విలువ ‘ఠీవీ’
Published Wed, Oct 16 2013 1:54 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
నిబద్ధత, అంకితభావానికి పర్యాయపదం.. విలువల రాజకీయాలకు నిలువుటద్దం..స్థానిక సంస్థల హక్కుల కోసం అలుపెరుగని పోరాట సేనాని.. అందరికీ అభివృద్ధిని పంచిన పాలనాదక్షుడు టీవీ. తొలితరం కమ్యూనిస్టు యోధుడిగా, బెజవాడ ప్రథమ మేయర్‌గా ప్రజాజీవితంలో తనదైన చెరగని ముద్ర వేశారు. చిత్తశుద్ధి, పాలనాపటిమ ఉంటే సమగ్రాభివృద్ధిని సాధించడం ఏమాత్రం కష్టం కాదని చాటారాయన. నగరమంటే ఎనలేని మక్కువ. నగరాభివృద్ధికే తుదిశ్వాస వరకూ తపించిన నిజమైన ప్రజానాయకుడాయన. పోరాటమైనా, పాలనైనా, ప్రజాక్షేత్రమైనా వన్నెతగ్గని ఠీవీ .. టీవీ ప్రత్యేకం. అదే ఆయనను ప్రజాహృదయాల్లో చిరస్మరణీయుడ్ని చేసింది.
సాక్షి, విజయవాడ :మేయర్ అంటే ఇలానే ఉండాలని చాటిన ఆదర్శనీయుడు టి. వెంకటేశ్వరరావు(టీవీ) కన్నుమూశారు. కౌన్సిల్‌ను ఎంతో ఠీవీగా, హుందాగా, దేశంలోనే ఆదర్శనీయంగా నడిపిన నేత కనుమరుగయ్యారు. స్థానిక సంస్థల హక్కుల కోసం ఉద్యమించిన గళం మూగవోయింది. నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకూ పనిచేసిన, వామపక్షాల ఐక్యతే ఆ పార్టీలకు, పేదలకు భవిష్యత్తుకు మేలు జరుగుతుందంటూ రెండు ప్రధాన లెఫ్ట్ పార్టీల జాతీయ కార్యదర్శులకు బహిరంగ లేఖలు రాసిన తొలి తరం కమ్యూనిస్టు యోధుడు మహా ప్రస్థానం సాగించారు. సోమవారం రాత్రి కన్నుమూసిన నగర ప్రథమ మేయర్ తాడిపనేని వెంకటేశ్వరరావు (టీవీ)కు పలువురు నేతలు, పట్టణ ప్రముఖులు ఘన నివాళి అర్పించారు.
వైరల్ ఫీవర్‌తో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన స్థానిక ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నిబద్ధతకు, అంకిత భావానికి, దీర్ఘకాలిక విజన్‌కు ఆయన పెట్టింది పేరు. సీపీఐ చీలిక తర్వాత నగర శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి దిగువస్థాయిలో పార్టీ బలోపేతానికి గట్టి పునాదివేశారు. మేయర్‌గా అన్ని వర్గాలు, రంగాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. అధికారులతో పట్టువిడుపులు ప్రదర్శించడం, రాజకీయ పార్టీలతో సమన్వయం సాధించడంలోనూ ఆయన దిట్ట. ఆయన వ్యక్తిత్వం, పాలనా దక్షత, ముందుచూపు తదితర సుగుణాలే టీవీని నవ విజయవాడ నగర నిర్మాతగా నిలిపాయి.
జీవిత విశేషాలు
గుంటూరు జిల్లా చమళ్లపూడి గ్రామంలో 1916లో నవంబర్‌లో ఆయన జన్మించారు. పదో తరగతి వరకూ తెనాలి హైస్కూల్‌లో, డిగ్రీ గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చదివారు. మాకినేని బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, వేములపల్లి శ్రీకృష్ణ, వైవీ కృష్ణారావు తదితరులతో పరిచయం వల్ల కమ్యూనిస్టు సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. 1939లో భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించిన టీవీ ఆ తర్వాత రైల్వే కార్మిక యూనియన్ ఆర్గనైజర్‌గా పనిచేశారు. పార్టీ ఆదేశాలతో 1940లో విజయవాడకు వచ్చారు. విజయవాడ రైల్వే, సిమెంట్ కార్మికుల యూనియన్లలో, ఇతర ప్రజాసంఘాలలో పార్టీ హోల్‌టైమర్‌గా పనిచేశారు. కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
1946-47ల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయుధాల సేకరణ, నిధుల వసూలులో తోడ్పడ్డారు. 1947 నుంచి 1948 మార్చి వరకూ రహస్య జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత అరెస్టు అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బంధానికి గురయ్యారు. డిటెన్యూ ఉత్తర్వులతో కడలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ జైలు కమిటీ మేయర్‌గా దాదాపు మూడు సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. 1951లో జైలు నుంచి విడుదలై విజయవాడ పురపాలక సంఘ ఎన్నికల్లో రెండుసార్లు వరుసగా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1958-59లో వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 1955లో అసెంబ్లీకి పోటీ చేసి చేశారు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిక తర్వాత సీపీఐ విజయవాడ నగర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1967లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయంతో విశాలాంధ్ర విజ్ఞాన సమితి జనరల్ మేనేజర్‌గా నియమితులై 93 వరకూ దాదాపు 26 ఏళ్లపాటు బాధ్యతలు నిర్వహించారు. ఆ కాలంలో భవనాల పునర్నిర్మాణం, ప్రచురణాలయం విస్తరణ, బ్రాంచీల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనుల అమలకు కృషి చేశారు.
