వర్మపై గరంగరం | fire on varma | Sakshi
Sakshi News home page

వర్మపై గరంగరం

Published Wed, Mar 5 2014 1:07 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

fire on varma

 సాక్షి ప్రతినిధి, కాకినాడ :
 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పిఠాపురం ‘దేశం’లో నాయకత్వంపై కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. అక్కడి పార్టీ నాయకత్వంపై కేడర్‌లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో అనుచరగణంతో తిరుగుతున్న నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వర్మకు అడుగడుగునా చుక్కెదురవుతోంది. ఆయన వ్యవహారశైలే ఇందుకు కారణమవుతోందని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. గత ఆరేడు నెలలుగా వర్మ, అతనితో విభేదిస్తోన్న నేతల మధ్య కొనసాగుతోన్న వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది.
 
  పిఠాపురం రూరల్ మండలంలోని భోగాపురంలో సోమవారం రాత్రి జరిగిన ఇంటింటా టీడీపీ ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వర్మ స్థానిక మర్రిచెట్టు సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో పార్టీకి మొదటి నుంచి కష్టపడి పని చేస్తున్న  అల్లుమల్లు విజయకుమార్‌పై విమర్శలు చేశారు. విసుగెత్తిపోయిన నాయకులు, కేడర్ చివరకు ఆయనపై కుర్చీలు విసిరేసే పరిస్థితి వచ్చింది. పార్టీ కోసం మాట్లాడకుండా కేవలం విజయకుమార్ లక్ష్యంగా విమర్శలు చేయడం కేడర్ ఆగ్రహానికి కారణమైంది. ‘వర్మ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేయడమే కాకుండా చివరకు కారు కూడా ఎక్కకుండా అడ్డుకోవడంతో గత్యంతరం లేక ఆయన తిరుగుముఖం పట్టారు.
 
 గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి వర్మ వ్యవహార శైలిలో మార్పు వచ్చిందని కేడర్ ఆవేదన చెందుతోంది. వర్మ ఇటీవల టీడీపీలో ఉన్నవారిని పొమ్మనకుండా పొగబెడుతున్న తీరుతో దాదాపు అన్ని సామాజికవర్గాల్లోని పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ పిఠాపురం రూరల్ మండల అధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్ ఉండగానే ఇటీవల ఎరుబండి రాజారావును వర్మ ఏకపక్షంగా రూరల్ అధ్యక్షుడిగా నియమించేశారు. దివంగత మాజీ ఎమ్మెల్యే వెన్నా నాగేశ్వరరావు స్వగ్రామం జల్లూరులో ఆయన కుమారుడు జగదీష్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా జనవరి 18న ఎన్టీఆర్ వర్థంతిని నిర్వహించడంతో స్థానిక పార్టీ నాయకులు వర్మపై మండిపడ్డారు.
 
  చిత్రాడలో వెలమ సామాజికవర్గానికి చెందిన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, సర్పంచ్ సింగంపల్లి బాబూరావుకు తెలియకుండా మొత్తం గ్రామ కమిటీలో మార్పులు చేర్పులు చేశారు. దీంతో వర్మ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలన్నింటికీ పేడ పూసి, దిష్టిబొమ్మలను దహనం చేసి, సామాజిక వర్గాలకు అతీతంగా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మాజీ జడ్పీటీసీ జవ్వాది కృష్ణమాధవరావు కూడా వర్మ తీరుపై విసుగెత్తిపోయి పార్టీకి దూరంగా ఉంటున్నారు. వీరికి మద్దతుగా బీసీల్లో శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంగళి సుబ్బారావు కూడా వర్మ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
 
 ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న నాయకత్వంలో ఆత్మాభిమానం చంపుకుని ముందుకు సాగలేమని ద్వితీయ శ్రేణి మండిపడుతోంది. వర్మ వ్యవహార శైలిపై తమ అసంతృప్తిని ఇటీవల కాలంలో పలు దఫాలు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సహా పార్టీ జిల్లా ముఖ్యుల ముందు పెట్టినా ఫలితం లేకపోవడంతో నాయకులు తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వర్మకే టిక్కెట్టు కేటాయించాలని అధిష్టానం నిర్ణయించుకుంటే అందుకు తగ్గట్టుగానే స్పందించాలని పార్టీ కీలక నేతలు సమాలోచనలు చేస్తున్నారు.
 
 టిక్కెట్టు అంటూ వర్మకు కేటాయిస్తే పార్టీలోనే ఉండి వ్యతిరేకంగా పని చేయడమా లేక, ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేయడమా అనేదానిపై వర్మ వ్యవహార శైలి నచ్చని నేతలంతా వచ్చే 15 రోజుల్లో ఒక స్పష్టత తీసుకువచ్చేందుకు సిద్ధపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వర్మ రెండో స్థానంలో నిలవడమే ప్రామాణికమనుకుంటే, దాని వెనుక ఎంతమంది కష్టపడి పని చేశారనేది లెక్క తీసుకోరా? అని కేడర్ ప్రశ్నిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే తాడోపేడో తేల్చుకోవడం మినహా గత్యంతరం లేదని నేతలు కుండబద్దలు కొడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement