గుడివాడలో వ్యవసాయ ఆధారిత కారిడార్
గన్నవరంలో ఐటీ, నందిగామలో ఫార్మా, బయోటెక్ కారిడార్లు
రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
విజయవాడ : తుళ్లూరు ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న రాజధానికి అమరావతి పేరును రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఖరారు చేసింది. ప్రపంచ స్థాయి కొత్త రాజధాని ఏర్పాటుతో పాటు దానికి అనుబంధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటి నుంచో చెబుతున్నవే అయినప్పటికీ వీటిని సత్వరం పూర్తి చేస్తే కృష్ణాజిల్లా రూపు రేఖలే మారిపోతాయి. నూతన రాజధాని నగరానికి కూతవేటు దూరంలో ఉంటుంది.
కృష్ణమ్మపై ఐదు వంతెలు
కృష్ణానదిపై ఐదువంతెనలు నిర్మాణానికి క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఐదు వంతెలను విజయవాడకు గుంటూరుకు మధ్యలో వచ్చే అవకాశం ఉంది. గుంటుపల్లి, ఫెర్రి, చెవిటిక ల్లు, రామన్నపేట, ముత్యాల తదితర ప్రాంతాల్లో వంతెనలు నిర్మిస్తారని భావిస్తున్నారు. ఈ ఐదు వంతెనల నిర్మాణాలను పూర్తయితే నూతన రాజధాని, గుంటూరు జిల్లాలు నగరానికి బాగా దగ్గరగా మారిపోతాయి. రాజధాని నిర్మాణంతో పాటు ఈ వంతెనల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తారని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో కారిడార్‌ల జోరు..
గుడివాడలో వ్యవసాయ ఆధారిత కారిడార్, గన్నవరంలో ఐటీ కారిడార్, నందిగామలో ఫార్మా, బయోటెక్ కారిడార్, మచిలీపట్నం- కాకినాడ అభివృద్ధి కారిడార్ ఏర్పాటుకు క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచస్థాయి రాజధాని నిర్మించనున్న నేపథ్యంలో ఇక్కడకు కొత్త కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిశ్రమలను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో రాబోయే రోజుల్లో జిల్లా రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంది.
మంగళగిరిలో మరో ఎయిర్‌పోర్టు
నగరానికి సమీపంలోని మంగళగిరిలో మరొక ఎయిర్ పోర్టు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గన్నవరం ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తే మంగళగిరి విమానాశ్రయాన్ని డొమెస్టిక్ ఎయిర్ పోర్టుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. మంగళగిరి విమానాశ్రయం వల్ల కొత్త రాజధానితో పాటు విజయవాడ ప్రజలకు విమానాశ్రయం మరింత దగ్గరవుతుంది.
గన్నవరం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా
గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించేందుకు కావాల్సిన 490 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. రైతులకు చెల్లించే పరిహారం విషయంలో స్పష్టత లేకపోవడంతో భూ సేకరణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అంతర్జాతీయ హోదా కల్పించేందుకు క్యాబినేట్ ఆమోదం తెలిపినందున భూ సేకరణ వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్న పాత టెర్నినల్ బిల్డింగ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. త్వరలోనే రూ.150 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త టెర్మినల్ భవనం నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది.
కృష్ణానదిపై ఐదు వంతెనలు
Published Thu, Apr 2 2015 1:15 AM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM
Advertisement
Advertisement