1981లో విజయవాడ పురపాలక సంఘం నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ అయింది. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో 31వ డివిజన్ నుంచి గెలుపొందిన ఆయన ప్రథమ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో ఉభయకమ్యూనిస్టు పార్టీలు కలిసి 44 డివిజన్లకు పోటీ చేయగా 32 గెలుచుకున్నాయి. 1995లో మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నికలు జరగగా టీవీ అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆయన మేయర్‌గా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నగర రూపురేఖలు మార్చే ప్రయత్నం చేశారు. కొండ ప్రాంతాలు, మురికివాడలకు కనీస మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారు. అలాగే సత్యనారాయణ పురం రైల్వే ట్రాక్ తొలగింపు, కృష్ణానదీ తీరాన 50 అడుగుల ఎత్తుగల భారత స్వాతంత్య్ర సంగ్రామ దృశ్య సదనం, మాచవరం వివేకానంద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పాఠశాల అభివృద్ధి, సీఆర్ గ్రంథాలయ భవన నిర్మాణానికి కృషి చేశారు. వీధి బాలల కోసం కార్పొరేషన్ సహకారంతో ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ ఏర్పాటు, దానికి కావలసిన స్థలం, నిధులు సమకూర్చడంలో ఆయన పాత్ర మరవలేనిది. స్థానిక సంస్థలను స్వయం పాలనా సంస్థలుగా చేయడం కోసం అవసరమైన అన్ని అధికారాలు, నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని మేయర్ల సంఘం తరపున సుదీర్ఘ పోరాటం నిర్వహించారు. ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్‌కు రెండు పర్యాయాలు వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
2001లో ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలపై ఓ పుస్తకాన్ని ముద్రించారు. 2008లో నగర విశేషాలు తెలిపే ‘విజయవాడ సమగ్ర దర్శిని’ 2009లో ‘విజయవాడ నగర పాలన - కమ్యూనిస్టుల పాత్ర’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. సోవియట్ యూనియన్, నేపాల్, జర్మనీ, శ్రీలంక దేశాలను సందర్శించారు. ఆయన భార్య వసుంధర 2011లో మృతి చెందగా, పెద్దకుమారుడు రమేష్ సిద్ధార్థా అకాడమీలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా, చిన్న కుమారుడు కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖలో ప్రముఖ అధికారిగా పనిచేస్తున్నారు.
గుణదల విజయవాడ, న్యూస్‌లైన్ :రాజకీయాలకు అతీతంగా పేదల అభివృద్ధికి పాటు పడిన అభ్యుదయమూర్తి టి.వెంకటేశ్వరరావు మృతి పార్టీకి, నగర ప్రజలకు తీరని లోటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. విశాలాంధ్ర కార్యాలయం ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం వెంకటేశ్వరరావు సంతాప సభ జరి గింది. ముఖ్యఅతిథిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ కమ్యూనిస్ట్ సిద్ధాం తాలను అనుసరిస్తూ క్రమశిక్షణతో జీవి తాన్ని ఉన్నత స్థితిలో నిలిపిన వ్యక్తి టీవీఆర్ అని కొనియాడారు. విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పడిన సమయంలో తొలి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన పేద ప్రజల కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారని గుర్తుచేశారు. తాగు నీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొండ ప్రాంత ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారని వివరించారు. నగర సమగ్రాభివృద్ధికి వెంకటేశ్వరరావు కృషి చేసినందుకే ప్రజలు రెండో సారి కూడా ఆయననే మేయర్‌గా ఎన్నుకుని గౌరవించారని పేర్కొన్నారు.
