సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘ఆలూ లేదు చూలూ లేదు’ సామెతను తలపిస్తోంది పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి. రాష్ట్ర విభజనపై పార్టీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో టీడీపీకి జిల్లాలో అడ్రస్ లేకుండాపోయే పరిస్థితులుంటే పిఠాపురంలో మాత్రం తెలుగు తమ్ముళ్లు సీట్ల సిగపట్లు పడుతున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌విఎస్ వర్మ విధానాలు నచ్చక ఒక బలమైన సామాజికవర్గం నుంచి సీనియర్లు పార్టీ వీడేందుకు సిద్ధపడుతున్న పరిణామాలతో రెండు గ్రూపులూ తెరచాటు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ‘వస్తున్నా మీకోసం’ యాత్రలో చంద్రబాబు జిల్లాకు వచ్చినతరువాత ఈ దిశగా ప్రయత్నాలు మరింత ఊపందుకున్నాయి. ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌విఎస్ వర్మ ఒంటెత్తు పోకడలు నచ్చక పలువురు సీనియర్‌లు పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనతో ఉన్నారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతంతో ప్రజల్లో విశ్వాసం కోల్పోగా, నియోజకవర్గంలో పార్టీకి పరువు కాస్తోకూస్తో మిగిలి ఉందంటే వర్మ విధానాలతో అది కూడా అడుగంటిందని మొదటి నుంచి టీడీపీని అంటిపెట్టుకుని వున్న నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండో స్థానంలో నిలవడమే ప్రాతిపదికగా వర్మ వచ్చేసారి కూడా టిక్కెట్టు తనకే ఖాయమవుతుందనే ధీమాతో తన వ్యతిరేక వర్గాన్ని పార్టీలో దూరం పెడుతున్నారనే విమర్శలున్నాయి. మీకోసం యాత్రలో బాబు టిక్కెట్టు కాపు సామాజికవర్గానికేనన్న సంకేతాలు ఇవ్వడంతో దివంగత మాజీ ఎమ్మెల్యే వెన్నా నాగేశ్వరరావు తనయుడు జగదీష్ తెరమీదకు వచ్చారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తోన్న జగదీష్ అభ్యర్థిత్వానికి బాబు తనయుడు లోకేష్ కూడా సానుకూలత వ్యక్తం చేశారనే ప్రచారాన్ని వర్మ వర్గీయులు కొట్టిపారేస్తున్నారు.
సీనియర్ల గుర్రు
పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న లక్షా 97వేల ఓటర్లలో అత్యధికంగా 42శాతం కాపు సామాజికవర్గ ఓటర్లు ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీచేసిన వంగా గీతకు 46వేల623 ఓట్లు, టీడీపీ అభ్యర్థి వర్మకు 45వేల587 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ముద్రగడ పద్మనాభంకు 43వేల431 ఓట్లు వచ్చాయి. 1036 ఓట్ల మెజార్టీతో గీత ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలవడంతో తనను కాదని మరెవరికీ టిక్కెట్టు ఇచ్చే పరిస్థితి లేదని వర్మ చెప్పుకుంటున్నారు. ఇందుకు ముందస్తు వ్యూహంలో భాగంగా టిక్కెట్టు ఆశిస్తోన్న జగదీష్‌తో పాటు పలువురు సీనియర్లను పార్టీ కార్యకలాపాలకు దూరం పెడుతున్నారన్నారంటున్నారు. ఓటు, సీటుతో సంబంధం లేకుండా వర్మ విధానాలతో వచ్చేసారి పార్టీ మూడో స్థానానికే పరిమితం కావడం ఖాయమంటున్న పలు సర్వే నివేదికలతో సీనియర్లు పార్టీకి గుడ్‌బెచైప్పే యోచనలో ఉన్నారని పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. తమను పొమ్మనకుండానే వర్మ పొగబెడుతున్నారని మండిపడుతున్న సీనియర్లు బయటకు పోవాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది. వర్మ వైఖరిని పార్టీ జిల్లా నేతల దృష్టికి తీసుకువెళ్లినా చలనం లేకపోవడంతో గుడ్‌బెచైప్పే యోచనలో ఉన్నారంటున్నారు.
బీసీలకే ప్రాధాన్యమా?
గత ఎన్నికల్లో బీసీలు టీడీపీ పక్షాన నిలబడటంతోనే రెండో స్థానం దక్కిందనే అభిప్రాయంతో వర్మ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నారని వైరిపక్షం గుర్రుగా ఉంది. కావాలనే పార్టీ కార్యకలాపాలకు దూరం చేస్తున్నారని పిఠాపురం రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీవర్గాల ద్వారా తెలిసింది. పిఠాపురం రూరల్ మండల పార్టీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండా కావాలనే విస్మరిస్తూ వర్మ ఉపాధ్యక్షుడు ఎ.రాజారావుకు పనులు అప్పగిస్తున్నారని విజయకుమార్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్లకు సరైన గు ర్తింపు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదనతో మరో సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు జవ్వాది కృష్ణమాధవరావు సైతం పార్టీ వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. ఈ మేరకు వారిపై అనుచరులు వత్తిడి చేస్తున్నారు. గతంలో ఇదే రకంగా వర్మ తీరునచ్చకే పిఠాపురం మండల తెలుగు యువత అధ్యక్షుడు మాదేపల్లి శ్రీనివాస్ కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాపు సామాజికవర్గ నాయకులే కాకుండా బీసీలలో కూడా కొందరు వర్మ విధానాలు నచ్చక ఇదివరకే బయటకు వచ్చేశారు. ఆ జాబితాలో పంచాయతీ ఎన్నికల అనంతరం వెలమసామాజిక వర్గం నుంచి చిత్రాడ సర్పంచ్ సింగంపల్లి బాబూరావు కూడా ఉన్నారు. వర్మకు బాబూరావు ఒకప్పుడు ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం.
పిఠాపురంలో ముఠాలాట
Published Tue, Sep 17 2013 11:57 PM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement
Advertisement