయిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు. కొత్తపేట, అమలాపురం అగ్నిమాపకాధికారులు ఎన్.వెంకట్రావు, ఎండీ ఇబ్రహీం ఆధ్వర్యంలో సిబ్బంది స్థానికుల సహకారంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో అగ్నిమాపక శకటాలు రావడంతో నష్టం తగ్గిందని గ్రామస్తులు పేర్కొన్నారు. బాధితులకు గ్రామస్తులకు భోజన ఏర్పాట్లు చేశారు. తహశీల్దార్ ఎల్.జోసెఫ్, ఆర్‌ఐ బొరుసు లక్ష్మణరావు, ఎస్సై జి.హరీష్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా 10 కిలోల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ వంతున అందిస్తామన్నారు. పూర్తిగా కాలిన ఇంటికి రూ.5 వేలు, పాక్షికంగా కాలిన ఇంటికి రూ.4 వేల వంతున పరిహారం అందిస్తామన్నారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, నాయకులు దాసరి కాశి, కొక్కిరి రవికుమార్, తోలేటి బంగారునాయుడు, మర్రి శ్రీను, నేతల నాగరాజు, టీడీపీ నాయకులు సంసాని పెద్దిరాజు తదితరులు పరామర్శించారు.