బాలలంటే ప్రత్యేక శ్రద్ధ
చిన్నారుల కోసం టీవీఆర్ ఎంతో కృషిచేశారని నవజీవన్ బాల భవన్ నిర్వాహకుడు ఫాదర్ కోషి కొనియాడారు. చిన్నారుల భవిష్యత్ కోసం, వీధి బాలల పరిరక్షణకు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థను ఏర్పాటు చేశారని, నగర పాలక సంస్థ సహకారంతో ఆ సంస్థను సమర్థంగా నిర్వహించారని గుర్తుచేశారు. తాను కార్పొరేటరుగా ఉన్న సమయంలో వెంకటేశ్వరరావు సలహాలను పాటించేవాడినని మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ గుర్తుచేసుకున్నారు. విజయవాడ అభివృద్ధిలో వెంకటేశ్వరరావు కృషి ఎంతో ఉందని కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజి అన్నారు. కొండ ప్రాంతంలో నివసించే పేదలకు అండగా నిలిచి, వారికి మౌలిక వసతుల కల్పనకు శ్రమించారని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నేతగా, ప్రజా పక్షపాతిగా, సామాజిక వేత్తగా ఎదిగిన టి.వెంకటేశ్వరరావు ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు కొనియాడారు.
అంతిమయాత్ర
టి.వెంకటేశ్వరరావు భౌతికకాయాన్ని ఆయన కోరిక మేరకు పెద్ద అవుట పల్లి పిన్నమనేని సిద్ధార్ధ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ అంతిమ యాత్రలో సీసీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. విశాలాంధ్ర కార్యాలయం నుంచి అవుటపల్లి వరకూ విప్లవ జోహార్లు అర్పిస్తూ యాత్ర కొనసాగింది.
టీవీఆర్ సేవలు అపూర్వం
మాజీ మేయర్ టి.వెంకటేశ్వరరావు నగరానికి అందించిన సేవలు అపూర్వమని వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం నగర కన్వీనర్ కొనిజేటి రమేష్ మంగళవారం ఓ ప్రకటలో పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. వసంత మల్లికార్జునస్వామి ఆలయ మాజీ చైర్మన్ బొట్టా భాస్కరరావు మరో ప్రకటనలో వెంకటేశ్వరరావు చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్రం లోని వివిధ నగర పాలకసంస్థల సమస్యలపై టీవీఆర్ పోరాడారని బొట్టా భాస్కరరావు, దుర్గా కోఆపరేటివ్ బ్యాంచ్ వైస్ చైర్మన్ అల్లం పూర్ణ, బ్యాంక్ డెరైక్టర్లు సయ్యద్ అతీక్, చొక్క మల్లికార్జునరావు, నాయీ బ్రాహ్మణ సంఘ నాయకుడు చిప్పాడ రామ్మో హనరావు, సామాజిక కార్యకర్త డి. రాములు కొనియాడారు.
టీవీకి ప్రముఖుల నివాళి
విజయవాడ : పేదల అభ్యున్నతికి కృషిచేసిన కమ్యూనిస్ట్టు ఉద్యమనేత, విజ యవాడ నగర తొలి మేయర్ టి.వెంకటేశ్వరరావు భౌతికకాయాన్ని విశాలాంధ్ర కార్యాలయ ప్రాంగణంలో పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. టీవీ భౌతికకాయంపై విశాలాంధ్ర ఎడిటోరియల్ బోర్డు చైర్మన్ ఈడ్పుగంటి నాగేశ్వరరావు ఎర్రజెండా కప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, పార్టీ సీని యర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ర్ట కార్యదర్శి వర్గసభ్యులు జల్లి విల్సన్, చాడా వెంకటరెడ్డి, రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సూర్యదేవర నాగేశ్వరరావు, కె.సుబ్బరాజు, అక్కినేని వనజ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, కె. అరుణ, విశాలాంధ్ర ఎడిటర్ కె.శ్రీనివాసరెడ్డి, మాజీ ఎడిటర్ సి.రాఘవాచారి, విశాలాంధ్ర విజ్ఞాన సమితి జనరల్ మేనేజర్ పి.హరినాథరెడ్డి,
మాజీ జీఎం వై.చెంచయ్య, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు పెన్మత్స దుర్గాభవాని, ఏఐవైఎఫ్ రాష్ట అధ్యక్షుడు నవనీతం సాంబశివరావు తదితరులు టీవీ భౌతికకాయం వద్ద శ్రద్ధాం జలి ఘటించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, జలీల్ ఖాన్, పార్టీ నాయకులు పి.గౌతమ్‌రెడ్డి, తాతినేని పద్మావతి, టీకేఆర్, ఎమ్మెల్యేలు దేవి నేని ఉమామహేశ్వరరావు, దాసరి బాలవర్థరావు, మల్లాది విష్ణు, యల మంచిలి రవి, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), దేవినేని అవి నాష్, సీపీఎం, సీపీఐ నాయకులు సిహెచ్.బాబూరావు, టి.సుబ్బరాజు, దోనేపూడి శంకర్, మాజీ కార్పొరేటర్లు, పారి శ్రామిక వేత్తలు, ఉద్యోగులు,
