తాగునీటికి మొదటి ప్రాధాన్యం
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
కర్నూలు: తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మండలాలకు మంజూరయిన నిధులను ఖర్చు చేయాలని అధికారులకు, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం పత్తికొండ, డోన్ నియోజకవర్గ పరిధిలోని అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లతో గ్రామీణ ప్రాంతాల్లో నీరు వృథా అవుతోందన్నారు.
అలాంటి చోట్ల వెంటనే కొత్త పైపులైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ రహదారులకు ఎంత బడ్జెట్ ఉంది, ఇంకా ఎంత అవసరమవుతుంది అనే విషయంపై అడిగి తెలుసుకున్నారు. సరిగాలేని రోడ్లను గుర్తించి, వాటి నిర్మాణం కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య మెరుగుదల కోసం సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, ఇంటర్నల్ రోడ్లు నిర్మించాలన్నారు. పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి జెడ్పీటీసీ సభ్యులు సుకన్య, పురుషోత్తం చౌదరి, వరలక్ష్మి, లక్ష్మిదేవిలతో పాటు ఎంపీపీలు తలారి లక్ష్మి, పద్మావతి, గురుస్వామి, సుంకులమ్మ, శైలజ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ క్రిష్ణారెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుల చేరికను అడ్డుకున్న టీడీపీ నేతలు...
ప్యాపిలి మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధ పడగా ప్యాపిలికి చెందిన టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ప్యాపిలికి చెందిన కాంగ్రెస్ నాయకులు బోరెడ్డి పుల్లారెడ్డి, కమతం భాస్కర్‌రెడ్డి, సింగిల్‌విండో ఛైర్మన్‌వెంకటరెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ నాయకులు సోమవారం కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహానికి తరలి వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం నాయకులు ప్యాపిలి ఎంపీపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వారి చేరికను అడ్డుకోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని పార్టీలో చేర్చుకుంటే బావుండదని స్థానిక నాయకులు అడ్డుకోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు.