విషాదం
రెండు రోడ్డు ప్రమాదాల్లో..
ఐదుగురు దుర్మరణం
విజయనగరంలో ట్యాంకర్ ఢీకొని ముగ్గురు,
మధురవాడలో లారీ బోల్తా పడి ఇద్దరి మృతి..
తొమ్మిదిమందికి తీవ్రగాయాలు
వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులను రెండు లారీలు పొట్టన పెట్టుకున్నాయి. ఈ ప్రమాదాల్లో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం పట్టణంలో ట్యాంకర్ ఢీకొని ముగ్గురు మృతిచెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో సంఘటనలో విశాఖ జిల్లా మధురవాడలో లారీ బోల్తా పడి ఇద్దరు మృతిచెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ రెండు ప్రమాదాల్లో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి. పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
విజయనగరం క్రైం/ఎల్.కోట: విజయనగరం పట్టణంలోని కాటవీధికి చెందిన సి.కె.మణి (65), సి.నరేంద్ర, సి.ఎస్.ఎన్.మూర్తి, సి.కామేశ్వర శాస్త్రిలు పట్టణంలోని గుమ్చీ సమీపంలో బంధువుల ఉపనయన కార్యక్రమానికి వచ్చారు. ఆ కార్యక్రమం పూర్తిచేసుకుని ఆటోలో ఇంటికి బయలు దేరారు. స్థానిక బుంగవీధికి చెందిన బండ సత్యవతి అనే మహిళ తన ఇంటికి వెళ్లేందుకు అదే ఆటో ఎక్కింది. ఈ ఆటో వెళ్తున్న సమయంలో..పట్టణంలోని రింగురోడ్డు బాబామెట్టకు వెళ్లే రోడ్డులో ఉన్న పెట్రోలు బంకులో ద్విచక్ర వాహనానికి పెట్రోలు పోసుకుని వస్తున్న కిలిమిరాజు (27) అనే వ్యక్తిని కొత్తపేట వైపునుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ తొలుత ఢీకొట్టింది.
వెను వెంటనే ఎదురుగా వస్తున్న ఆటోను కూడా ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ సుంకరి నారాయణరావు (35) అక్కడిక్కడే మృతిచెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న సి.కె.మణి, సి.నరేంద్ర, సి.ఎస్.ఎన్.మూర్తి, సి.కామేశ్వరశాస్త్రి, బైక్‌పై వస్తున్న కిలిమిరాజు(27), బుంగవీధికి చెందిన బండ సత్యవతిలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని కేంద్రాస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించే సరికి కిలిమిరాజు, సి.కె.మణి మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వారిని వైద్యులు విశాఖపట్నం రిఫర్ చేశారు.
ఆటోలో చిక్కుకున్న నారాయణరావు మృతదేహం
ఆటోను ఢీకొట్టిన లారీ..పది అడుగుల దూరం ఈడ్చుకెళ్లి చెట్టుకు ఢీకొట్టడంతో నారాయణరావు డ్రైవరు సీటులోనే మృత్యు ఒడికి చేరాడు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.రాజేశ్వరరావు, ఎస్సై ఎస్.అమ్మినాయుడు, ఏఎస్సై యు.ఎ.రాజు సంఘటన స్థలానికి చేరుకుని ఆటోలో చిక్కుకున్న మృతదేహాన్ని బయటకు తీసేందుకు సుమారు గంటన్నరపాటు తీవ్రప్రయత్నం చేశారు. చివరకు ఆటోను పక్కకు తీసి నారాయణరావు మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
ఆ రోడ్డే కొంప ముంచిది.
గుమ్చీ దగ్గర ఉపనయనం పూర్తయిన సి.కె.మణి కుటుంబ సభ్యులకు తర్వాత ఆదే రోడ్డులో కాటవీధికి వెళ్లే రోడ్డు ఉంది. కానీ ట్రాఫిక్ ఇబ్బందులు, ఇరుకుగా ఉంటుందని భావించి రింగోరోడ్డు మీదుగా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ రోడ్డు సి.కె.మణి మృతికి కారణమవగా, అదే కుటుంబానికి చెందిన మరో ముగ్గురిని తీవ్ర గాయాల పాల్జేసింది.
బతుకు తెరువుకోసం..
మృతిచెందిన ఆటో డ్రైవర్ సుంకరి నారాయణరావు సొంత గ్రామం గంట్యాడ మండలంలోని నరవ. డెంకాడ మండలం గుణుపూరుపేట గ్రామంలోని అత్తవారింటికి బతుకు తెరువుకోసం వెళ్లాడు. ఆటో నడుపుకొంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. నారాయణరావుకు భార్య రమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే ప్రమాదంలో మృతిచెందిన కిమిలిరాజు మున్సిపల్ కాంప్లెక్స్‌లోని కిరాణా షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోపిస్తున్నాడు. రాజుకు భార్య మధు, ఏడాది పాప ఉంది.
డ్రైవర్ పరారీ..
ట్యాంకర్‌ను నడుపుతున్న డ్రైవర్ ప్రమాదం జరగగానే పరారయ్యాడు. మద్యం మత్తులోనే డ్రైవర్ ఈ ప్రమాదానికి కారకుడయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విశాఖ జిల్లాలో..
ముమ్మనివానిపాలె, కొత్తవలస(లక్కవరపుకోట): విశాఖ జిల్లా మధురవాడ సమీపంలోని మారికవలస వద్ద లారీ బోల్తాపడి ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్తవలస మండలం నుంచి విశాఖపట్నం జిల్లాకు సిమెంట్ ఇటుకలను లారీపై తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు లారీ బోల్తా కొట్టడంతో లారీపై ఉన్న కొత్తవలస మండలంలోని ముమ్మనిపాలెం చెందిన బోగాది అచ్చిబాబు(28), బోగాది అప్పారావు(58) అనే వ్యక్తులు మృతి చెందారు. ఇదే ప్రమాదంలో పెద్దఅచ్చిబాబు, రమణ, రాజాన పైడిరాజు, పిల్లా గణేష్‌లు తీవ్రగాయాలపాలయ్యారు. మృతుడు అచ్చిబాబుకు భార్య లక్ష్మి, ఓ బాబు, పాప ఉన్నారు. అప్పారావుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.