పలువురు అధికారులు టీవీఆర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, నన్నపనేని రాజకుమారి, బొడ్డు నాగేశ్వరరావు, మాజీ ఎంపీలు గద్దె రామ్మోహన్, చెన్నుపాటి విద్య, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్, విజయవాడ నగర కమిషనర్ పండాదాస్, మాజీ మేయర్లు జంధ్యాల శంకర్, పంచుమర్తి అనూరాధ, లంకా గోవింద రాజులు, రత్నబిందు, మల్లికాబేగం, సీపీఎం నాయకులు ఉమామహేశ్వరరావు, ఆర్.రఘు, సమతాపార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వై.వి.కృష్ణారావు, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం రవికుమార్, వివిధ రంగాల ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, సినీ నటుడు మాదల రంగారావు ఫోన్‌లో, విజయవాడ ఎంపీ లగడపాటి ఓ ప్రకటన ద్వారా తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఇప్పటి మేయర్లకు
ఆదర్శప్రాయుడు : తాడి
విజయవాడ నగర ప్రథమ మేయర్ టి.వేంకటేశ్వరరావు ఇప్పటి మేయర్లకు ఆదర్శప్రాయుడని మాజీ మేయర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి తాడి శకుంతల అన్నారు. తొలి మేయరుగా, అఖిల భారత మేయర్ల సంఘం అధ్యక్షుడుగా ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.
పేదలకు అండగా నిలిచిన టీవీ : అడుసుమిల్లి
విజయవాడ నగర ప్రథమ మేయర్‌గా టి.వెంకటేశ్వరరావు పేదలకు వెన్నుదన్నుగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయకాష్ మంగళవారం ఒక ప్రకటనలో కొనియాడారు. రెండు సార్లు మేయర్‌గా పనిచేసిన టీవీ నిష్పక్షపాతంగా వ్యవహరించేవారని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విలువలతో రాజకీయాలు
నడిపిన వ్యక్తి : లగడపాటి
నగర ప్రథమ మేయర్‌గా పనిచేసిన టి.వెంకటేశ్వరరావు నిజాయితీగా వ్యవహరించేవారని, విలువలతో కూడిన రాజకీయాలు నడిపించిన వ్యక్తిగా గుర్తింపు పొందారని ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓ ప్రకటనలో కొనియాడారు. టీవీ మృతి నగర ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.
పిన్నమనేని సిద్ధార్థకు భౌతికదేహం అప్పగింత
టి.వెంకటేశ్వరరావు భౌతికదేహాన్ని మంగళవారం సాయంత్రం చినఆవుటపల్లిలోని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలకు బంధువులు, సీపీఐ రాష్ట్ర నేత నారాయణ చేతుల మీదుగా అప్పగించారు. విజయవాడ నుంచి అంబులెన్స్‌లో టీవీ భౌతికకాయాన్ని పార్టీ నాయకులు, అభిమానులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.నారాయణ, జర్నలిస్ట్ నేత శ్రీనివాసరెడ్డి, విశాలాంధ్ర మాజీ సంపాదకులు రాఘవాచారి, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, మాజీ ఎమ్మెల్యేలు కె.సుబ్బరాజు, నాజర్ వలీ, సీపీఐ నాయకులు దోనేపూడి శంకర్, సీపీఎం నాయకులు సీహెచ్ బాబూరావు, జెడ్పీ మాజీ చైర్మన్ కె.రాఘవరావు పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల డెరైక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంబులెన్స్ నుంచి దించిన టీవీ పార్ధివదేహాన్ని పార్టీ శ్రేణులు, అభిమానుల తుది వీడ్కోలు మధ్య కళాశాల లోపలికి తెచ్చారు. వైద్య కళాశాల యాజమాన్యం, నర్సింగ్ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది టీవీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ విద్యార్థులు, సిబ్బంది గౌరవవందనం చేశారు.
నేత్రదానం టీవీ అభీష్టం మేరకు ఆయన నేత్రాలను స్వేచ్ఛా గోరా ఐ బ్యాంక్‌కు అప్పగించారు.
Advertisement