గొల్లుమన్న మత్స్యకార పల్లెలు | Fisher Men Caught By Pakistan Coast Guards | Sakshi
Sakshi News home page

గొల్లుమన్న మత్స్యకార పల్లెలు

Published Fri, Nov 30 2018 3:27 PM | Last Updated on Mon, Dec 3 2018 8:11 PM

Fisher Men Caught By Pakistan Coast Guards - Sakshi

పూసపాటిరేగ/భోగాపురం: సముద్రమే వారికి సర్వస్వం. వేటే జీవనాధారం. దానికోసం ఎన్నికష్టాలైనా ఎదురీదుతారు. ఎంత దూరానికైనా పొట్టపోషణకోసం వెళ్లిపోతారు. అలా వెళ్లిన జిల్లాకు చెందిన ఐదుగురు మత్స్యకారులు పాకిస్తాన్‌ సరిహద్దులోకి వెళ్లిపోవడంతో అక్కడి కోస్టుగార్డులకు చిక్కి బందీలుగా మారారు. విషయం తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు ఇప్పుడు గొల్లుమంటున్నారు.

ఇక్కడ వేటసాగక..
పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని తీరప్రాంతంలో వేట సరిగ్గా సాగడం లేదు. ఏడాదిలో దాదాపు రెండు నెలలు నిషేధం... మిగిలిన కాలంలో కొన్నాళ్లు రకరకాల తుఫాన్లు, అల్పపీడనాలు తదితర సమయాల్లో నెలల తరబడి వేట సాగడం లేదు. దీంతో జీవనాధారం లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఎంతోమంది మత్స్యకారులు బతుకు తెరువు కోసం గుజరాత్‌లోని హీరావల్‌ వెళ్లి అక్కడ కొందరివద్ద వేటపనికి కుదిరి ఇక్కడి కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. ఇలా వెళ్లినవారు అక్కడ వేటకోసం సముద్రంలోకి వెళ్లి రకరకాల చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. ఇక్కడ సక్రమంగా వేట సాగితే ఇక్కడినుంచి వెళ్తే పరిస్థితి ఉండదని స్థానికులు చెబుతున్నారు. అదే విధంగా పూసపాటిరేగ తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాం గ్రామాలకు చెందిన ఐదుగురు ఇప్పుడు పాకిస్తాన్‌ సరిహద్దులోకి అనుకోకుండా వెళ్లి అక్కడి రక్షక దళాలకు చిక్కారు.

రెండు గ్రామాల్లో కలవరం 
పూసపాటిరేగ మండలం తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాంనకు చెందిన పలువురు మత్స్యకారులు ఆగస్టు 15వ తేదీన గుజరాత్‌ రాష్ట్రం హీరావల్‌వెళ్లి చేపలవేట నిమిత్తం బోట్లులో కూలీలుగా పనిచేయడానికి కుదిరారు. అక్కడి నుంచి 10 రోజుల క్రితం ఇంజిన్‌ వున్న స్టేయింగ్‌ బోటులో సముద్రంలో వేటకు వెళ్లారు. నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో పాకిస్తాన్‌ జలాల్లోకి వేటచేస్తూ ప్రవేశించారు. బోర్డర్‌లో వున్న పాకిస్తాన్‌ రక్షణ దళాలు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో తిప్పలవలసకు చెందిన నక్కా అప్పన్న, నక్కా ధనరాజు, నక్కా నరిసింగు, బర్రి బవిరీడు, భోగాపురం మండలం ముక్కాంనకు చెందిన మైలపల్లి గురువులు ఉన్నారు. ఇందులో నక్కా అప్పన్న, నక్కా ధనరాజు తండ్రీకొడుకులు, నక్కా నరిసింగు(18) అప్పన్నకు బంధువు.


 
విడుదలకు కృషి చేయాలి
పాకిస్తాన్‌లో బందీలుగా ఉన్న మత్స్యకారులను తక్షణమే విడుదల చేయడానికి కేంద్రప్రభుత్వం చొరవ చూపాలని బాధిత కటుంబాలు వేడుకొంటున్నాయి. గతంలో పాకిస్తాన్‌లో చిక్కిన వారిని సంవత్సరాలపాటు జైలులో ఉంచేవారని, బందీలుగా వున్న వారికి భోజన సౌకర్యం కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడిన రోజులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయన్నారు. జిల్లా కలెక్టర్‌ హరివహర్‌లాల్‌ స్పందించి ప్రభుత్వానికి నివేదించాలని మత్స్యకారులు కోరుతున్నారు. అయితే మత్స్యకారులు చిక్కుకుని 24 గంటలు గడిచినా స్థానిక అధికారులు కనీసం స్పందించడం లేదని వాపోతున్నారు. చింతపల్లి మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు తిప్పలవలసలో బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి సమాచారం మాత్రం సేకరించారు. మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు మాత్రం ఎక్కడా ఆచూకిలేదు.

నా పెనిమిటి ఇంటికి వస్తాడా... 
మైలపల్లి గురువులకు భార్య దానయ్యమ్మ, కొడుకు దాసు, కుమార్తె సత్య ఉన్నారు. ఇద్దరు పిల్లలకీ వివాహాలు అయిపోయాయి. కొడుకు కర్ణాటక రాష్ట్రం మంగుళూరు వద్ద ఉంటూ వేట చేసుకుని జీవిస్తున్నాడు. భార్య గ్రామంలో చేపలు అమ్ముతూ జీవిస్తుంది. గురువులు ఇతర బోట్లలో వేట పనిచేస్తూంటాడు. సమాచారం తెలుసుకున్న గురువులు భార్య కన్నీటి పర్యంతమవుతోంది. తన భర్తకు 64 సంవత్సరాలుంటాయని, వేరే ఆధారం లేక అంత దూరం వెళ్లాల్సి వచ్చిందనీ, ‘నా పెనిమిటిని వేరే దేశపోళ్ళు తీసుకెళ్ళిపోయారంట... నా పరిస్థితి ఏంటి.. నా భర్త సేమంగా తిరిగొస్తాడా బాబూ.. సెప్పండి బాబూ’ అని కనబడినోళ్ళని అడగడం చూస్తే కడుపు తరుక్కుపోయింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement